APUTF On UPS : ఓపీఎస్ తప్ప మరే పెన్షన్ స్కీమ్ అంగీకరించం, యూపీఎస్ పై ఈ నెల 30న ఉద్యోగుల ఆందోళన
27 August 2024, 15:09 IST
- APUTF On UPS : ఓపీఎస్ తప్ప మరే పెన్షన్ పథకాన్ని అంగీకరించమని యూటీఎఫ్ ఉద్యోగులు తెలిపారు. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన యూపీఎస్ కు వ్యతిరేకంగా ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని పిలుపునిచ్చారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఓపీఎస్ తప్ప మరే పెన్షన్ స్కీమ్ అంగీకరించం, యూపీఎస్ పై ఈ నెల 30న ఉద్యోగుల ఆందోళన
APUTF On UPS : పాత పెన్షన్ పథకం (ఓపీఎస్) తప్ప మరే పెన్షన్ స్కీంను అంగీకరించబోమని, కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏకీకృత పెన్షన్ స్కీమ్ (యూపీఎస్)కు వ్యతిరేకంగా ఆందోళన యూనైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ (యూటీఎఫ్) పిలుపు ఇచ్చింది. ఈ మేరకు యూటీఎఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎన్.వెంకటేశ్వరరావు, కేఎస్ఎస్ ప్రసాద్ ఫెడరేషన్ ఆఫీస్ బేరర్ల సమావేశంలో మాట్లాడుతూ.. పాత పెన్షన్ స్కీమ్‌ను పునరుద్ధరించాల్సిన కేంద్ర ప్రభుత్వం సీపీఎస్‌ను రద్దు చేయకుండా యూపీఎస్ పేరుతో మరో పథకాన్ని తీసుకురావడాన్ని ఖండించారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో అన్ని తాలూకా కేంద్రాల్లో ఆందోళనలు చేపట్టాలని పిలుపు ఇచ్చారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఈ నిరసన కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపు ఇచ్చారు. పాత పెన్షన్ పునరుద్ధరించాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్రం అంకెల గారడీ
ఇప్పటికే సీపీఎస్ రద్దు చేసి, ఓపీఎస్‌ను అమలు చేయాలని ఏపీ, తెలంగాణతో పాటు అనేక రాష్ట్రాల్లో ఆందోళనలు కొనసాగుతోన్నాయని, ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇలా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ (యూపీఎస్) తీసుకురావడం దారుణమన్నారు. సీపీఎస్ కంటే యూపీఎస్ మెరుగైనదని అంకెల గారడీ కేంద్ర ప్రభుత్వం చేసిందని తెలిపారు.
ఉద్యోగులు, ఉపాధ్యాయుల వాటాతో సంబంధం లేకుండా అన్ని రకాల సదుపాయాలు ఉండే ఓపీఎస్ కంటే మరేదీ తాము అంగీకరించమని స్పష్టం చేసింది. రాష్ట్రంలో గత వైసీపీ ప్రభుత్వం 2022 ఏప్రిల్ 22న సీపీఎస్ స్థానంలో జీపీఎస్ విధానాన్ని ముందుకు తీసుకొచ్చిందని, ఇది కూడా సరిగ్గా అలాంటిదేనని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీపీఎస్‌ను యూటీఎఫ్, ఇతర ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయని గుర్తు చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన రోజుల వ్యవధిలోనే...జీపీఎస్ చట్టం అమలు చేసేందుకు గెజిట్ విడుదల అయ్యిందని, దీన్ని యూటీఎఫ్ తీవ్రంగా వ్యతిరేకించిందన్నారు. దీంతో ప్రభుత్వం జీపీఎస్ చట్టాన్ని తాత్కాలికంగా అబియన్స్‌లో పెట్టిందని గుర్తు చేశారు. సీపీఎస్, జీపీఎస్, యూపీఎస్ ఏదైనా పెన్షన్ ఉద్యోగుల హక్కు అని, భిక్షకాదని చెప్పిన సుప్రీంకోర్టు తీర్పునకు భిన్నంగా ఉన్నాయని తెలిపారు.
కార్పొరేట్లకు, షేర్ మార్కెట్ మాయాజాలానికి ఉపయోగడే సీపీఎస్, యూపీఎస్ అమలను ఆపాలని, ఓపిఎస్ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓపిఎస్‌కు సీపీఎస్, యూపీఎస్‌లు ప్రత్యామ్నాయం కాదని స్పష్టం చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేయొద్దని, ఉద్యోగ, ఉపాధ్యాలయు కన్నెర్ర చేస్తే ఏం జరుగుతోందో అందరికి తెలుసని హెచ్చరించారు.
జగదీశ్వరరావు జరజాపు
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు