OPS Protest : దేశ వ్యాప్తంగా ఓపీఎస్ అమలు చేయాల్సిందే, పెన్షన్ నిధి ఇవ్వకపోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం- స్థిత ప్రజ్ఞ-delhi ops unions protest govt employees demands cancel cps implement ops in all states ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ops Protest : దేశ వ్యాప్తంగా ఓపీఎస్ అమలు చేయాల్సిందే, పెన్షన్ నిధి ఇవ్వకపోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం- స్థిత ప్రజ్ఞ

OPS Protest : దేశ వ్యాప్తంగా ఓపీఎస్ అమలు చేయాల్సిందే, పెన్షన్ నిధి ఇవ్వకపోవడం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం- స్థిత ప్రజ్ఞ

Bandaru Satyaprasad HT Telugu
Oct 01, 2023 06:01 PM IST

OPS Protest : దేశ వ్యాప్తంగా సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. దేశంలోని పలు రాష్ట్రాల ఉద్యోగులు దిల్లీలో భారీ బహిరంగ సభ నిర్వహించాయి.

ఓపీఎస్ యూనియన్
ఓపీఎస్ యూనియన్

OPS Protest : దేశ రాజధాని న్యూ దిల్లీ నడి బొడ్డున రాంలీల మైదానంలో నేషనల్ మూవ్మెంట్ ఫర్ ఓల్డ్ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ ఆధ్వర్యంలో సెక్రెటరీ జనరల్ స్థిత ప్రజ్ఞ నేతృత్వంలో భారీ బహిరంగ సభ జరిగింది. ఈ సభకు దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో సీపీయస్ విధానంలో ఉన్న ఉద్యోగ,ఉపాధ్యాయులు హాజరైయ్యారు. ఉత్తర్ ప్రదేశ్ అధ్యక్షులు విజయ్ కుమార్, పంజాబ్ రాష్ట్ర అధ్యక్షులు సుఖ్జీత్ సింగ్, తెలంగాణ నుంచి సీపీయస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్వల్ శ్రీకాంత్, కోశాధికారి నరేష్ గౌడ్, మహారాష్ట్ర నుంచి విటేష్ కండెల్కర్, కేంద్ర, రాష్ట్ర, ఆర్డినెన్స్ , రైల్వే, ఆటోనోమాస్ ఉద్యోగ ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సభకు ముఖ్య అతిథిగా కిసాన్ సంఘ నేత రాకేష్ టికాయత్ హాజరయ్యారు.

ఉద్యోగులు సామాజిక భద్రత కోల్పోతున్నారు

ఈ సందర్భంగా సెక్రటరీ జనరల్ స్థిత ప్రజ్ఞ మాట్లాడుతూ కొత్త పెన్షన్ విధానం ఉద్యోగ ఉపాధ్యాయులకు, రాష్ట్ర, దేశ ప్రయోజనాలకు కాకుండా కేవలం కార్పొరేట్లకు సొమ్ము నింపడానికి ఉందని ఆరోపించారు. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా ఉద్యోగుల సొమ్ము 9 లక్షల కోట్లు షేర్ మార్కెట్ లో ఉందన్నారు. ఇటీవల సీపీఎస్ వల్ల పదవీ విరమణ పొందిన ఉద్యోగ ఉపాధ్యాయులు అధికారులు కేవలం నెలకు రూ.1200, రూ.1800 పెన్షన్లు పొందుతున్నారన్నారు. దీంతో వారికి జీవనోపాధి లేక తమ సామాజిక భద్రతను కోల్పోతున్నారన్నారు. ఇటీవల దేశాన్ని రక్షించడానికి అత్యున్నత త్యాగం చేసిన పారా మిలిటరీ బలగాలకు కూడా పాత పెన్షన్ విధానాన్ని నిరాకరించడం చాలా దుర్భరనీయం అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వృద్ధాప్యంలో ఉన్న ప్రజలకు సామాజిక భద్రత కల్పించడం గురించి ఆలోచిస్తుంటే, 30-40 సంవత్సరాలు ప్రభుత్వానికి సేవలు అందించిన ఉద్యోగుల బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకుంటుందని ఆరోపించారు.

9.87 లక్షల కోట్ల పన్ను వసూళ్లు

2003 దేశ జీడీపీలో 12వ స్థానం, ప్రస్తుతం ప్రపంచంలో ఇండియా జీడీపీలో ఐదవ స్థానంలో కొనసాగుతుందని, 2003-04 భారతదేశం బడ్జెట్ పరిమాణం 4.4 లక్షల కోట్లు కానీ నేడు అది 2023-24 లో 45 లక్షల కోట్లకు చేరిందని స్థిత ప్రజ్ఞ తెలిపారు. ఇంతటి బడ్జెట్ లో ఉద్యోగుల పాత్ర చాలా గొప్పదని అన్నారు. ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక ప్రకారం 9.87 లక్షల కోట్ల పన్ను వసూళ్లు నమోదయ్యాయని ఇది ఉద్యోగి నిస్వార్థ సేవ వల్లే ప్రభుత్వ ఆదాయం పెరిగిందన్నారు. ఇటీవల కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ రద్దు చేసినటువంటి రాజస్థాన్, చతీస్ గఢ్, ఝార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ లో ఉద్యోగుల కంట్రిబ్యూషన్, ప్రభుత్వం కంట్రిబ్యూషన్ దాదాపు 2004 నుంచి రాజస్థాన్ రూ.39 వేల కోట్లు ,చత్తీస్ గఢ్ లో రూ.18 వేల కోట్లు, జార్ఖండ్ రూ.12 వేల కోట్లు హిమాచల్ ప్రదేశ్ రూ.9 వేల కోట్లని తెలిపారు. కేంద్ర ఆర్థిక శాఖ, పీఎఫ్ ఆర్డీఏ ప్రత్యేక చొరవ తీసుకొని వారి సొమ్మును తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏ రాష్ట్రం అయితే పీఎఫ్ ఆర్డీఏ నుంచి ఎగ్జిట్ అవ్వాలనుకుంటుందో వాటికి ఆ అవకాశాన్ని ఇచ్చి రాష్ట్రాలను స్వేచ్ఛను కాపాడుతూ సమాఖ్య స్ఫూర్తిని కొనసాగించాలని కోరారు.

సీపీఎస్ రద్దుకు మద్దతు

ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన కిసాన్ సంఘ్ అధినేత రాకేష్ టికాయత్ మాట్లాడుతూ... రైతు బిడ్డలుగా ఉన్న ఉద్యోగులు చేస్తున్న ఈ పెన్షన్ ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ కు ఈ విధానం పట్ల ఉద్యోగులు పడుతున్న బాధలు గురించి వివరిస్తానన్నారు. సభలో ఉద్యోగ ఉపాధ్యాయుల చేత సీపీఎస్ రద్దు చేయని రాష్ట్రాల్లో ఓట్ ఫర్ ఓపీఎస్ కొనసాగించాలని ప్రతిజ్ఞ చేశారు. రామ్ లీల మైదానం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ నినాదాలతో హోరెత్తింది.