AP Tourism : భక్తులకు ఏపీ టూరిజం గుడ్ న్యూస్ - ‘పంచారామాల’ యాత్రకు స్పెషల్ టూర్ ప్యాకేజీ
13 November 2024, 13:58 IST
- PancharamaluTour Package : భక్తులకు ఏపీ టూరిజం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ కార్తీక మాసంలోపంచారామాలను దర్శించుకునేందుకు టూర్ ప్యాకేజీని ప్రకటించింది. హైటెక్ నాన్ ఏసీ బస్సు సర్వీస్‌లో పెద్దలకు రూ.1,400, పిల్లలకు రూ.1,120గా నిర్ణయించారు.
పంచారామ యాత్ర ప్యాకేజీ
పవిత్ర కార్తీక మాసంలో పంచారామాలను దర్శించుకునేందుకు భక్తుల కోసం ఆంధ్రప్రదేశ్ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) పంచారామ యాత్ర ప్యాకేజీని ప్రకటించింది. ఒకే రోజులో రాష్ట్రంలోని ఐదు పంచారామ క్షేత్రాలను దర్శించుకునే వీలు కల్పిస్తోంది. అందుకోసం ప్రత్యేక ప్యాకేజీని ఏపీ టూరిజం అందుబాటులోకి తెచ్చింది.
యాత్ర ఇలా సాగుతోంది…
ఏపీ టూరిజం అందుబాటులోకి తెచ్చిన ఈ ప్యాకేజీ కింద బస్సు కార్తీక సోమవారం రోజున ఉదయం ఐదు గంటలకు విజయవాడ నుంచి బయలుదేరుతుంది. పంచారామ క్షేత్రాలన్నీ దర్శించుకుని తిరిగి అదే రోజు రాత్రి 11 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది.
ఈ పంచారామ యాత్రలో తొలుత పంచారామ క్షేత్రమైన అమరావతి (అమర లింగేశ్వరస్వామి) ఆలయాన్ని దర్శించుకుని, అక్కడ నుంచి బయలుదేరి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం (సోమేశ్వర స్వామి) ఆలయానికి చేరుకుని అక్కడ దర్శనం పూర్తి చేసుకుంటారు. అక్కడ నుంచి బయలుదేరి పశ్చిమ గోదావరి పాలకొల్లు (క్షీరరామలింగేశ్వరస్వామి) ఆలయానికి చేరుకుని, అక్కడ స్వామివారిని దర్శించుకుంటారు. ఆ తరువాత అక్కడ నుంచి కోనసీమ జిల్లా ద్రాక్షారామం (భీమేశ్వరస్వామి) ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుంటారు.
అక్కడ నుంచి కాకినాడ జిల్లా సామర్లకోట (కుమార రామలింగేశ్వరస్వామి) ఆలయానికి చేరుకుని, అక్కడ స్వామి వారిని దర్శించుకోవడంతో యాత్ర ముగిస్తుంది. దీంతో సామర్లకోట నుంచి నేరుగా విజయవాడ బస్ కాంప్లెక్‌కు చేరుకుంటుంది.
ప్యాకేజీ ఎలా?
ఈ పంచారామ యాత్ర ప్యాకేజీ హైటెక్ నాన్ ఏసీ బస్సు సర్వీస్‌లో పెద్దలకు రూ.1,400, పిల్లలకు రూ.1,120గా నిర్ణయించారు. ప్యాకేజీలో భాగంగా ప్రయాణికులకు ఉదయం అల్పాహారం ఏర్పాటు చేస్తారు. పంచారామ యాత్ర బస్ రిజర్వేషన్ కోసం అధికారిక వెబ్‌సైట్ నుంచి టిక్కెట్‌ను బుక్ చేసుకోవచ్చు. టిక్కెట్టు బుక్ చేసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్ https://tourism.ap.gov.in/tours ద్వారా చేసుకోవచ్చు. అలాగే మరిన్ని వివరాలకు 9848007025 మొబైల్ నంబర్‌ను సంప్రదించాలి. అలాగే టోల్ ఫ్రీ నంబర్ 1800 4254 5454 నంబర్‌ను సంప్రందించాలని సూచించారు.
ఆర్టీసీ అద్దె బస్సులు
రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు వెళ్లే పర్యటకులకు, అలాగే పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులకు అద్దె బస్సుల సౌకర్యాన్ని ఏపీఎస్ఆర్టీసీ అందుబాటులోకి తీసుకువస్తోంది. రాష్ట్రంలోని ప్రతి డీపోలో కూడా అద్దె బస్సులు అందుబాటులో ఉన్నాయని ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. ఇప్పటికే వివిధ డీపోలను ప్రకటనలు వెలువడ్డాయి.
కార్తీక మాసం భక్తులు, పర్యటకుల దర్శనాలు, సందర్శనాలు ఎక్కువ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ అద్దె బస్సులను సాధారణ ధరలతో అందుబాటులోకి తెస్తోంది. విశాఖపట్నంలోని మద్దిలపాలెం డిపోలో అద్దె బస్సులు అందుబాటులో ఉన్నాయని డీపో మేనేజర్ అరుణకుమారి తెలిపారు. ఈ సీజన్‌లో ఎక్కువ మంది పంచారామ క్షేత్రాలను వెళ్తుంటారు. అద్దె బస్సులు కావాలనుకునేవారు 9959225597, 7382913422 నంబర్‌లను సంప్రదించాలని ఆమె తెలిపారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.