Pancharamalu : పుణ్యక్షేత్రాల దర్శనం.. గన్నవరం నుంచి పంచారామ క్షేత్రాల యాత్రకు ప్రత్యేక సర్వీసులు
Pancharamalu : భక్తులకు ఆర్టీసీ గుడ్‌న్యూస్ చెప్పింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని గన్నవరం నుండి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ నిర్ణయించింది. పంచారామాలకు ప్రత్యేక సర్వీసులు, ప్యాకేజీలు అందుబాటులోకి తీసుకుకొచ్చారు. పంచరామాలను కార్తీకమాసంలో ఒకే రోజు దర్శించే విధంగా ప్రణాళిక చేశారు.
కార్తీకమాసంలో ప్రతి ఆదివారం, సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు గన్నవరం నుండి బస్సులు బయలుదేరుతాయి. పంచారామాలైన అమరావతి (అమరేశ్వరుడు-అమరారామం), భీమవరం (సోమేశ్వరుడు-సోమారామం), పాలకొల్లు (క్షీరరామలింగేశ్వరుడు-క్షీరారామం), ద్రాక్షారామం (భీమేశ్వరుడు-దక్ష రామం), సామర్లకోట (కొమర లింగేశ్వరుడు- కుమార్ భీమేశ్వరరాం) పుణ్యక్షేత్రాలను దర్శనం పూర్తి చేసుకుంటారు. అదే రోజు రాత్రి 8 గంటలకు గన్నవరం కాంప్లెక్స్‌కు చేరుకుంటారు.
ఈ ప్రత్యేక సర్వీసులు నవంబర్ నెలలో ప్రతి ఆదివారం నవంబర్ 4, 10, 11, 17, 18, 24, 25 తేదీల్లో అందుబాటులో ఉంటాయి. టిక్కెట్టు ధర సూపర్ లగ్జరీ, అల్ట్రా డీలక్స్ బస్సులకు వేర్వేరుగా ఉంటుంది. ఒక్కొక్కరికి టిక్కెట్టు ధర అల్ట్రా డీలక్స్ సర్వీసుకు రూ.1,080, సూపర్ లగ్జరీ సర్వీసుకు రూ.1,150గా నిర్ణయించారు. రిజర్వేషన్ టికెట్లను గన్నవరం బస్ డిపో ఆన్‌లైన్‌లోనూ, టికెట్ల ఏజెంట్ల వద్ద ముందుగానే మీకు నచ్చిన సీటును రిజర్వేషన్ చేయించుకోవచ్చు. అదనపు సమాచారం కోసం గన్నవరం ఆర్టీసీ డిపోను లేదంటే, 8790990690, 7382905633, 7382925662 ఫోన్ నంబర్లలో సంప్రదించాలి.
గ్రూప్ విజిట్ కోసం..
అలాగే శబరిమల, ఇతర పుణ్యక్షేత్రాలకు గ్రూపుగా వెళ్లాలనుకుంటే వారికి అద్దె బస్సులను కూడా ఏపీఎస్ ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చింది. అలా గ్రూపుగా వెళ్లానుకునేవారు సమీప ఆర్టీసీ డిపోల వద్దకు వెళ్లి, బస్సులను బుక్ చేసుకోవచ్చు. కొండ కోనాల్లో అనుభవం ఉన్న డ్రైవర్లతోనే బస్సులు అందుబాటులో ఉంటాయి. ప్యాకేజీ ఎంత అనేది? ఆ గ్రూప్ సందర్శించే పుణ్య క్షేత్రాలను బట్టీ ఉంటుంది. ఆ ప్యాకేజీ వివరాలు సంబంధిత ఆర్టీసీ డిపోల్లో అందుబాటులో ఉంటాయి. పుణ్యక్షేత్రాల వివరాలు ఆర్టీసీ సిబ్బంది అందిస్తారు.
(రిపోర్టింగ్- జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)