AP Waterfalls : భూతల స్వర్గాలు ఈ జలపాతాలు- కటికి, తలకోన అద్భుతాలను చూసొద్దామా?
15 May 2024, 13:53 IST
- AP Waterfalls : ప్రకృతి రమణీయత, ప్రశాంతమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటున్నారా? అయితే ఏపీలోని ఈ వాటర్ ఫాల్స్ ను తప్పక చూడాల్సిందే. అరకు సమీపంలోని కటికి జలపాతం, తిరుపతికి సమీపంలోని తలకోన, నెల్లూరులోని పెంచలకోన జలపాతాలు మీకు ఆహ్లాదాన్ని అందిస్తాయి.
కటికి, తలకోన అద్భుతాలను చూసొద్దామా?
AP Waterfalls : బిజీ బిజీ లైఫ్, వర్క్ టెన్షన్స్ నుంచి ఉపశమనం కోరుకుంటున్నారా? అయితే అద్భుతమైన కొండలలో, ఆకాశం నుంచి నీరు జారిపడుతుందా? అనే అనుభూతిని కలిగించే జలపాతాలను ఒకసారి చూసేయండి. ఏపీలోని మూడు స్పెషల్ జలపాతాల గురించి తెలుసుకుందాం. అవే కటికి, తలకోన, పెంచలకోన జలపాతాలు. చుట్టూ కొండలు, ప్రశాంతమైన వాతావరణం, సుందరమైన జలపాతాలు, భూలోకస్వర్గం ఇదే అనిపిస్తుంది.
కటికి వాటర్ ఫాల్స్
కటికి జలపాతం అల్లూరి సీతారామ రాజు జిల్లాలో ఉంది. బొర్రా గుహల నుంచి 7 కిలోమీటర్ల ప్రయాణ దూరంలో కటిక జలపాతం ఉంది. గోస్తని నది ఉద్భవంలో భాగంగా కటికి జలపాతం ఉంది. రిఫ్రెష్ ఎస్కేప్ కోసం కటికి జలపాతం సుందరమైన ప్రదేశం. బొర్రా గుహల నుంచి 7 కి.మీ దూరంలో, అరకు నుంచి 39 కి.మీ, వైజాగ్ నుంచి 90 కి.మీ, హైదరాబాద్ నుంచి 665 కి.మీ దూరంలో కటికి జలపాతం ఉంది. అరకు బొర్రా గుహల సమీపంలో ఉన్న అద్భుతమైన జలపాతం ఇది. సమీపంలోని గ్రామం పేరు ఆధారంగా ఈ జలపాతానికి కటికి అని పేరు వచ్చింది. కటికి జలపాతం గోస్తని నది ద్వారా ఏర్పడింది. సుమారు 100 అడుగుల ఎత్తు నుంచి నీరు జారిపడుతుంది. ఈ జలపాతం దిగువన ఉన్న చెరువు స్నానం చేయడానికి అద్భుతమైన ప్రదేశం. దట్టమైన అడవిలో 20-30 నిమిషాల ట్రెక్కింక్ చేసి ఈ జలపాతాన్ని చేరుకోవాలి. సమీపంలోని రహదారి ద్వారా పర్వత శిఖరానికి చేరుకోవచ్చు. ఇక్కడ వంట, క్యాంపింగ్ అనుమతిస్తారు. ట్రెక్కింగ్‌కు కూడా ఇది బెస్ట్ ప్లేస్.
ప్రయాణం ఇలా?
అరకు నుంచి కటికి చేరుకునేందుకు... అనంతగిరి తర్వాత 30 కి.మీల దూరం ప్రయాణించారు. ముల్యగూడ జంక్షన్ వద్ద బొర్రా గుహల రహదారిలో ప్రయాణించి అదే రోడ్డులో బొర్రా గుహల రైల్వే క్రాసింగ్‌ను దాటండి. రైల్వే క్రాసింగ్ నుంచి దాదాపు 2 కి.మీ ప్రయాణించి ఎడమ మలుపు తీసుకోవాలి. అక్కడ నుంచి నేరుగా బొర్రా గుహలకు వెళ్లాలి. అదే దారిలో 300 మీటర్లు దాటిన తర్వాత ఎడమవైపు మలుపు తిరిగి, దాదాపు 4-5 కి.మీ రహదారి టన్నెల్ ఉంటుంది. ఇది రైల్వే ట్రాక్ వద్ద ముగుస్తుంది. ఇక్కడి నుంచి రైల్వే ట్రాక్ దాటి నేరుగా పర్వతంపై ట్రెక్కింగ్ చేయాలి. ఇక్కడి నుంచి జలపాతం దాదాపు 20-30 నిమిషాల ట్రెక్కింగ్‌లో ఉంటుంది. ఈ మార్గం ఇరుకైనది, జారే విధంగా ఉంటుంది. అయితే జీపులు మాత్రం అందుబాటులో ఉన్నాయి. పర్యాటకులు జీపుల్లో వెళ్లవచ్చు. అయితే ఈ ప్రదేశానికి ప్రజా రవాణా అందుబాటులో ఉండదు. సందర్శకులు తమ సొంత కారులో జలపాతం వద్దకు వెళ్లకూడదు. రహదారి ఎగుడుదిగుడుగా ఉండడం వల్ల సాధారణ కార్లలో ప్రయాణానికి అనుకూలంగా ఉండదు. జలపాతం వద్ద బ్యాంబు చికెన్‌ను విక్రయిస్తారు. అడవి తేనె కూడా లభిస్తుంది. ఈ జలపాతాన్ని చూసేందుకు ఆగస్టు నుంచి డిసెంబర్ ఉత్తమ సమయం. వేసవిలో ఈ ప్రాంతం పొడిగా ఉంటుంది.
తలకోన జలపాతం
తలకోన జలపాతం తిరుపతి జిల్లా యెర్రావారిపాలెం మండలంలోని ప్రముఖ పర్యాటక కేంద్రం. చుట్టూ ఎత్తైన కొండలతో, దట్టమైన అరణ్యప్రాంతం మధ్యలో ఈ జలపాతం ఉంటుంది. ఇక్కడ నిత్యం పర్యాటకుల రద్దీ ఉంటుంది. తిరుపతికి దాదాపు 45 కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ జలపాతం ప్రకృతి రమణీయ ప్రదేశాల్లో ఒకటి. తిరుపతికి 45 కి.మీ దూరంలో శేషాచల కొండల మధ్యలో ఈ జలపాతం ఉంది. 82 మీటర్ల ఎత్తు నుంచి పడుతున్న జలపాతాలు చాలా అకర్షణీయంగా ఉంటాయి.
పెంచలకోన జలపాతం
నెల్లూరు జిల్లా రాపూరు మండలంలోని పెంచలకోన ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రదేశం. నెల్లూరు నుంచి 80 కిలోమీటర్ల దూరంలో పెంచలకోన జలపాతం ఉంది. ఇది పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం నుంచి 2 కి.మీ దూరం ఉంది. కండలేరు నది పెంచలకోన వద్దే పుట్టింది.