AP TET 2024 Updates : ఏపీ టెట్ పరీక్షలపై కీలక అప్డేట్, సెప్టెంబర్ 22 తర్వాత హాల్ టికెట్లు
25 August 2024, 18:39 IST
- AP TET 2024 Updates : ఏపీ టెట్-2024 పరీక్షలపై మరో కీలక అప్డేట్ వెలువడింది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు 18 రోజుల పాటు టెట్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు టెట్ హాల్ టికెట్లను పాఠశాల విద్యాశాఖ సెప్టెంబర్ 22 తర్వాత విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది.
ఏపీ టెట్ పరీక్షలపై కీలక అప్డేట్, సెప్టెంబర్ 22 తర్వాత హాల్ టికెట్లు
AP TET 2024 Updates: ఏపీ టెట్-2024 పరీక్షలకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది. అక్టోబర్ 3 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలను కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విధానంలో నిర్వహించనున్నారు. టెట్ పరీక్షలకు సెప్టెంబర్ 22 తర్వాత హాల్ టికెట్లు విడుదల చేయనున్నారు. టెట్ పరీక్షలను రెండు సెషన్లలో 18 రోజుల పాటు నిర్వహిస్తారు. మొదటి సెషన్ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో సెషన్ మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది.
పరీక్ష ముగిసిన తర్వాత రోజు అంటే అక్టోబర్ 4 నుంచి వరుసగా ప్రైమరీ కీ లు విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. అలాగే అక్టోబర్ 5 నుంచి అభ్యర్థులు టెట్ కీలపై అభ్యంతరాల తెలపవచ్చు. అక్టోబర్ 27న టెట్ ఫైనల్ కీ విడుదల చేస్తారు. నవంబర్ 2న తుది ఫలితాల విడుదల ఉంటుంది. టెట్ పరీక్షలో ఓసీ అభ్యర్థులు 60 శాతం మార్కులు సాధించాల్సి ఉంటుంది. ఇక బీసీ అభ్యర్థులు 50 శాతం, ఎస్టీ, ఎస్సీ, పీహెచ్, ఎక్స్ సర్వీస్ మెన్ 40 శాతం అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది.
డీఎస్సీలో 20 శాతం వెయిటేజీ
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. డీఎస్సీలో టెట్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది. అందుకే టెట్ స్కోర్ పెంచుకునేందుకు అభ్యర్థులు తీవ్రంగా శ్రమిస్తుంటారు. అభ్యర్థుల విజ్ఞప్తి మేరకు మరోసారి టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఈ మేరకు జులై 2న టెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆగస్టు 3వ తేదీతో దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. మొత్తం 4,27,300 మంది అభ్యర్థులు టెట్ కు దరఖాస్తు చేసుకున్నారు. సెకండరీ గ్రేడ్ టీచర్ పేపర్ 1-ఎకు 1,82,609 మంది, సెకెండరీ గ్రేడ్ టీచర్ స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్-1బి కు 2,662 మంది అప్లై చేసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ టీచర్ పోస్టులు పేపర్ 2-ఎ లాంగ్వేజెస్‌కు 64,036 మంది, మ్యాథ్స్ అండ్ సైన్స్‌కు 1,04,788 మంది దరఖాస్తు చేసుకున్నారు.
త్వరలో తెలంగాణ డీఎస్సీ ఫలితాలు?
త్వరలోనే తెలంగాణ డీఎస్సీ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. ఆలస్యం కాకుండా పరీక్షలు పూర్తి అయిన కొద్దిరోజుల్లోనే ప్రాథమిక కీతో పాటు రెస్పాన్స్ షీట్లను విద్యాశాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆగస్టు 20వ తేదీతో అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కూడా పూర్తి కానుంది. ఈ నేపథ్యంలో త్వరితగతిన ఫలితాలను కూడా ప్రకటించే యోచనలో విద్యాశాఖ ఉంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్... మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ వెంటనే షెడ్యూల్ ప్రకటించటంతో పాటు పరీక్షలను కూడా పూర్తి చేసింది. సాధ్యమైనంత త్వరగా కొత్త టీచర్ల సేవలను వాడుకోవాలన్న ఉద్దేశంతో సర్కార్ ఉంది. ఈ విషయంలో ఓ డెడ్ లైన్ కూడా పెట్టుకుని పని చేస్తోంది.
అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరణ పూర్తి కాగానే.. ఆ తర్వాత తుది కీని ప్రకటించనుంది. అనంతరం జనరల్ ర్యాకింగ్ లిస్టును అందుబాటులోకి తీసుకురానుంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ తర్వాత… నియామక పత్రాలను అందజేయనుంది. దాదాపు తుది జాబితా ప్రక్రియ అంతా కూడా ఈనెలాఖరులోనే పూర్తి చేయాలని విద్యాశాఖ భావిస్తున్నట్లు తెలిసింది. డీఎస్సీ పరీక్షల ఫలితాలను త్వరగా విడుదల చేయాలనే యోచనలో విద్యాశాఖ ఉంది. సెప్టెంబరు 5న ఉపాధ్యాయ దినోత్సవం ఉంది. ఈ సందర్భంగానే ఎంపికైన వారికి నియామక పత్రాలు అందజేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.