AP TET Applications: ముగిసిన ఏపీ టెట్ దరఖాస్తుల స్వీకరణ, షెడ్యూల్ ప్రకారమే పరీక్షల నిర్వహణ
AP TET Applications: ఆంధ్రప్రదేశ్ టెట్ అప్లికేషన్ల స్వీకరణ గడువు ముగిసింది. షెడ్యూల్ ప్రకారమే పరీక్షలు జరుగుతాయని పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.
AP TET Applications: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించే క్రమంలో దానికి ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ కు నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఈ నెల మూడవ తేదీతో ముగిసింది. ఈ టెట్ పరీక్షలకు అధిక సంఖ్యలో 4,27,300 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
సెకండరీ గ్రేడ్ టీచర్ విభాగంలో పేపర్ 1-ఎ కు 1,82,609 మంది, సెకండరీ గ్రేడ్ టీచర్ ప్రత్యేక విద్య పేపర్ 1- బి కు 2,662 మంది దరఖాస్తు చేసుకున్నారు.
స్కూల్ అసిస్టెంట్ టీచర్ విభాగంలో పేపర్ 2- ఏ లాంగ్వేజెస్ కు 64,036 మంది, మాథ్స్ అండ్ సైన్స్ కు 1,04,788 మంది దరఖాస్తు చేసుకోగా సోషల్ స్టడీస్ లో 70,767 మంది దరఖాస్తు చేసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్ టీచర్ ప్రత్యేక విద్య పేపర్ 2- బి విభాగంలో 2438 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.
గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం టెట్ పరీక్షలు నిర్వహిస్తామని అభ్యర్ధులందరూ పరీక్షలకు సన్నద్ధం కావాలని పాఠశాల విద్య డైరెక్టర్ విజయరామరాజు తెలిపారు.
ఏపీ టెట్ ముఖ్య తేదీలు
- ఏపీ టెట్ పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేదీ -ఆగస్టు 3, 2024.
- ఆన్‌లైన్ అప్లికేషన్లు చివరి తేదీ - ఆగస్టు 3, 2024.
- ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లు - సెప్టెంబర్ 19 నుంచి
- టెట్ హాల్ టికెట్లు - సెప్టెంబర్ 22 నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
- అక్టోబర్ 3 నుంచి టెట్ పరీక్షలు ప్రారంభం
- అక్టోబరు 20వ తేదీతో పరీక్షలు పూర్తి.
- ఫైనల్ కీ విడుదల - అక్టోబర్ 27.
- టెట్ ఫలితాలు విడుదల - నవంబర్ 2, 2024.
- అధికారిక వెబ్ సైట్ - https://aptet.apcfss.in/
ఏపీ టెట్ 2024 జులై 2 విడుదలైన టెట్ నోటిఫికేషన్ ప్రకారం ఆగస్టు 5 నుంచి 20 వరకు టెట్ పరీక్షలు జరగాల్సి ఉండగా, విద్యార్ధుల విజ్ఞప్తి నేపథ్యంలో ఈ పరీక్షలను అక్టోబర్ 3 నుంచి 20 వరకు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ తాజాగా ప్రకటించింది. ఏపీలో 16,347 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఏపీ టెట్ దరఖాస్తులకు ఆగస్టు 3వ తేదీని తుది గడువుగా ప్రకటించారు.