తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Schools Holiday : ఏపీలో భారీ వర్షాలు, రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

AP Schools Holiday : ఏపీలో భారీ వర్షాలు, రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

14 October 2024, 22:14 IST

google News
  • AP Schools Holiday : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఏపీలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. భారీ వర్షాల నేపథ్యంలో మంగళవారం చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో స్కూళ్లు, అంగన్వాడీలకు సెలవు ప్రకటించారు.

ఏపీలో భారీ వర్షాలు, రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు
ఏపీలో భారీ వర్షాలు, రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు (istock)

ఏపీలో భారీ వర్షాలు, రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

అల్పపీడనం ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు మంగళవారం సెలవు ప్రకటిస్తున్నట్లు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రకటన చేశారు. సంక్షేమ హాస్టళ్లు ప్రమాదకర స్థితిలో ఉంటే వాటిలో ఉంటున్న విద్యార్థులను సురక్షిత భవనాల్లోకి తరలించాలని అధికారులను ఆదేశించారు. అలాగే ప్రసవ సమయం దగ్గర పడిన గర్భిణులను ఆసుపత్రుల్లో చేర్పించేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులను ఆదేశించారు.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

అత్యవసర నిధులు విడుదల

భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వం పలు జిల్లాలకు అత్యవసర నిధులు కేటాయించింది. చిత్తూరు, ప్రకాశం, తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, వైఎస్ఆర్ జిల్లాలకు రూ.కోటి చొప్పున నిధులు విడుదల చేసింది. రిలీఫ్ క్యాంపులు, తాగునీరు, ఆహారం, హెల్త్ క్యాంపులు, శానిటేషన్ కు ఈ నిధులు వినియోగించాలని ఆదేశించింది. వరద బాధితులను తరలించేందుకు ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకోవాలని సూచించింది.

వాయుగుండం కారణంగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆయా జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ప్రాజెక్టులు, కాల్వలు, చెరువులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

అతి భారీ వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ-వాయువ్య దిశగా కదులుతూ రేపటికి దక్షిణ బంగాళాఖాతంలోని మధ్య భాగాల్లో బలపడే అవకాశం ఉంది. తదుపరి 48 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణకోస్తా తీరాల వైపు కదిలే అవకాశం ఉంది. రానున్న మూడు రోజులు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.

సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు విపత్తుల నిర్వహణ సంస్థ కంట్రోల్ రూమ్ నుంచి సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్, స్పెషల్ సీఎస్ సిసోడియా పర్యవేక్షణలో ప్రభావిత జిల్లాల కలెక్టర్లకు, అధికారులకు సూచనలు జారీ చేసినట్లు విపత్తుల సంస్థ ఎండి కూర్మనాథ్ తెలిపారు. తీరం వెంబడి గంటకు 40-60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. పెన్నా పరీవాహక లోతట్టు ప్రాంతప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

భారీవర్షాలతో పొంగిపొర్లే వాగులు, కాలువలు, రోడ్లు , కల్వర్టులు, మ్యాన్ హోల్స్ కు దూరంగా ఉండాలని అధికారులు ప్రజలకు సూచించారు. ఒరిగిన విద్యుత్ స్తంభాలు, తీగలు, చెట్లు, హోర్డింగ్స్ కింద ఉండవద్దన్నారు. పాత భవనాలు వదిలి సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని సూచించారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

భారీ వర్షాలు ప్రభావంతో వాగులు పొంగిపొర్లే మార్గాల్లోని రోడ్లు వెంటనే మూసివేయాలని సీఎస్ నీరభ్ కుమార్ ఆదేశించారు. ప్రమాదకరమైన కల్వర్టుల వద్ద సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. శిథిలావస్థలో ఉన్న ఇంట్లో ఉండేవారిని సచివాలయ సిబ్బంది సురక్షిత భవనాలకు పంపాలన్నారు. అర్బన్ ఫ్లడ్ వలన రోడ్లమీద నీళ్లు నిలవకుండా ముందుగానే డ్రైనేజీలు శుభ్రం చేయాలన్నారు. కాలువలు, చెరువులు, వాగుల పరిస్థితిని ఇరిగేషన్ అధికారులు పర్యవేక్షించాలన్నారు.

తదుపరి వ్యాసం