Deep Depression Landfall : పూరీ వద్ద తీరం దాటిన తీవ్ర వాయుగుండం, ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ
Deep Depression Landfall : వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్రవాయుగుండం పూరీ వద్ద తీరం దాటింది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఇవాళ, రేపు ఒడిశా, కోస్తాంధ్ర, ఛత్తీస్ గఢ్ లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. పలు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేసింది.
Deep Depression Landfall : బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఒడిశాలోని పూరీ వద్ద తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం తీవ్ర వాయుగుండం పూరీకి వాయవ్య దిశగా పయనిస్తుందని తెలిపింది. దీని ప్రభావం ఇవాళ రాత్రి 7.30 వరకు కొనసాగుతుందని వెల్లడించింది. వాయుగుండం ఛత్తీస్‌గఢ్ వైపు పయనించి క్రమంగా బలహీనపడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఒడిశాలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని ఐఎండీ తెలిపింది.
ఈ జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్
వాయుగుండం ప్రభావంతో సోమవారం దక్షిణ ఒడిశా, కోస్తాంధ్ర, యానాంలోని కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇవాళ, రేపు ఉత్తర ఛత్తీస్‌గఢ్, ఒడిశా, కోస్తాంధ్రలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. రేపు(మంగళవారం) ఉదయం 11.30 గంటల వరకు తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45 నుంచి 55 కిలోమీటర్లు వేగంతో సోమవారం సాయంత్రం వరకూ బలమైన ఈదురు గాలులు వీస్తాయన్నారు. వచ్చే రెండు రోజులు మత్య్సకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ఉత్తరాంధ్రలోని అన్ని పోర్టులలో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. గడిచిన 24 గంటలలో అత్యధికంగా అల్లూరి జిల్లాలోని చింతపల్లిలో 13 సెంటీ మీటర్ల వర్షపాతం రికార్డైంది. విజయనగరం జిల్లా పూసపాటి రేగలో 9 సెం.మీ, విశాఖ ఎయిర్ పోర్టు వద్ద 9 సెం.మీ వర్షపాతం నమోదు అయ్యిందని అధికారులు తెలిపారు.
తెలంగాణలో వర్షాలు
తెలంగాణలోనూ సోమవారం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశమున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. కొన్ని జిల్లాల్లో రానున్న రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది. మంగళవారం కొన్ని జిల్లాల్లో 30 కి.మీ నుంచి 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. సోమవారం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. ఈ మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నిర్మల్, ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, ములుగు, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రాజన్న సిరిసిల్ల, కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, జనగాం, హన్మకొండ, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, సంగారెడ్డి, వికారాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో మోస్తరు వర్షం కురిసేందుకు అవకాశం ఉందని పేర్కొంది.
సంబంధిత కథనం