AP Heavy Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం, ఈ నెల 14 నుంచి 17 వరకు ఏపీలో భారీ వర్షాలు
AP Heavy Rains : బంగాళాఖాతంలో ఆవర్తనం విస్తరించి ఉందని, సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 14 నుంచి 17 వరకు కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో హోంమంత్రి అనిత అధికారులను అప్రమత్తం చేశారు.
ఆగ్నేయ బంగాళాఖాతం, పక్కనే ఉన్న హిందూ మహాసముద్రం వరకు ఆవర్తనం విస్తరించి ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. దీని ప్రభావంతో నైరుతి బంగాళాఖాతంలో సోమవారం నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని ప్రకటించింది. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో ఈ నెల 14, 15, 16,17 తేదీల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.
అప్రమత్తం ఉండాలన్న హోంమంత్రి
భారీ వర్ష సూచన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి వంగలపూడి అనిత అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. పోలీసు, విపత్తు నిర్వహణ శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అవసరమైతే కంట్రోల్ రూమ్, హెల్ప్ లైన్ నంబర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాగులు పొంగే అవకాశం ఉన్న ప్రాంతాల్లో రైతులు, గొర్రెల కాపరులు, మత్స్యకారులకు హెచ్చరికలు జారీ చేయాలని ఆదేశించారు. రెవెన్యూ, నీటిపారుదలశాఖ, మున్సిపల్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సమన్వయంతో ఎలాంటి నష్టం కలగకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. దక్షిణ కోస్తా, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో పలు చోట్ల భారీవర్షాల కురిసే అవకాశం ఉందని, బలహీనంగా ఉన్న కాలువలు, చెరువు గట్లను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. ఏలూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, పల్నాడు, సత్యసాయి జిల్లాల కలెక్టర్లు ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు.
14 నుంచి 17 వరకు భారీ వర్షాలు
ఆవర్తనం ప్రభావంతో రేపు(ఆదివారం) కోస్తాంధ్ర, రాయలసీమలో విస్తృతంగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈనెల 14 నుంచి 17 వరకు కోస్తాంధ్ర, రాయలసీమలో అక్కడక్కడ భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. సోమవారం నుంచి మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
అల్లూరి, మన్యం, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
సంబంధిత కథనం