AP Schools Holiday : ఏపీలో భారీ వర్షాలు- రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లు,కాలేజీలకు సెలవు
01 December 2024, 22:32 IST
AP Schools Holiday : ఫెంగల్ తుపాను ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం చిత్తూరు, అన్నమయ్య జిల్లాలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
ఏపీ విద్యార్థులకు అలర్ట్, రేపు ఈ జిల్లాలో స్కూళ్లకు సెలవు
ఫెంగల్ తుపాను ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. రేపు కూడా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా అన్ని స్కూళ్లు, కాలేజీలకు సెలవు ఇస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రకటించారు. రేపు కూడా చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షాలు పడతాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో కలెక్టర్ ముందస్తుగాసెలవు ఇచ్చారు. నెల్లూరు, తిరుపతి, వైఎస్ఆర్ జిల్లాల్లోనూ విద్యాసంస్థలకు సెలవు ఇవ్వాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
భారీ వర్షాలకు అన్నమయ్య జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెలవు ఇవ్వనున్నట్లు కలెక్టర్ చామకూరి శ్రీధర్ ప్రకటించారు. విద్యాసంస్థలు సెలవు ఇవ్వకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తుపాను ప్రభావంతో ఏపీలో మరో 24 గంటల పాటు ఉంటుందని వాతావరణశాఖ తెలిపింది. పలు జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరుతుంది. తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. లోతట్టు ప్రాంతాల వారు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పంట పొలాలు నీటి మునిగాయి. కృష్ణపట్నంలో సముద్రం 10 మీటర్లు ముందుకొచ్చింది.
రేపు కూడా వర్షాలు
ఏపీపై ఫెంగల్ తుపాను ప్రభావం కొనసాగుతోంది. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి కోనసీమ, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపు కూడా ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు ఇస్తుంది. శనివారం రాత్రి గం.10:30 నుంచి 11:30 మధ్య పుదుచ్చేరి సమీపంలో తుపాను తీరం దాటిందని ఐఎండీ పేర్కొంది. తుపాను పశ్చిమ-నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీన పడనుందని తెలిపింది. తుపాను ప్రభావంతో ఆదివారం దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
ఫెంగల్ తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో శనివారం అర్ధరాత్రి ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు సిటీలోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. ముత్తుకూరు, ఇందుకూరుపేట, విడవలూరు, కొడవలూరు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ ఏర్పాటు చేశారు. ఫెంగల్ తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లా కొత్తపట్నం వద్ద సముద్రం ఉగ్రరూపం దాల్చింది. తుపాను నేపథ్యంలో సముద్రం 20 మీటర్లకు పైగా ముందుకు వచ్చినట్లు మెరైన్ పోలీసులు తెలిపారు. మత్స్యకారులను సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు చేశారు. అలాగే కార్తిక మాసం స్నానాల కోసం వచ్చే భక్తులను అనుమతించవద్దని ఆదేశించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. కోతల సమయం కావడంతో ధాన్యం తడిసిపోతుందని, వరి చేలు నేలకొరుగుతున్నాయని ఆవేదన చెందుతున్నారు.