AP Cyclone Rains : ఏపీపై ఫెంగల్ తుపాను ప్రభావం, రేపు కూడా భారీ వర్షాలు కురిసే ఛాన్స్
AP Cyclone Rains : ఫెంగల్ తుపాను తీరం దాటినా ప్రభావం కొనసాగుతోంది. ఏపీపై తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, నెల్లూరు సహా పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నారు. రేపు కూడా ఏపీలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు ఇస్తుంది.
ఏపీపై ఫెంగల్ తుపాను ప్రభావం కొనసాగుతోంది. తుపాను ప్రభావంతో శ్రీకాకుళం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి కోనసీమ, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రేపు కూడా ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచనలు ఇస్తుంది.
శనివారం రాత్రి గం.10:30 నుంచి 11:30 మధ్య పుదుచ్చేరి సమీపంలో తుపాను తీరం దాటిందని ఐఎండీ పేర్కొంది. తుపాను పశ్చిమ-నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీన పడనుందని తెలిపింది. తుపాను ప్రభావంతో ఆదివారం దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
గత 24 గంటల్లో అత్యధిక వర్షపాతం (శనివారం ఉదయం 8:30 నుంచి ఈరోజు ఉదయం 8:30వరకు)
1)తిరుపతి, కేఎం అగ్రహారం-187 మి.మీ
2)తిరుపతి, కేకేఆర్కే పురం-162 మి.మీ
3)తిరుపతి, రాచపాలెం-152 మి.మీ
4)తిరుపతి, మన్నార్ పొలూరు-149 మి.మీ
5) తిరుపతి, భీములవారిపాలెం-137 మి.మీ
తిరుమల ఘాట్ లో విరిగిపిడిన కొండచరియలు
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు తిరుమల ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగిపడుతున్నాయి. టీటీడీ సిబ్బంది వాహనదారులకు ఇబ్బంది లేకుండా జేసీబీలతో కొండ చరియలను ఎప్పటికప్పుడు తొలగిస్తు్న్నారు. ఘాట్ రోడ్డుల్లో వెళ్లే భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది. భారీ వర్షాలకు తిరుమలలోని ప్రధాన జలశయాలు నిండాయి. గోగర్భం జలాశయం నిండిపోవడంతో డ్యామ్ రెండు గేట్లు ఎత్తి నీరు విడుదల చేస్తున్నారు. కుమారధార, పసుపుధార, పాపవినాశనం, ఆకాశగంగ జలశయాలు పూర్తిగా నింపిపోయాయి.
ఫెంగల్ తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో శనివారం అర్ధరాత్రి ఎడతెరిపిలేకుండా వర్షాలు పడుతున్నాయి. నెల్లూరు సిటీలోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. ముత్తుకూరు, ఇందుకూరుపేట, విడవలూరు, కొడవలూరు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ ఏర్పాటు చేశారు.
20 మీటర్లు ముందుకొచ్చిన సముద్రం
ఫెంగల్ తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లా కొత్తపట్నం వద్ద సముద్రం ఉగ్రరూపం దాల్చింది. తుపాను నేపథ్యంలో సముద్రం 20 మీటర్లకు పైగా ముందుకు వచ్చినట్లు మెరైన్ పోలీసులు తెలిపారు. మత్స్యకారులను సముద్రంలో వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు చేశారు. అలాగే కార్తిక మాసం స్నానాల కోసం వచ్చే భక్తులను అనుమతించవద్దని ఆదేశించారు.
గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వరి రైతులు ఆందోళన చెందుతున్నారు. కోతల సమయం కావడంతో ధాన్యం తడిసిపోతుందని, వరి చేలు నేలకొరుగుతున్నాయని ఆవేదన చెందుతున్నారు. ఫెంగల్ తుపాను ప్రభావంతో ఉప్పాడ తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. కెరటాల ఉద్ధృతికి ఉప్పాడ-కాకినాడ బీచ్ రోడ్డు కోతకు గురైంది. మాయపట్నం, అమీనాబాద్, సూరాడపేట, జగ్గరాజుపేట, కొత్తపట్నం, సుబ్బంపేటలలో మత్స్యకారులకు తీవ్రనష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. అలల దాటికి బోట్లు, వలలు దెబ్బతిన్నాయని మత్స్యకారులు అంటున్నారు.
సంబంధిత కథనం