తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Govt On Ganja Control : గంజాయి విక్రయిస్తే సంక్షేమ పథకాలు కట్, ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

AP Govt On Ganja Control : గంజాయి విక్రయిస్తే సంక్షేమ పథకాలు కట్, ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

27 November 2024, 16:47 IST

google News
  • AP Govt On Ganja Control : ఏపీలో గంజాయి అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గంజాయి విక్రయించే వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు రద్దు చేయాలని నిర్ణయించింది. అలాగే నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ కు ఈగల్ అని నామకరణం చేశారు.

గంజాయి విక్రయిస్తే సంక్షేమ పథకాలు కట్, ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం
గంజాయి విక్రయిస్తే సంక్షేమ పథకాలు కట్, ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

గంజాయి విక్రయిస్తే సంక్షేమ పథకాలు కట్, ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం

గంజాయి విక్రయాలకు చెక్ పెట్టేందుకు ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. గంజాయి అమ్మే వారి కుటుంబాలకు సంక్షేమ పథకాలు నిలిపివేయాలని నిర్ణయించింది. నార్కోటిక్స్ నియంత్రణపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ బుధవారం భేటీ అయ్యింది. ఈ భేటీలో మంత్రి లోకేశ్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. అలాగే యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ కు ఈగల్ అని పేరు పెట్టినట్లు తెలిపారు. పాఠశాలలు, కాలేజీలు, సచివాలయాల పరిధిలో 10 మందితో ఈగల్ కమిటీలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈగల్ కమిటీల్లో మహిళా సంఘాలు, ఆశా వర్కర్లలను భాగస్వామ్యం చేయాలని సూచించారు.

అమరావతి సచివాలయంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై హోంమంత్రి వంగలపూడి అనిత అధ్యక్షతన బుధవారం ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం జరిగింది. యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ పేరును 'ఈగల్'గా మార్చడంపై ఈ సమావేశంలో చర్చ జరిగింది. టాస్క్ ఫోర్స్ విధివిధానాలతో పాటు కీలక నిర్ణయాల దిశగా సబ్ కమిటీ సమాలోచనలు జరిపింది. గంజాయి, డ్రగ్స్ నియంత్రణపై జరిగిన మంత్రుల కమిటీ భేటీలో మంత్రి నారా లోకేశ్, వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, మంత్రులు సంధ్యారాణి, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.

రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ కట్టడి చేయడంతోపాటు బాధితులను ఆ వ్యసనం నుంచి బయటపడేయడం, గంజాయి సాగు, మత్తుపదార్థాల విక్రేతల మీద కఠిన చర్యలు తీసుకోవడంపై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాల అమలుకు యాంటీ నార్కోటిక్స్ ​టాస్క్​ఫోర్స్​ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. ఈ టాస్క్​ఫోర్స్ ​విధివిధానాలతోపాటు మరికొన్ని కీలక నిర్ణయాలను సీఎం చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లాలని మంత్రులు నిర్ణయించారు.

"గంజాయి విక్రయించే వారి కుటుంబానికి ప్రభుత్వం అందించే సంక్షేమం కట్. గంజాయి, డ్రగ్స్ పై ఇక యుద్ధమే. నిర్మూలనకు క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఉక్కుపాదం మోపాలి"- మంత్రి నారా లోకేష్

గంజాయి నిర్మూలనకు సరికొత్త వ్యూహం

ఉత్తరాంధ్ర జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాల్లో గంజాయి సాగును అరికట్టేందుకు పోలీసులు స్మార్ట్ వర్క్ చేస్తున్నారు. అటవీ ప్రాంతాల్లో సాగు చేస్తు్న్న గంజాయిని అరికట్టేందుకు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. డ్రోన్ల సాయంతో గంజాయి సాగుదారుల ఆట కట్టిస్తున్నారు. డ్రోన్ల సాయంతో గంజాయి పంటను గుర్తించి ధ్వంసం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో డ్రోన్లతో గంజాయి సాగును అరికట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇప్పటికే అనకాపల్లి జిల్లాలో 3. 55 ఎకరాల్లో సాగుచేస్తున్న గంజాయిని డ్రోన్ల సాయంతో గుర్తించి ధ్వంసం చేశారు. మూడు అడుగుల ఎత్తు మేర పెరిగిన గంజాయి మొక్కలను కనిపెట్టేలా డ్రోన్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.

డ్రోన్లలో హై డెఫినీషన్ ఫొటోలు తీసే మల్టీ స్పెక్ట్రల్ కెమెరాలను ఉపయోగిస్తున్నారు. గంజాయి మొక్కలను గుర్తించేందుకు నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో గూగుల్ సహాయం తీసుకుని గంజాయి సాగును గుర్తించనుంది. గంజాయిని సమూలంగా ధ్వంసం చేయాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం అని అధికారులు తెలిపారు.

తదుపరి వ్యాసం