Reverse Tendering Cancelled : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం, రివర్స్ టెండరింగ్ విధానం రద్దు
16 September 2024, 16:27 IST
- Reverse Tendering Cancelled : ఏపీ సర్కార్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. వైసీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానం జీవో 67ను రద్దు చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. ఇక నుంచి పాత టెండరింగ్ విధానం అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం, రివర్స్ టెండరింగ్ విధానం రద్దు
Reverse Tendering Cancelled : గత వైసీపీ ప్రభుత్వం తెచ్చిన మరో విధానాన్ని కూటమి సర్కార్ రద్దు చేసింది. రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గత ప్రభుత్వం 2019లో రివర్స్ టెండర్ విధానం అమలుకు జీవో నెంబర్ 67 జారీ చేసింది. తాజాగా ప్రభుత్వం ఈ జీవోను రద్దు చేస్తున్నట్లుగా ఉత్తర్వులు ఇచ్చింది. 2019లో వైసీపీ ప్రభుత్వం తెచ్చిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని రద్దు చేస్తూ సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ జీవో జారీ చేశారు. రివర్స్ టెండరింగ్ విధానానికి బదులుగా పాత టెండరింగ్ విధానం అమల్లోకి తెస్తున్నట్టు సీఎస్ తెలిపారు. అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ పనులకు ఇప్పటి నుంచీ పాత టెండరింగ్ విధానాన్ని అనుసరించాలని జీవోలో పేర్కొన్నారు.
జీవో 67 రద్దు
గత ప్రభుత్వం ఆగస్టు 16, 2019న జలవనరుల శాఖ అమల్లోకి తెచ్చిన జీవో నెం. 67 రివర్స్ టెండరింగ్ ప్రక్రియను రద్దు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలో పనులను పిలవడం, ఖరారు చేయడం కోసం రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు బదులుగా పాత సంప్రదాయ టెండర్ ప్రక్రియతో భర్తీ చేయాలని ఆదేశించింది. ఈ మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (జల వనరుల శాఖ) జి.సాయి ప్రసాద్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు.
రివర్స్ టెండరింగ్ ప్రక్రియ అమలులో లోపాలున్నాయని చీఫ్ ఇంజినీర్ల బోర్డు దీనిపై సమీక్షించి సిఫార్సులు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. చీఫ్ ఇంజినీర్ల బోర్డు రివర్స్ టెండరింగ్ ప్రక్రియ స్థానంలో పాత టెండరింగ్ విధానాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఈ అంశాన్ని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ ప్రక్రియను రద్దు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పాత టెండర్ ప్రక్రియను తిరిగి అమలు చేయాలని జలవనరుల శాఖను ఆదేశించింది.
రివర్స్ టెండరింగ్ ప్రక్రియకు బదులుగా ఆన్‌లైన్ ఈ-ప్రొక్యూర్‌మెంట్ సిస్టమ్ ద్వారా అన్ని ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లలో పనులను అప్పగించేందుకు సంప్రదాయ టెండర్ ప్రక్రియను పాటించాలని ప్రభుత్వం ఆదేశించింది. 2003 నాటి జీవో 94ను ప్రభుత్వం తాజాగా అమల్లోకి తెచ్చింది. తక్కువ ధరకు పనులు పూర్తి చేస్తామని లిఖితపూర్వకంగా వేసే బిడ్లను ఆమోదించాలని నిర్ణయించింది. టెండర్‌లో పాల్గొన్న కాంట్రాక్ట్ సంస్థల్లో ఎల్-1గా ఉన్న సంస్థకు పనులు అప్పగించే విధానాన్ని అమలు చేస్తామని గత నెలలో జరిగిన కేబినెట్ భేటీలో తీర్మానాన్ని ఆమోదించారు.