Valmiki Jayanti 2024 : వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, ఈనెల 17న అధికారికంగా నిర్వహణ
13 October 2024, 16:18 IST
Valmiki Jayanti 2024 : ఏపీ ప్రభుత్వం వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించింది. ఈ నెల 17న అన్ని జిల్లాల్లో వాల్మీకి జయంతిని నిర్వహించాలని ప్రభుత్వం ఆదేశించింది. అనంతపురంలో రాష్ట్ర స్థాయి వాల్మీకి జయంతి వేడుకను జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిన ఏపీ ప్రభుత్వం, ఈనెల 17న అధికారికంగా నిర్వహణ
రాష్ట్రంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 17 న అన్ని జిల్లాల్లో అధికారికంగా వాల్మీకి జయంతిని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. దీనికి సంబంధించి అనంతపురంలో రాష్ట్ర స్థాయి వాల్మీకి జయంతి వేడుకను జరపాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వాల్మీకిలు అనంతపురంలోనే అధిక శాతం ఉంటారు. అందుకనే ఆ జిల్లాలోనే వాల్మీకి రాష్ట్ర స్థాయి వేడుకను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది.
వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించాలని డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. ఇటీవలి కూడా వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన వాల్మీకి మహాసేన నేతలు ఈ డిమాండ్‌ను పునరుద్ఘాటించారు. వాల్మీకి జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని కోరారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. టీడీపీ కూటమి ప్రభుత్వం వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించడం, అధికారికంగా అన్ని జిల్లాల్లో నిర్వహించాలని ప్రకటించడంపై వాల్మీకి సంఘాల నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈనెల 17న వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కలెక్టర్లు నేతృత్వంలో ఈ పండుగ నిర్వహించాలని అన్నారు. రాష్ట్రస్థాయిలో అనంతపురంలో నిర్వహించే వాల్మీకి జయంతిని ఘనంగా చేయాలని, దీనికి సంబంధించిన ఏర్పాట్లను చేపట్టాలని అన్నారు. బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్, ఆ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు.
వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా, అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారని మంత్రి సవిత అన్నారు. సీఎం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ పండుగను ఘనంగా నిర్వహించాలని తెలిపారు. జిల్లాల్లో కలెక్టర్లు నేతృత్వంలో ఈ జయంతి వేడుకలు నిర్వహించాలని, అందుకు సంబంధించిన ఆదేశాలను కలెక్టర్లకు జారీ చేయాలని బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి పోలా భాస్కర్‌ను మంత్రి సవిత ఆదేశించారు.
కొన్నిచోట్ల వాల్మీకులను ఎస్టీలుగానూ, మరికొన్ని చోట్ల బీసీలుగాను ఉన్నారు. ఈ వ్యత్యాసాలు చూపడాన్ని కూడా వాల్మీకి మహాసేన తప్పుపట్టింది. వాల్మీకిలకు అందాల్సిన రిజర్వేషన్లు సవ్యంగా అందటం లేదని పేర్కొంది. అయితే వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడాన్ని తాము స్వాగతిస్తామని, అయితే ఆ రోజున సెలవు దినంగా ప్రకటించాలని వాల్మీకి మహాసేన నాయకులు విజయ్ కుమార్, ముత్తరాశి హరికృష్ణ కోరారు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు