TGSRTC: రాఖీ పండుగ రద్దీ.. తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఒక్క రోజే 63 లక్షల మంది ప్రయాణం
TGSRTC: తెలంగాణ ఆర్టీసీ మరో రికార్డు సాధించింది. ఒక్క రోజులోనే ఏకంగా 63 లక్షల మందిని గమ్యస్థానాలకు చేరవేసింది. ఈ రికార్డు సాధించడంపై సంస్థ ఎండీ సజ్జనార్ హర్షం వ్యక్తం చేశారు. పండగ రోజు కూడా పనిచేసిన ఉద్యోగులు, సిబ్బందిని సజ్జనార్ అభినందించారు. ఈ ఘనత అందరి కృషి అని వ్యాఖ్యానించారు.
రాఖీ పండగ రోజున తెలంగాణ ఆర్టీసీ రికార్డు సాధించింది. టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 63 లక్షల మంది వరకు ప్రయాణించారు. 63 లక్షమ మందిని క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చిన సంస్థ సిబ్బంది, అధికారులను ఎండీ వీసీ సజ్జనార్ అభినందించారు. సోదరభావానికి ప్రతీకైన రాఖీ పండుగను కూడా త్యాగం చేసి.. భారీ వర్షాల్లోనూ నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేశారని కొనియాడారు. రద్దీలోనూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని విజయవంతంగా అమలు చేశారని అన్నారు. ఒక్కరోజే 41.74 లక్షల మంది మహిళలను సురక్షితంగా గమ్యస్థానాలకు చేరవేశారని అభినందించారు.
రికార్డు స్థాయిలో..
సోమవారం నాడు టీజీఎస్ ఆర్టీసీ బస్సులు రికార్డు స్థాయిలో 38 లక్షల కిలోమీటర్లు తిరిగాయి. సగటున 33 లక్షల కిలోమీటర్లు తిరుగుతుండగా.. సోమవారం నాడు 5 లక్షల కిలోమీటర్లు అదనంగా తిరిగాయి. ఒక్కరోజులో మొత్తంగా 63 లక్షల మంది వరకు ప్రయాణించగా.. అందులో అత్యధికంగా హైదరాబాద్ రీజియన్‌లో 12.91 లక్షలు, సికింద్రాబాద్ రీజియన్‌లో 11.68 లక్షలు, కరీంనగర్ రీజియన్‌లో 6.37 లక్షలు, మహబుబ్‌నగర్ రీజియన్‌లో 5.84 లక్షలు, వరంగల్ రీజియన్‌లో 5.82 లక్షల మంది ప్రయాణించారు.
100 శాతానికి పైగా ఆక్యూపెన్సీ..
97 డిపోలకు గాను.. 92 డిపోలు 100 శాతానికి పైగా ఆక్యూపెన్సీని నమోదు చేశాయి. సోమవారం రికార్డు స్థాయిలో రూ.32 కోట్ల వరకు ఆదాయం వచ్చింది. అందులో మహాలక్ష్మి పథకం ద్వారా రూ.17 కోట్లు.. నగదు చెల్లింపు టికెట్ల ద్వారా రూ.15 కోట్ల ఆదాయం వచ్చింది. ఆర్టీసీ చరిత్రలో ఇది ఆల్‌టైం రికార్డ్ అని సంస్థ ఎండీ సజ్జనార్ వివరించారు. ప్రజారవాణా వ్యవస్థపై ప్రజల ఆదరాభిమానాలు ఎంతలా ఉన్నాయో చెప్పడానికి రాఖీ పండుగ రికార్డులే నిదర్శనమన్నారు. దేశ ప్రజా రవాణా వ్యవస్థలో టీజీఎస్ ఆర్టీసీ రాఖీ పండుగ రికార్డులు ఒక మైలురాయిగా నిలిచిపోతాయన్నారు.
ఎలాంటి ఇబ్బందులు కలగకుండా..
రాఖీ పండుగ రద్దీ, మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందుస్తు చర్యలు తీసుకున్నామని సజ్జనార్ వివరించారు. గత రెండు వారాల్లో మూడు సార్లు క్షేత్రస్థాయి సిబ్బందితో వర్చువల్‌గా సమావేశం నిర్వహించిందని వివరించారు. మూడు రోజుల్లో 2587 ప్రత్యేక బస్సులను నడిపినట్లు వివరించారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా మెరుగైన, నాణ్యమైన సేవలను అందించాలని ఆదేశాలు జారీ చేసినట్టు సజ్జనార్ స్పష్టం చేశారు.
యాజమాన్యం ఆదేశాల ప్రకారం.. డిపో మేనేజర్లు గేట్ మీటింగ్‌లు ఏర్పాటు చేసి సిబ్బందిని మోటివేట్ చేశారని సజ్జనార్ వివరించారు. ముందస్తు ప్రణాళిక తోపాటు సిబ్బంది నిబద్దతతో పని చేయడం వల్ల రాఖీ పండుగ రోజున ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరారని చెప్పారు. టీజీఎస్ ఆర్టీసీకి సహకరిస్తూ.. ప్రజా రవాణా వ్యవస్థను ఆదరిస్తోన్న, ప్రోత్సహిస్తోన్న ప్రయాణికులందరికీ కృతజ్ఞతలు చెప్పారు.