Rakhi festival 2024: రాఖీ పండుగ ఎలా మొదలైంది? మొదటి రాఖీ దేనితో కట్టారో తెలుసా?
Rakhi festival 2024: శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి రోజున రక్షా బంధన్ పండుగ జరుపుకుంటారు. అయితే పురాణాల ప్రకారం అసలు ఈ పండుగ జరుపుకోవడం ఎప్పటి నుంచి మొదలైంది. మొదటిగా రాఖీ దేనితో కట్టారో తెలుసా?
Rakhi festival 2024: రాఖీ పండుగ వస్తుందంటే చాలు ఎక్కడ చూసినా రకరకాల రాఖీలు దర్శనమిస్తూ ఉంటాయి. ఏ షాపులో చూసిన అందమైన రాఖీలు కనిపిస్తాయి. స్వస్తిక్ గుర్తు రాఖీలు, పూసలు, రంగు రాళ్ళు, బొమ్మలతో ఉండే అనేక రాఖీలు ఇప్పుడు మార్కెట్ లో ఉంటున్నాయి. అయితే తొలి రాఖీ దేనితో కట్టారో తెలుసా? చీర కొంగుతో కట్టారు. అప్పటి నుంచి ఈ పండును జరుపుకుంటూ వస్తున్నారు. పూర్వంలో రాఖీ అంటే రంగు దారంతో కట్టేవాళ్ళు.
రక్షాబంధన్ పండుగ ఎలా మొదలైంది?
రక్షాబంధన్ గురించి చాలా కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. మత విశ్వాసాల ప్రకారం రక్షాబంధన్ కృష్ణుడు, ద్రౌపదితో ప్రారంభమైందని నమ్ముతారు. శ్రీకృష్ణుడు దుష్ట రాజు శిశుపాలుడిని చంపాడు. యుద్ధ సమయంలో కృష్ణుని ఎడమ చేతి వేలికి గాయమై రక్తం కారుతోంది. అది చూసిన ద్రౌపది చాలా దుఃఖించి తన చీర కొంగును చింపి ఆ ముక్కను కృష్ణుని వేలికి కట్టడంతో రక్తస్రావం ఆగింది. అప్పటి నుండి కృష్ణుడు ద్రౌపదిని తన సోదరిగా అంగీకరించాడు.
కొన్ని సంవత్సరాల తరువాత పాండవులు జూదంలో ద్రౌపదిని ఓడిపోయినప్పుడు ఆమెను నిండు సభలో వివస్త్రను చేసేందుకు ప్రయత్నించారు. అప్పుడు కృష్ణుడు తన మహిమతో ద్రౌపది మానాన్ని కాపాడాడు. అలా రాఖీ పండుగ మొదలైందని అంటారు. ఇవి మాత్రమే కాకుండా మరికొన్ని కథలు కూడా ప్రాచుర్యంలో ఉన్నాయి.
రాణి కర్ణావతి, హుమాయున్
చారిత్రక నమ్మకం ప్రకారం రక్షాబంధన్ రాణి కర్ణావతి, చక్రవర్తి హుమాయున్ మధ్య ప్రారంభమైంది. మధ్యయుగ కాలంలో రాజ్‌పుత్‌లు, ముస్లింల మధ్య ఘర్షణలు జరిగేవి. రాణి కర్ణావతి వితంతువు. ఆ సమయంలో గుజరాత్ సుల్తాన్ బహదూర్ షా నుండి తనను, తన ప్రజలను రక్షించుకోవడానికి మార్గం లేదని రాణి హుమాయున్‌కు రాఖీని పంపింది. అప్పుడు హుమాయున్ ఆమెను రక్షించి సోదరి హోదాను ఇచ్చాడు.
సంతోషి మాత
గణేశుడి సోదరి మానస రాఖీ కట్టడానికి ఆమె వద్దకు వచ్చింది. అప్పుడు అది చూసి అతని కుమారులు శుభ్, లాభ్ తమకు ఒక సోదరి కావాలని పట్టుబట్టారట. అలా వినాయకుడు తన భార్యలైన రిద్ధి, సిద్ధి నుంచి ఉద్భవించిన దివ్య జ్వాలల నుంచి సంతోషి మాతను సృష్టించారు.
లక్ష్మీదేవి, బాలి రాజు
బలి విష్ణు భక్తుడు. అతని తపస్సుకు మెచ్చిన విష్ణుమూర్తి బలి కోరిక మేరకు అతడి ఇంటికి వెళతాడు. దీంతో వైకుంఠంలో లక్ష్మీదేవి ఒంటరిగా మిగిలిపోతుంది. దీంతో ఒకనాడు లక్ష్మీదేవి నిరాశ్రయురాలుగా మారువేషంలో వచ్చి ఆశ్రయం కోరుతూ బలి చక్రవర్తి దగ్గరకు వచ్చింది. అతను ఏ మాత్రం సంకోచించకుండా రాజభవనం తలుపులు తెరిచాడు. సంతోషించిన లక్ష్మీదేవి శ్రేయస్సును ఆమె వెంట తీసుకొచ్చింది. శ్రావణ పౌర్ణమి రోజు లక్ష్మి బలి మణికట్టుకు దారం కడుతుంది. ఏ కావాలో అడగమని చెప్తాడు. అప్పుడు తన భర్త విష్ణుమూర్తిని తనతో పాటు వైకుంఠానికి పంపించమని అడుగుతుంది. లక్ష్మీదేవి కోరిక మేరకు బలి అందుకు ఒప్పుకుంటాడు. అయితే విష్ణు మూర్తి ప్రతి సంవత్సరం నాలుగు నెలలు బలితో ఉంటానని వాగ్దానం చేస్తాడు. అదే చాతుర్మాసం అంటారు.
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, దయచేసి సంబంధిత రంగంలో నిపుణుడిని సంప్రదించండి.