AP Free Bus Scheme : ఏపీ మహిళలకు గుడ్ న్యూస్.. త్వరలో మరో కొత్త పథకం ప్రారంభం.. ప్రభుత్వం కీలక ప్రకటన
01 November 2024, 18:10 IST
- AP Free Bus Scheme : రాష్ట్రంలోని మహిళలకు ప్రభుత్వం మరో పథకాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. దీనికి సంబంధించి మంత్రులు కీలక ప్రకటన చేశారు. అతి త్వరలోనే ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని స్పష్టం చేశారు. 2025 సంక్రాంతి నుంచి ఈ స్కీమ్ ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో పథకం ప్రారంభానికి ముహూర్తం ఫిక్స్ చేసినట్టు మంత్రులు వెల్లడించారు. ఎన్నికలకు ముందు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఆ హామీని నెరవేర్చేందుకు వేగంగా అడుగులు వేస్తోంది. దీపావళి సందర్భంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించిన చంద్రబాబు సర్కారు.. త్వరలోనే ఫ్రీ బస్ సౌకర్యం కల్పించనుంది.
'త్వరలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తాం. అర్హులైన వారికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం. ఐదేళ్లలో నెల్లూరును స్మార్ట్ సిటీ చేస్తాం. దీపం-2 పథకం మహిళలకు వరం' అని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఫ్రీ బస్ స్కీమ్ గురించి కీలక అప్ డేట్ ఇచ్చారు. రాష్ట్రంలోని మహిళలకు ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ముఖ్యమైన ప్రకటన చేశారు. సంక్రాంతి పండగ రోజు ఫ్రీ బస్ స్కీమ్ ప్రారంభం అవుతుందన్నారు. పండగ సమయంలో ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తున్నట్లు వెల్లడించారు. ఈ పథకం పండుగ సమయంలో మహిళా ప్రయాణికులకు ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నట్టు వెల్లడించారు.
ఉచిత బస్సు ప్రయాణ ప్రకటనతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన అప్‌డేట్‌లను మంత్రి వివరించారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా.. పెంచిన పింఛన్‌లను పంపిణీ చేస్తున్నామని, ఈరోజు దీపం పథకం ప్రారంభించామని చెప్పారు. త్వరలోనే ఫ్రీ బస్ స్కీం అమలు అయితే.. ప్రధాన హామీలు నెరవేర్చినట్టేనని వ్యాఖ్యానించారు.
'ఎన్నికల సందర్భంగా ఇచ్చిన సూపర్ 6 హామీల్లో ఒకటైన.. ఏడాదికి 3 ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు అందించే పథకాన్ని శ్రీకాకుళం జిల్లా, ఈదుపురంలో ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఉచిత వంటగ్యాస్ సిలిండర్ అందుకున్న మహిళల కళ్లలో ఆనందం నాకు ఎంతో సంతృప్తినిచ్చింది. ఈదుపురంలో ఇలా ఉచిత గ్యాస్ సిలిండర్ అందుకున్న శాంతమ్మ, నేను గతంలో ప్రవేశ పెట్టిన దీపం 1 స్కీమ్ లో గ్యాస్ కనెక్షన్ అందుకున్న మహిళ అని తెలియడం నాకు మరింత సంతోషాన్ని కలిగించింది' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
'నేను స్వయంగా ఆ వంటగదికి వెళ్లి గ్యాస్ వెలిగించి టీ పెట్టి నా సహచరులకు ఇచ్చాను. ఉచిత వంట గ్యాస్ సిలిండర్ పథకం లబ్దిదారులకు నా శుభాకాంక్షలు. వంటగదిలో ఇక పొగ కష్టం, ఆర్థిక భారం ఉండకూడదని.. ఎంతో మంది మహిళల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావాలనేదే నా ఆకాంక్ష. స్త్రీ మూర్తులకు, ఆడబిడ్డలకు సాయం చేయడంలో ఎప్పుడూ ముందుటాను. వారి సంతోషం, ఆశీర్వాదాన్ని మించింది ఏముంటుంది?' అని చంద్రబాబు ట్వీట్ చేశారు.