Saree: ఎత్తు తక్కువగా ఉన్న మహిళలు ఇలా చీర కడితే పొడవుగా కనిపిస్తారు, ప్రయత్నించండి
Saree: మీ ఎత్తు తక్కువగా ఉన్నారా? అయితే చీర కట్టుకున్నప్పుడు మీరు కొన్ని తప్పులు చేయకుండా ఉండాలి. పొడవు ఎక్కువగా కనిపించేలా చీర ఎలా కట్టుకోవాలో తెలుసుకోండి.
ఆధునిక కాలంలో పాశ్చాత్య దుస్తులకే ప్రాధాన్యం పెరిగిపోయింది. అయినా మధ్యమధ్యలో పండుగల సమయంలో చీర కట్టుకోవడం వంటివి అమ్మాయిలు చేస్తున్నారు. ఆఫీసులో వేడుక అయినా, ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా చీర కట్టుకుంటే చాలు ఎన్నో కాంప్లిమెంట్స్ మహిళలకు అందుతాయి. కానీ ఎత్తు తక్కువగా ఉన్న మహిళలు మాత్రం చీర కట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. పొట్టిగా ఉన్నవారికి చీర బాగోదని, తాము ఇంకా పొట్టిగా కనిపిస్తామని వారు భావిస్తూ ఉంటారు. అటువంటి వారు కొన్ని చిట్కాలను పాటించడం ద్వారా చీరకట్టులో పొడవుగా కనిపించవచ్చు. చీర కట్టుకున్న తర్వాత ఎత్తుగా కనిపించాలంటే ఇక్కడ మేము చెప్పిన చిన్న చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. ఇలా చీర కడితే పొట్టి వారు కూడా సన్నగా, పొడవుగా కనిపిస్తారు.
చీరకట్టు చిట్కాలు
1) చీర కట్టుకున్న తర్వాత ఎత్తుగా కనిపించాలంటే సరైన చీరను ఎంపిక చేసుకోవాలి. తక్కువ ఎత్తు ఉన్న మహిళలు పెద్ద అంచులు ఉన్న చీరలను ఎంపిక చేసుకోకూడదు. ఎల్లప్పుడూ పొట్టి బోర్డర్ ఉన్న చీరను కట్టుకోవాలి.
2) చీర కట్టుకున్న తర్వాత పొడవుగా కనిపించాలనుకుంటే బ్లౌజ్ డిజైన్ ను సరిగ్గా ఎంచుకోండి. మీరు ఎత్తు తక్కువగా ఉన్నప్పుడు బోట్ నెక్ వంటి మెడ కప్పేసే బ్లౌజ్ డిజైన్లు ధరించడం మానుకోండి. మీ సౌకర్యానికి అనుగుణంగా వి ఆకారంలో ఉండే మెడ డిజైన్ లేదా లోతైన మెడ ఉన్న బ్లౌజ్ ను ఎంపిక చేసుకోవడం మంచిది.
3) మీరు తక్కువ పొడవు ఉన్నప్పుడు, చీరతో సరిగా నడవలేమని అనుకుంటారు. చీర కట్టుకునేటప్పుడు కాస్త ఎత్తుగా ఉండే హీల్స్ ను వేసుకోవాలి. చీర కట్టుకోవడం ద్వారా మరింత పొడవుగా కనిపించాలనుకుంటే, ఎల్లప్పుడూ పొడవాటి పల్లూ ఉండేలా చీర కట్టుకోండి.
4) ఎల్లప్పుడూ పలుచటి, సున్నితమైన వస్త్రం కలిగిన చీరను ఎంచుకోవడానికి ప్రయత్నించండి. కాటన్, సిల్క్ వంటి హార్డ్ ఫ్యాబ్రిక్ ధరించడం వల్ల శరీరం లావుగా కనిపించడంతో పాటు ఎత్తు కూడా తక్కువగా కనిపిస్తారు. మీరు షిఫాన్, జార్జెట్ ఫ్యాబ్రిక్ తో తయారుచేసిన చీరను ధరించడం ఉత్తమం. వీటితో పాటు చీర ప్రింట్ విషయంలోనూ జాగ్రత్తలు తీసుకోవాలి. పెద్ద ప్రింట్ లు కాకుండా, చిన్న చిన్న ప్రింట్ డిజైన్ ఉన్న చీరలను ఎంపిక చేసుకోవాలి.
5) చీర కట్టుకున్నాక మీరు పొడవుగా కనిపించాలనుకుంటే ముదురు రంగు చీరను ఎంచుకోండి. లేత రంగులు ధరించడం వల్ల ఎత్తు తక్కువగా కనిపిస్తుంది.
పొట్టిగా ఉన్నవారికి ఆత్మవిశ్వాసం తగ్గాల్సిన అవసరం లేదు. మీ ఆత్మవిశ్వాసమే మిమ్మల్ని అందంగా కనిపించేలా చేస్తుంది. పొట్టిగా ఉన్నా లేక పొడవుగా ఉన్నా కూడా చీర కట్టులో చక్కగానే కనిపిస్తారు.