Free Gas Subsidy: ఉచిత గ్యాస్‌ సబ్సిడీ నిధులు విడుదల.. అమల్లోకి దీపం-2 పథకం, సబ్సిడీ సొమ్ము ఎలా అందుకోవాలంటే…-free gas subsidy funds released deepam 2 scheme to be implemented how to receive subsidy money ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Free Gas Subsidy: ఉచిత గ్యాస్‌ సబ్సిడీ నిధులు విడుదల.. అమల్లోకి దీపం-2 పథకం, సబ్సిడీ సొమ్ము ఎలా అందుకోవాలంటే…

Free Gas Subsidy: ఉచిత గ్యాస్‌ సబ్సిడీ నిధులు విడుదల.. అమల్లోకి దీపం-2 పథకం, సబ్సిడీ సొమ్ము ఎలా అందుకోవాలంటే…

Bolleddu Sarath Chandra HT Telugu
Oct 30, 2024 01:49 PM IST

Free Gas Subsidy: ఆంధ్రప్రదేశ్‌ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో హామీల్లో భాగమైన ఉచిత గ్యాస్‌ సిలిండర్‌ పథకానికి అవసరమైన సొమ్మును ప్రభుత్వ రంగ గ్యాస్ కంపెనీలకు చెల్లించారు. రాష్ట్రంలో ఉన్న 1.47 కోట్ల రేషన్ కార్డుదారులకు ఏటా మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లను అందిస్తారు.

ఉచిత గ్యాస్ సిలిండర్లకు నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు
ఉచిత గ్యాస్ సిలిండర్లకు నిధులు విడుదల చేసిన సీఎం చంద్రబాబు

Free Gas Subsidy: ఏపీలో దీపావళి కానుకగా సూపర్ సిక్స్ ఉచిత సిలిండర్ల పథకాన్ని అమల్లోకి తీసుకు వచ్చారు. మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంలో సిలిండర్‌ బుక్‌ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీపం-2 పథకానికి రూ.2,684 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం, మొదటి విడతకు అయ్యే ఖర్చు రూ.894 కోట్ల మొత్తాన్ని పెట్రోలియం సంస్థలకు అందచేశారు.

సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం రాష్ట్రంలో అమల్లోకి వచ్చింది. దీపం-2 పథకానికి రాష్ట్రం ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం ప్రకటించిన సూపర్-6 హామీల్లో భాగంగా ఇచ్చిన యేడాదికి 3 గ్యాస్ సిలిండర్ల పథకానికి ఖర్చయ్యే నిధులను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గ్యాస్ సరఫరా చేసే పెట్రోలియం సంస్థలకు అందజేశారు.

బుధవారం సచివాలయంలోని మొదటి బ్లాక్ లో హిందుస్థాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సంస్థల ప్రతినిధులకు ముఖ్యమంత్రి ఈ సబ్సిడీ మొత్తాన్ని అందించారు. ఏడాదికి మూడు సిలిండర్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అయ్యే రూ.2,684 కోట్ల ఖర్చుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

ఇందులో భాగంగా ప్రభుత్వం పెట్రోలియం సంస్థలకు చెక్కు అందజేసింది. రూ.2,684 కోట్ల మంజూరుకు అంగీకారం తెలుపుతూ....మొదటి సిలిండర్ కు ఖర్చు అయ్యే రూ.894 కోట్లు పెట్రోలియం సంస్థలకు అందించింది. దీపం-2 పథకంలో భాగంగా ప్రతి నాలుగు నెలలకు ఒక సిలిండర్ చొప్పున ప్రభుత్వం పేద ప్రజలకు అందించనుంది. యేడాదికి మూడు విడతల్లో ప్రభుత్వం మూడు గ్యాస్ సిలిండర్లకు అయ్యే ఖర్చు సొమ్మును విడుదల చేయనుంది.

అక్టోబర్‌ 29వ తేదీ నుంచి ప్రభుత్వం ఈ పథకం కింద గ్యాస్ బుక్ చేసుకునే అవకాశాన్నిలబ్దిదారులకు కల్పించింది. గ్యాస్ సిలిండర్ అందిన 48 గంటల్లో లబ్ధిదారులు సిలిండర్ కు వెచ్చించిన సొమ్ము వారి ఖాతాలో జమ కానుంది. కేంద్రం ఇచ్చే రూ.25ల రాయితీ పోను మిగిలిన రూ.876లను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ పథకం అమలుకు ప్రతియేటా రూ.2,684 కోట్లు ప్రభుత్వంపై ఆర్థిక భారం పడనుంది.

ఈ కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖా మంత్రి నాదెండ్ల మనోహర్ తో పాటు తెనాలి నుంచి వచ్చిన దీపం పథకం లబ్దిదారు బాలమ్మ, ఏలూరు నుంచి వచ్చిన లబ్దిదారు భవానీ, విజయవాడ నుంచి వచ్చిన లబ్దిదారు మంగతాయారు, సివిల్ సప్లై శాఖ అధికారులు, పెట్రోలియం సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.

గ్యాస్ సబ్సిడీ అందుకోవాలంటే…

  • దీపం-2 పథకంలో భాగంగా ప్రభుత్వ రాయితీ అందుకోవాలంటే లబ్దిదారులు రేషన్‌ కార్డు కలిగి ఉండాలి. లబ్దిదారుల పేరిట గ్యాస్‌ కనెక్షన్ ఉండాలి. ఆధార్‌ కార్డులో ఉన్న పేరుతోనే రేషన్‌ కార్డు, గ్యాస్ కనెక్షన్‌ ఉండాలి. ఈ మూడు వివరాలు సరిపోయిన వారికి ప్రభుత్వం గ్యాస్ రాయితీ చెల్లిస్తుంది.
  • ప్రత్యక్ష నగదు బదిలీ పథకంలో భాగంగా మొదటి విడతలో గ్యాస్‌ సిలిండర్‌ ఖర్చును లబ్దిదారుల ఖాతాకు డెలివరీ చేసిన 48గంటల్లో జమ చేస్తారు. ఇందుకోసం ఆధార్ డేటా బేస్ వినియోగిస్తారు. ఉచిత గ్యాస్ సిలిండర్‌ పొందడానికి మొదట గ్యాస్‌ కంపెనీలకు లబ్దిదారుడు నగదు నేరుగా చెల్లించాల్సి ఉంటుంది. సిలిండర్ డెలివరీ అయిన తర్వాత సిలిండర్ ఖర్చును వాపసు చేస్తారు. బ్యాంక్‌ ఖాతాకు లింక్ అయిన ఆధార్‌ పేమెంట్ వ్యవస్థ ద్వారా ఈ నగదు జమ చేస్తారు. 
  • దీపం-2 పథకంలో గ్యాస్ సబ్సిడీని నాలుగు నెలల్లో ఎప్పుడైనా వాడుకోవచ్చు. మొదట తీసుకునే సిలిండర్‌కు మాత్రమే రాయితీ వర్తిస్తుంది. 2025 ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే రెండో విడతకు డిబిటి ఇబ్బందులు సవరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం గ్యాస్‌ సిలిండర్ బిల్లును వినియోగదారుడు మొదటే చెల్లించాలి.

Whats_app_banner