AP Politics : హస్తిన చేరుతున్న ఏపీ రాజకీయం, పొత్తుపై ప్రకటన వస్తుందా?
06 March 2024, 14:22 IST
- AP Politics : ఏపీ రాజకీయాలు హస్తిన చేరుతున్నాయి. కూటమి నేతలు దిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ భేటీ(Chandrababu Pawan meeting) అయ్యారు. పురంధేశ్వరి కూడా దిల్లీ బయలుదేరి వెళ్లారు.
హస్తిన చేరుతున్న ఏపీ రాజకీయం
AP Politics : ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. త్వరలో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్(Chandrababu Pawan Delhi Tour) దిల్లీ వెళ్లనున్నారు. దిల్లీ పర్యటనకు ముందు చంద్రబాబు, పవన్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. జనసేన అధినేత పవన్... చంద్రబాబుతో (Chandrababu Pawan meets)భేటీ అయ్యారు. ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి వచ్చిన పవన్.. అభ్యర్థుల ఎంపిక, దిల్లీ పర్యటన, పొత్తులపై చర్చించారు. టీడీపీ, జనసేన కూటమి(TDP Janasena Alliance)లో బీజేపీ చేరే అంశంపై గత కొంత కాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ విషయంపై ఇరువులు నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు, పవన్ భేటీ
రాష్ట్రంలో జనసేనకు కేటాయించిన సీట్లు, ఇరు పార్టీల సమన్వయం ఇతర అంశాలపై పవన్ , చంద్రబాబు చర్చలు జరిపారు. ఇరు పార్టీల సమన్వయం కోసం ఒక కమిటీ నియామకంపై చర్చలు జరిపారు. బీజేపీ(BJP)తో సీట్ల సర్దుబాటు, చర్చల తరువాత సీట్ల కేటాయింపు, ప్రకటనపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ, జనసేన ఉమ్మడిగా మూడో సభ ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశంపై పవన్, చంద్రబాబు సమాలోచనలు చేశారు. ఉమ్మడి మేనిఫెస్టో విడుదలపై చర్చించినట్లు తెలుస్తోంది.
వారంలో ఎన్నికల నోటిఫికేషన్
మరో వారం రోజుల్లో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్(AP Election Notification) రానుంది. ప్రధాన రాజకీయ పార్టీలు ఇప్పటికే భారీ సభలు నిర్వహిస్తున్నాయి. టీడీపీ, జనసేన ఇప్పటికే 99 స్థానాలలో ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించాయి. 94 స్థానాల్లో టీడీపీ, 5 స్థానాల్లో జనసేన అభ్యర్థులను ఖరారు చేశాయి. టీడీపీ, జనసేన కూటమి సీట్ల పంపకాల్లో ఇప్పటి వరకూ జనసేనకు 24 అసెంబ్లీ స్థానాలు కేటాయించారు. బీజేపీతో పొత్తు కుదిరితే మిగిలిన స్థానాలపై స్పష్టత రానుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ దిల్లీ వెళ్లనున్నారు.
టీడీపీ, జనసేన కూటమిలోకి బీజేపీ?
టీడీపీ జనసేన కూమిటిలోకి బీజేపీ చేరుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఒకసారి చంద్రబాబు దిల్లీ వెళ్లి చర్చలు జరిపారు. అయితే ఆ తర్వాత పొత్తుపై బీజేపీ నుంచి ఎలాంటి సూచన అందలేదు. పొత్తు ప్రకటన కోసం ఎదురుచూస్తున్న టీడీపీ, జనసేన ఎంపీ స్థానాలు ఖరారు చేయలేదు. ఇక ఎన్నికల సమయం దగ్గర పడడంతో పొత్తుపై స్పష్టత కోసం చంద్రబాబు, పవన్ దిల్లీ(Delhi Tour) వెళ్లనున్నారు. ఇప్పటికే తొలి జాబితా విడుదల చేసిన టీడీపీ, జనసేన కూటమి రెండో జాబితాపై చర్చలు జరుపుతున్నాయి. బీజేపీ పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే మిగిలిన స్థానాలపై స్పష్టత వస్తుందని తెలుస్తోంది.
పురంధేశ్వరి దిల్లీ పర్యటన
బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Purandeswari Delhi Tour)దిల్లీ వెళ్లారు. ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఖరారుపై బీజేపీ అధిష్ఠానంతో ఆమె చర్చించనున్నారు. జిల్లాల వారీగా పార్టీ నేతల అభిప్రాయాలు, ఆశావహుల జాబితా..సిద్ధం చేసుకున్న ఆమె నివేదికను దిల్లీ పెద్దలకు అందజేయనున్నారు. టీడీపీ, జనసేన కూటమితో పొత్తు విషయంలోనూ ఈ పర్యటనలో చర్చించే అవకాశం ఉంది. ఈ తరుణంలో పురంధేశ్వరి దిల్లీ పర్యటనపై ఆసక్తి నెలకొంది.