తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Bragcet 2024: ఏపీ అంబేడ్కర్ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాలు- ఇలా దరఖాస్తు చేసుకోండి!

AP BRAGCET 2024: ఏపీ అంబేడ్కర్ గురుకులాల్లో 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాలు- ఇలా దరఖాస్తు చేసుకోండి!

03 February 2024, 16:01 IST

google News
    • AP BRAGCET 2024: డా.బీఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 23వ తేదీలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. మార్చి 10న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
ఏపీ అంబేడ్కర్ గురుకులాల్లో అడ్మిషన్లు
ఏపీ అంబేడ్కర్ గురుకులాల్లో అడ్మిషన్లు

ఏపీ అంబేడ్కర్ గురుకులాల్లో అడ్మిషన్లు

AP BRAGCET 2024: ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 13 అంబేడ్కర్ గురుకుల విద్యాలయాలతో పాటు రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లోని గురుకుల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్ ప్రవేశానికి అప్లికేషన్లు ఆహ్వానించారు. ఈ నెల 23వ తేదీలోగా అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు. కృష్ణా జిల్లాలో 5వ తరగతి, ఇంటర్ కలిపి మొత్తం 2080 సీట్లు ఉన్నట్లు తెలిపారు. విద్యార్థులు https://apbragcet.apcfss.in/ అధికారిక వెబ్ సైట్ లో వివరాలు నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. నీట్, ఐఐటీ శిక్షణ కావాలనుకునే వారికి ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తామన్నారు. అయితే దరఖాస్తు చేసుకునే సమయంలో నీట్, ఐఐటీ ఆప్షన్ ఎంచుకోవాలని తెలిపారు. ఈ పరీక్షల్లో(APBRAGCET 2024) ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు కర్నూలు, గుంటూరు, విజయవాడ కేంద్రాల్లో చేరే అవకాశం కల్పిస్తామన్నారు. మార్చి 10వ తేదీన ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇంటర్ ప్రవేశాలకు పదో తరగతి సిలబస్ పై, 5వ తరగతి ప్రవేశాలకు 4వ తరగతి సిలబస్ పై పరీక్ష నిర్వహించున్నారు.

గుంటూరు జిల్లాలో

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని డా. బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి 5వ తరగతి, ఇంటర్ ప్రవేశాలకు నోటిఫికేషన్ వెలువడింది. విద్యార్థులు తమ సొంత జిల్లాలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2022-23 విద్యా సంవత్సరంలో 3వ తరగతి, 2023-24లో 4వ తరగతి చదువు పూర్తిచేసి ఉండాలి. రాష్ట్రంలోని 186 గురుకులాల్లో మొత్తం 15,020 సీట్లు ఉండగా.... వీటిలో ఎస్సీలకు 11,266 సీట్లు, బీసీ-సి (ఎస్సీ-కన్వర్టెడ్)లకు 1,876 సీట్లు, ఎస్టీలకు 938 సీట్లు, బీసీలకు 752 సీట్లు, ఓసీలకు 188 సీట్లు కేటాయించారు.

విశాఖ జిల్లాలో

విశాఖ జిల్లా కంచరపాలెంలోని అంబేడ్కర్‌ గురుకుల విద్యాలయాలయాల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మేహాద్రి గెడ్డ, సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌(కొమ్మాది), కోనాం, కొక్కిరాపల్లి, తాళ్లపాలెం, నక్కపల్లి(నర్సీపట్నం)లోని బాలికల గురుకుల పాఠశాలలు, సబ్బవరం, శ్రీకృష్ణాపురం, దేవరాపల్లి, గొలుగొండలోని బాలుర గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో ప్రవేశానికి ఫిబ్రవరి 23 లోపు విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 5వ తరగతిలో అడ్మిషన్ల కోసం మార్చి10 ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కోసం మార్చి 10 మధ్యాహ్నం 2 నుంచి 4.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.

164 గురుకుల జూనియర్ కాలేజీలు

అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా ఫిబ్రవరి 23లోగా దరఖాస్తులు సమర్పించాలి. ఒకసారి అప్లికేషన్ సబ్మిట్ చేసిన ఎట్టిపరిస్థితుల్లోనూ మార్పులు చేసేందుకు అవకాశం లేదని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఎంట్రన్స్ ఎగ్జామ్ ద్వారా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య, వసతితో పాటు క్రీడలు, వివిధ పోటీ పరీక్షలకు శిక్షణ ఇస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 164 గురుకుల జూనియర్ కాలేజీల్లో మొత్తం 13,230 సీట్లు ఉండగా...వీటిల్లో ఎస్సీలకు 75 శాతం, బీసీ-సి (ఎస్సీ-కన్వర్టెడ్ క్రిస్టియన్స్)లకు 12 శాతం, ఎస్టీలకు 6 శాతం, బీసీలకు 5 శాతం, ఇతరులకు 2 శాతం సీట్లు కేటాయిస్తారు. వీటిల్లో ఐఐటీ మెడికల్ అకాడమీలో ఎంపీసీ 300 సీట్లు, బైపీసీ 300 సీట్లు ఉన్నాయి.

తదుపరి వ్యాసం