AP Assembly Session : ఏపీ అసెంబ్లీలో గందరగోళం, ఈలలు వేస్తూ, పేపర్లు విసురుతూ నినాదాలు-టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్
06 February 2024, 14:22 IST
- AP Assembly Session : ఏపీ అసెంబ్లీ రెండో రోజు సమావేశాలు రసవత్తరంగా మొదలయ్యాయి. టీడీపీ సభ్యులు నిత్యావసర ధరల పెరుగుదల పై వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టగా స్పీకర్ తిరస్కరించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యే సభలో ఈలలు వేస్తూ నిరసన తెలిపారు. స్పీకర్ టీడీపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారు.
ఏపీ అసెంబ్లీలో గందరగోళం
AP Assembly Session : ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రెండో రోజు సభలో టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అనుసరిస్తుందని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. ధరల పెంపు, పన్నుల భారంతో ప్రజల నడ్డి విరుస్తున్నారని నినాదాలు చేశారు. టీడీపీ సభ్యులు స్పీకర్ తమ్మినేని సీతారామ్ పోడియం వద్దకు దూసుకెళ్లారు. విజిల్స్ వేస్తూ, పేపర్లు చింపి విసురుతూ టీడీపీ ఎమ్మెల్యే గందరగోళం సృష్టించారు. దీంతో టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారామ్ ఒకరోజు పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు.
సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేలు
కింజరాపు అచ్చెన్నాయుడు, నందమూరి బాలకృష్ణ, గద్దె రామ్మోహన్ , నిమ్మల రామానాయుడు, బెందాళం అశోక్, ఆదిరెడ్డి భవాని, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, నిమ్మకాయల చినరాజప్ప, ఏలూరి సాంబశివరావు, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, గొట్టిపాటి రవికుమార్, డోలా బాలవీరాంజనేయ స్వామి
సభలో ఈలలు
మంగళవారం ఏపీ అసెంబ్లీ సమావేశాలు మొదలైనప్పటి నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు నిరసనలతో సభను హోరెత్తించారు. నిత్యావసర వస్తువుల ధరలపై టీడీపీ వాయిదా తీర్మానానికి పట్టుబట్టగా, అందుకు స్పీకర్ నిరాకరించారు. దీంతో టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లి పేపర్లు చింపుతూ నినాదాలు చేశారు. సభలో గందరగోళ పరిస్థితులు నెలకొనడంతో స్పీకర్ టీ బ్రేక్ ఇచ్చారు. టీ బ్రేక్ తర్వాత సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యులు మళ్లీ వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టారు. అందుకు స్పీకర్ తిరస్కరించారు. దీంతో మళ్లీ స్పీకర్ పోడియంపైకి వెళ్లిన టీడీపీ సభ్యులు గట్టిగా నినాదాలు చేశారు. వైసీపీ సభ్యులు సభలో మాట్లాడుతుండగా టీడీపీ ఎమ్మెల్యేలు ఈలలు వేసి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేలను బయటకు వెళ్లిపోవాలని స్పీకర్ ఆదేశించారు. మార్షల్స్ వచ్చి టీడీపీ ఎమ్మెల్యేలను సభ నుంచి బయటకు తీసుకెళ్లారు. టీడీపీ ఎమ్మెల్యేలు ఈలలు వేసుకుంటూనే బయటకు వెళ్లారు.
తొడలు కొడితే కుర్చీ రాదు- ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి
టీడీపీ సభ్యుల తీరుపై వైసీపీ ఎమ్మెల్యేలు అసహనం వ్యక్తం చేశారు. స్పీకర్ తో టీడీపీ సభ్యులు అవమానకరంగా ప్రవర్తించారని ఆరోపించారు. వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ...తొడలు కొడితే కుర్చీరాదు, ప్రజలు ఆశీర్వదిస్తే వస్తుందన్నారు. మాయ మాటలు చెప్పాలని ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. నిజమైన నాయకుడు ప్రజల అభివృద్ధిపై ఫోకస్ చేస్తారన్నారు. అంబేడ్కర్‌ను ఒక వ్యక్తిలా కాకుండా సిద్ధాంతంలా తీసుకుని సీఎం జగన్ ముందుకు వెళ్తున్నారన్నారు. సీఎం జగన్ విద్యావ్యవస్థ రూపురేఖలను పూర్తిగా మార్చి పిల్లలకు మేనమామలా మారారన్నారు. ఆరోగ్యశ్రీని రూ. 5 లక్షల నుంచి రూ. 25 లక్షలకు పెంచారన్నారు.
స్పీకర్ ను అవమానిస్తున్నారు- మంత్రి అంబటి రాంబాబు
స్పీకర్ తో టీడీపీ సభ్యుల అనుచిత ప్రవర్తన సరికాదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పేపర్లు చింపి, ఈలలు వేస్తూ స్పీకర్‌ను అవమానిస్తున్నారన్నారు. టీడీపీ సభ్యులు సభా సంప్రాదాయాలను పాటించడంలేదన్నారు. ఇలా ప్రతీసారి సభను అడ్డుకోవడం సరికాదన్నారు. టీడీపీ సభ్యులు ఉద్దేశపూర్వకంగానే వైసీపీ సభ్యులను రెచ్చగొడుతున్నారన్నారు.