Sarpanches Chalo Assembly: అసెంబ్లీ ముట్టడికి సర్పంచుల ప్రయత్నం, ఉద్రిక్తత.. టీడీపీ ఆందోళనతో సభ వాయిదా
06 February 2024, 10:16 IST
- Sarpanches Chalo Assembly: ఏపీ అసెంబ్లీని ముట్టడించేందుకు సర్పంచులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్ద సంఖ్యలో సర్పంచులు అసెంబ్లీ వైపు దూసుకురావడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.
పోలీసుల కాళ్లు పట్టుకున్న సర్పంచుల సంఘం నాయకుడు
Sarpanches Chalo Assembly: నిధుల మళ్లింపును నిరసిస్తూ సర్పంచులు ఏపీ అసెంబ్లీని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. సభ కార్యక్రమాలు మొదలయ్యే సమయానికి వెలగపూడిలోని అసెంబ్లీ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెద్ద సంఖ్యలో సర్పంచులు అసెంబ్లీ వైపు దూసుకు వచ్చారు.
ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ సర్పంచులు పెద్ద సంఖ్యలో అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. గత నాలుగున్నరేళ్లుగా పంచాయితీలకు దక్కాల్సిన నిధుల్ని మళ్లించారనే ఆరోపణలతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి సర్పంచులు అసెంబ్లీకి తరలి వచ్చారు.
అసెంబ్లీ సమీపంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనకు దిగారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు సర్పంచులకు మధ్య తోపులాట జరిగింది. తమను అనుమతించాలంటూ సర్పంచులు పోలీసుల కాళ్లపై పడి వేడుకున్నారు.
ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దారిమళ్లించిందని.. పంచాయితీల ఖాతాల్లో నిధులను జమ చేయాలని సర్పంచ్లు డిమాండ్ చేశారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
సర్పంచుల అసెంబ్లీ ముట్టడి సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకోవడంతో తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా సర్పంచులు నినాదాలు చేశారు. పోలీసుల లాఠీచార్జిలో పలువురు సర్పంచులకు గాయాలయ్యాయి. ఆర్థిక సంఘం నిధులను ప్రభుత్వం దారి మళ్లించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.ః
టీడీపీ ఆందోళనతో సభ వాయిదా..
ఏపీ అసెంబ్లీ సమావేశాల రెండో రోజు ప్రారంభమైన వెంటనే టీడీపీ వాయిదా తీర్మానానికి పట్టుబట్టింది. ధరల పెరుగుదలపై టీడీపీ వాయిదా తీర్మానం ప్రవేశ పెట్టింది. ధరల పెరుగుదలపై చర్చించాలని డిమాండ్ చేసింది. స్పీకర్ సభ కొనసాగించడంతో టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు.
టీడీపీ వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించడంతో పేపర్లు చించి స్పీకర్‌పై విసురుతూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యుల తీరుపై మంత్రి అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభను వాయిదా వేశారు. అసెంబ్లీ సమావేశాల రెండో రోజు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను అమోదిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.
టీడీపీ సభ్యులకు ప్రజా సమస్యలపై చిత్తశుద్ధి లేదని వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్‌బాబు ఆరోపించారు. టీడీపీ సభ్యులు సభా సంప్రదాయాలను పాటించడం లేదని, బలహీన వర్గాలకు చెందిన స్పీకర్‌ను అవమానించారని ఆరోపించారు. టీడీపీ సభ్యులు నీచ రాజకీయాలు చేస్తున్నారని, పేద విద్యార్థులకు తమ ప్రభుత్వం విద్యను చేరువ చేసిందన్నారు. టీడీపీ పాలనలో అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు.
సీఎం జగన్.. విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేశారని, విద్యాకానుక కింద రూ. 11,901 కోట్లు అందించారని, విద్యా దీవెన కింద రూ. 4, 276 కోట్లు అందించారని, రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని, సీఎం జగన్ హయాంలో విద్యా రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారన్నారు.
శాసన సభ రెండో రోజు ప్రారంభమైన వెంటనే పలు బిల్లులకు స్పీకర్ ప్రవేశపెట్టారు. వాటికి సభ అమోదం తెలిపింది. ఏపీ అడ్వకేట్స్ వెల్ఫేర్ ఫండ్ సవరణ బిల్లుకు ఆమోదం లభించింది. ఆ తర్వాత గంటా రాజీనామా అమోదిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు.