తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Cabinet Decisions : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఆమోదం, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే

AP Cabinet Decisions : ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఆమోదం, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే

16 July 2024, 16:00 IST

google News
    • AP Cabinet Decisions : సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఆమోదం, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఆమోదం, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే

ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు ఆమోదం, ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలివే

AP Cabinet Decisions : ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే పంటల బీమా పథకానికి ప్రీమియం చెల్లింపు విధివిధానాలపై ముగ్గురు మంత్రులతో కమిటీ వేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఈ కమిటీలో మంత్రులు అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, నాదెండ్ల మనోహర్‌ సభ్యులుగా ఉంటారు. దీనిపై రెండు రోజుల్లో అధికారులతో చర్చించి ఓ నిర్ణయానికి రావాలని కమిటీకి కేబినెట్ ఆదేశించింది. పంటల బీమా ప్రీమియం రైతులు చెల్లించాలా? ప్రభుత్వం చెల్లించాలా అనే అంశాన్ని కమిటీ ఖరారు చేయనుంది.

కేబినెట్ నిర్ణయాలు

కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త ఇసుక విధానం, పౌరసరఫరాల శాఖ రూ.2 వేల కోట్ల రుణానికి ప్రభుత్వ గ్యారంటీ అంశాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. నూతన ఉచిత ఇసుక విధానంపై త్వరలో విధివిధానాలు రూపొందించనున్నారని కేబినెట్ తెలిపింది. అలాగే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు కోసం ఎన్సీడీసీ నుంచి రూ.3,200 కోట్ల రుణానికి వ్యవసాయ, సహకార కార్పొరేషన్ కు ప్రభుత్వ గ్యారంటీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెల 22వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి నెల రోజులైన దృష్ట్యా ప్రభుత్వ పనితీరుపైనా సమీక్షించాలని కేబినెట్ నిర్ణయించింది. ప్రజాభిప్రాయాలపై ఈ సమావేశంలో మంత్రులు చర్చించారు.

కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్‌ రెడ్డి బియ్యం అక్రమాలపై కేబినెట్ లో చర్చ జరిగినట్టు సమాచారం. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, అతని ఇద్దరు కుమారులు ముగ్గురూ కలిసి బియ్యం రీసైక్లింగ్‌ చేసి కిలో రూ.43కు ఎగుమతి చేశారని మంత్రులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు.

జులై 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు

కేబినెట్ భేటీ అనంతరం మంత్రులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఉచిత ఇసుక విధానంలో మంత్రులు, ఎమ్మెల్యేలు జోక్యం చేసుకోవద్దన్నారు. అక్టోబర్ తర్వాత ఇసుక రీచులన్నీ అందుబాటులోకి వస్తాయన్నారు. డంప్‌ యార్డుల్లో 43 లక్షల టన్నుల ఇసుక ఉందన్నారు. వచ్చే 3 నెలల్లో కోటి టన్నుల ఇసుక అవసరమని సీఎం చంద్రబాబు తెలిపారు. బోట్ సొసైటీలు, నదుల్లో పూడిక తీత ద్వారా 80 లక్షల టన్నుల ఇసుక వస్తుందని అంచనా వేశామన్నారు. కొత్త మంత్రులు లోటు బడ్జెట్‌ ను గ్రహించి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. మంత్రులు తమ శాఖలపై ప్రతి నెలా సమీక్షించాలన్నారు. ఎలాంటి వివాదాలు లేకుండా ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని పనిచేయాలని సూచించారు. జులై 22 నుంచి ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామన్నారు.

"రైతులు, స్టేక్ హోల్టర్స్ తో చర్చించకుండా భయంకరమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. నీతి ఆయోగ్ ప్రతిపాదించిన విషయాలు ఈ చట్టంలో లేవు. నీతి ఆయోగ్ ప్రతిపాదనలో ప్రభుత్వ ప్రతినిధి టైటిలింగ్ అధికారిగా ఉంటారు. కానీ గత వైసీపీ ప్రభుత్వం ఈ విషయాన్ని స్పష్టం చేయకుండా "ఏనీ పర్సన్" అని చట్టంలో పేర్కొంది. ఈ చట్టం ప్రకారం టైటిలింగ్ అధికారికి సంపూర్ణ అధికారం ఇచ్చారు. టైటిలింగ్ సమస్యలను కింద స్థాయి కోర్టుల్లో సవాల్ చేయడానికి లేదు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టు ఇంకా వివాదాలు పెంచేలా ఉంది. ఈ చట్టం రద్దుకు కేబినెట్ ఆమోదించింది"- మంత్రి పార్థసారథి

తదుపరి వ్యాసం