Actor Ali Resigns To Ysrcp : వైసీపీకి సినీ నటుడు అలీ రాజీనామా- రాజకీయాలకు గుడ్ బై అంటూ వీడియో రిలీజ్
28 June 2024, 20:54 IST
- Actor Ali Resigns To Ysrcp : సినీ నటుడు అలీ రాజకీయాలు గుడ్ బై చెప్పారు. ఇకపై తాను ఏ పార్టీ మనిషి కాదంటూ ఓ వీడియో విడుదల చేశారు.
వైసీపీకి సినీ నటుడు అలీ రాజీనామా
Actor Ali Resigns To Ysrcp : సినీ నటుడు అలీ వైసీపీకి రాజీనామా చేశారు. అలాగే రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించారు. తాను ప్రస్తుతం ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని ఓ వీడియో విడుదల చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో అలీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా పనిచేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టికెట్ ఆశించిన అలీ భంగపడ్డారు. ఆయనకు వైసీపీ టికెట్ కేటాయించలేదు. దీంతో అలీ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్నారు. తాజాగా తాను ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కాదని, ఒక సామాన్యుడినని, ఐదేళ్ల ఒకసారి ఓటు హక్కు వినియోగించుకుంటానని ఓ వీడియో విడుదల చేశారు.
ఇకపై ఏ పార్టీ వ్యక్తిని కాదు
"1999లో డాక్టర్ డి.రామానాయుడు కోసం నేను రాజకీయాల్లో అడుగుపెట్టాను. నాకు అద్భుతమైన అవకాశం ఇచ్చి సినిమాల్లో నిలదొక్కుకునేందుకు రామానాయుడు సాయం చేశారు. ఆయన కోసం నేను అప్పట్లో బాపట్లలో ప్రచారం చేశారు. ఆ తర్వాత మరో పార్టీలో జాయిన్ అయ్యాను. నాకు అన్నం పెట్టింది సినీ ఇండస్ట్రీ. ఈ రోజున ఈ స్థాయిలో ఉన్నానంటే అందుకు తెలుగు ప్రజలే కారణం. ఇవాళ 1200లకు పైగా చిత్రాల్లో నటించాను. 6 భాషల్లో నటించాను. దాదాపు 45 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో ఉన్నాను. నాకు ఇంత చేసిన తెలుగు ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను తప్ప రాజకీయాలు చేయాలని రాజకీయాల్లోకి రాలేదు. మా నాన్న పేరుతో నేను ఒక ట్రస్ట్ నడుపుతున్నాను. కోవిడ్ సమయంలో కూడా నా ట్రస్ట్ ద్వారా సేవలు అందించాను. నేను సంపాదించిన దానిలో 20 శాతం ఆ ట్రస్ట్ ద్వారా పేద ప్రజలకు సేవ చేస్తున్నారు. విదేశాల్లో ప్రోగ్రామ్స్ చేస్తే 60 శాతం ట్రస్ట్ కు ఇస్తాను. ఇకపై నా జీవితం సినిమాలకే అంకితం. రాజకీయాలను దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను. ఇకపై నేను ఏ రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తిని కాదు"- సినీ నటుడు అలీ
2019 ఎన్నికలకు ముందు వైసీపీలోకి
సినీ నటుడు అలీ వైసీపీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను వైసీపీ అధ్యక్షుడు జగన్‌కు పంపారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, అలీ గతంలో మంచి స్నేహితులు. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి అలీ పోటీ చేస్తారని ప్రచారం. అయితే ఎన్నికల ముందు పవన్ కు అలీ ట్విస్ట్ ఇచ్చారు. 2019 ఎన్నికల ముందు అలీ వైసీపీలో చేరారు. ఆ ఎన్నికల్లో వైసీపీ తరఫున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు. వైసీపీ అధికారంలోకి రావడంతో అలీకు రాజ్యసభ పోస్ట్ లేదా ఎమ్మెల్సీ పదవి ఇస్తారని ప్రచారం జరిగింది. వక్స్ బోర్డ్ ఛైర్మన్ పదవి అంటూ కొన్నాళ్లు ప్రచారం జరిగింది. ఈ పదవులు అలీకి దక్కలేదు. చివరిగా 2022లో అలీని జగన్ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమించింది. రెండేళ్లు పాటు ఆయన ఈ పదవిలో కొనసాగారు. ఇక 2024 ఎన్నికల్లో అలీకి ఎమ్మెల్యే లేదా ఎంపీ సీటు ఇస్తారని ప్రచారం జరిగింది. కానీ ఈసారి అలీకి నిరాశే ఎదురైంది. టికెట్ దక్కకపోవడంతో వైసీపీ ఎన్నికల ప్రచారానికి అలీ దూరంగా ఉన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాలైంది. తాజాగా అలీ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలో తాను ఏ పార్టీలో ఉన్న ఎవరినీ వ్యక్తిగతంలో విమర్శించలేదని, ఆయా పార్టీ, అధినేతలను మాత్రమే పొడిగాడని ఓ వీడియో విడుదల చేశారు అలీ. అయితే జగన్ ఆదేశిస్తే పవన్ కల్యాణ్ పై పోటీ చేస్తానని గతంలో అలీ చేసిన కామెంట్స్, విశాఖలో ఓ కార్యక్రమంలో ఎవర్ని ఎక్కడ పెట్టాలో ప్రజలకు తెలుసు అని అలీ చేసి వ్యాఖ్యలు సామాజిక్ మాధ్యమాల్లో వైరల్ అవుతున్నారు.