Chevella MLA Yadaiah : బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే ఔట్ - కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య..!-brs chevella mla kale yadaiah joined congress ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Chevella Mla Yadaiah : బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే ఔట్ - కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య..!

Chevella MLA Yadaiah : బీఆర్ఎస్ నుంచి మరో ఎమ్మెల్యే ఔట్ - కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య..!

Maheshwaram Mahendra Chary HT Telugu
Jun 28, 2024 04:03 PM IST

Chevella MLA Yadaiah Joined Congress : చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ లో చేరారు. దీంతో కారు పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరింది.

కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య..!
కాంగ్రెస్ లో చేరిన చేవెళ్ల ఎమ్మెల్యే యాదయ్య..!

Chevella MLA Yadaiah : బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఇటీవలే జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ మారగా… తాజాగా చేవెళ్ల నుంచి గెలిచిన కాలె యాదయ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు దీపాదాస్‌ మున్షి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. యాదయ్య చేరికతో బీఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య 6కు చేరింది.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల నియోజకవర్గం నుంచి యాదయ్య మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 2014లో కాంగ్రెస్ తరపున గెలిచిన ఆయన… ఆ తర్వాత బీఆర్ఎస్ గూటికి చేరారు. 2018 ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచిన యాదయ్య…. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 268 ఓట్ల తేడాతో బయటపడ్డారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన భీమ్ భరత్ నుంచి గట్టి పోటీని ఎదుర్కున్నారు.

2023 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున మొత్తం 39 మంది ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీరిలో దానం నాగేందర్, కడియం శ్రీహరి. తెల్లా వెంకట్రావ్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్ హస్తం గూటికి చేరారు. తాజాగా కాలె యాదయ్య చేరితో బీఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యేల సంఖ్య ఆరుకు చేరింది. మరికొంత మంది కూడా బీఆర్ఎస్ పార్టీని వీడి…. కాంగ్రెస్ గూటికి చేరే అవకాశం ఉందని తెలుస్తోంది.

కేబినెట్ విస్తరణపై కసరత్తు…..

మరోవైపు తెలంగాణ కేబినెట్ విస్తరణకు రంగం సిద్ధమవుతోంది. ఆ దిశగా సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఢిల్లీకి చేరిన ఆయన…. బిజీబిజీగా గడుపుతున్నారు. ఇదే సమయంలో పీసీసీ చీఫ్ గా ఎవరిని నియమించాలనే దానిపై కూడా ఫోకస్ పెట్టారు. అధినాయకత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే….. కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.

గతేడాది డిసెంబరు 9వ తేదీన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం చేపట్టింది. ఇదే రోజు హైదరాబాద్ ఎల్బీ స్టేడియం వేదికగా సీఎం రేవంత్ రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత కేబినెట్ లో 11 మంది మంత్రులు ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిపి ఈ సంఖ్య 12గా ఉంది. మరో ఆరు ఖాళీలను భర్తీ చేయాల్సి ఉంది. వీటి కోసం పలువురు నేతలు చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారు.

ప్రభుత్వ ఏర్పాటు తర్వాత… కీలక నేతలకు మంత్రివర్గంలో అవకాశం కల్పించారు. ఆ తర్వాత ఖాళీలను కూడా భర్తీ చేయాలని భావించినప్పటికీ లోక్ సభ ఎన్నికల కోడ్ వచ్చేసింది. దీంతో కాంగ్రెస్ అధినాయకత్వం…. ఎన్నికలపై ఫోకస్ పెట్టాల్సి వచ్చింది. ఎన్నికల ఫలితాలు రావటంతో మళ్లీ పాలనపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. ఇదే సమయంలో పూర్తిస్థాయి కేబినెట్ టీమ్ తో ముందుకెళ్లాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇక నామినెటేడ్ పోస్టులను కూడా భర్తీ చేయాలని యోచిస్తున్నారు.

మంత్రివర్గంలో చోటు కోసం చాలా మంది ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరు స్థానాలు మాత్రమే ఖాళీ ఉండగా… వీటి కోసం చాలా మంది నేతలు రేసులో ఉన్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ నుంచి చేరిన ఎమ్మెల్యేలు కూడా వీటిని ఆశిస్తున్నారు. మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫలితంగా ఆయా జిల్లాల్లో సమీకరణాలు మారిపోతున్నాయి. దీంతో కేబినెట్ లో ఎవరికి చోటు దక్కబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

పీసీసీ చీఫ్ పదవి పై కన్ను…..!

ఇక పీసీసీ చీఫ్ కోసం కాంగ్రెస్ లోని కీలక నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ సామాజికవర్గాలకు చెందిన నేతలు రేసులో ఉన్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు కూడా ఈ లిస్ట్ లో ఉండగా…. అధినాయకత్వం ఎవరివైపు మొగ్గు చూపబోతుందనేది ఆసక్తికరంగా మారింది. పీసీసీ చీఫ్ నియామకంలో కూడా సీఎం రేవంత్ రెడ్డిదే కీలక పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది…!

టాపిక్