Lok Sabha Elections 2024 : పెద్దపల్లిలో మారుతున్న రాజకీయాలు..! త్రిముఖ పోటీలో గెలిచేదెవరు..?-loksabha elections 2024 triangular fight in peddapalli lok sabha constituency ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Lok Sabha Elections 2024 : పెద్దపల్లిలో మారుతున్న రాజకీయాలు..! త్రిముఖ పోటీలో గెలిచేదెవరు..?

Lok Sabha Elections 2024 : పెద్దపల్లిలో మారుతున్న రాజకీయాలు..! త్రిముఖ పోటీలో గెలిచేదెవరు..?

HT Telugu Desk HT Telugu
May 05, 2024 09:57 AM IST

Lok Sabha Elections in Telangana 2024: పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గ(Peddapalli) పరిధిలో పోటీ ఆసక్తికరంగా మారింది. బలమైన అభ్యర్థులు బరిలో ఉండటంతో ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారనేది అత్యంత ఆసక్తికరంగా మారింది.

పెద్దపల్లిలో త్రిముఖ పోటీ
పెద్దపల్లిలో త్రిముఖ పోటీ

Peddapalli Lok Sabha Constituency : పెద్దపల్లిలో రాజకీయంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.‌ కాంగ్రెస్ కంచుకోటలో పాగా వేసేందుకు బిఆర్ఎస్, బీజేపి ప్రయత్నిస్తున్నాయి. సిట్టింగ్ ఎంపీకి చెక్ పెట్టి కొత్త అభ్యర్థిని గులాబీ దళపతి కేసీఆర్ బరిలోకి దింపగా, కాంగ్రెస్ ఆర్థికంగా బలమైన వ్యక్తిని, బిజేపి సామాజికంగా అంశాన్ని పరిగణలోకి తీసుకుని సరికొత్త అభ్యర్థిని పోటీలో పెట్టింది.

బరిలో 42 మంది….

ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీలతో పాటు 42 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ(Gaddam Vamshi Krishna), బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Kopula Eashwar), బిజేపీ నుంచి గోమాస శ్రీనివాస్ పోటీలో ఉన్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ కు కంచుకోటగా ఉన్న పెద్దపల్లి... తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టిఆర్ఎస్ కు అడ్డగా మారింది.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గ(Peddapalli Lok Sabha constituency) పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. కేంద్రంలో బిజేపి, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా సిట్టింగ్ స్థానం బిఆర్ఎస్ ది కావడం.. ఈసారి ఎక్కువ మంది పోటీ చేస్తుండడంతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనే చర్చ సాగుతుంది. ఎత్తుకు పైఎత్తులతో దూకుడు పెంచిన మూడు ప్రధాన పార్టీలు గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నాయి.

కాంగ్రెస్ కు కంచుకోట.…

వెలుగులు విరజిమ్మే ఎన్టీపీసీ(NTOC), సిరుల మాగాణి సింగరేణి తో మూడిపడి ఉన్న పెద్దపల్లి పార్లమెంట్ పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఎస్సీ రిజర్వుడు స్థానమైన పెద్దపల్లిలో పార్లమెంట్ ఎన్నికల రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. నాలుగు జిల్లాల్లో విస్తరించిన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం సెంటర్ అట్రాక్షన్ గా నిలుస్తుంది.

పెద్దపల్లి, జగిత్యాల, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలతో ఏర్పడిన ఈ పార్లమెంట్ నియోజకవర్గం(Peddapalli Lok Sabha constituency) రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. పార్లమెంట్ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 15 సార్లు ఎన్నికలు జరుగగా 9 సార్లు కాంగ్రెస్, మూడుసార్లు టిడిపి, రెండు సార్లు టిఆర్ఎస్ ఒకసారి తెలంగాణ ప్రజాసమితి గెలిచాయి.‌ కానీ బిజేపి మాత్రం ఒక్కసారి కూడా గెలువలేదు. కనీసం రెండో స్థానానికి సైతం రాలేదు.

బీజేపీకి ప్రాతినిధ్యం లేని నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఈసారి ట్రై యాంగిల్ ఫైట్ జరుగుతుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బిఆర్ఎస్ మూడు పార్టీలు ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తూ కధన రంగంలోకి దుకారు. గెలుపే లక్ష్యంగా అధికార, విపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి.

సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బిఆర్ఎస్(BRS Party) కసరత్తు చేస్తుండగా, అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకున్న కాంగ్రెస్ ఎంపీ స్థానాన్ని చేజిక్కించుకునేలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. ఇక బిజెపి… మోడీ నామా జపంతో సత్తా చాటుకునేందుకు యత్నిస్తుంది. మూడు ప్రధాన పార్టీలు ఎత్తుకు పైఎత్తులతో కొత్త ముఖాలను, సరికొత్త అభ్యర్థులను తెరపైకి తెచ్చి సత్తా చాటే పనిలో నిమగ్నమయ్యాయి.

మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బిజేపి(BJP), బిఆర్ఎస్ శక్తియుక్తులను ప్రదర్శిస్తున్నాయి. పార్లమెంట్ నియోజకవర్గంలో మొత్తం 15 లక్షల 92 వేల 996 మంది ఓటర్లు ఉన్నారు. అందులో మహిళలు 805755 మంది కాగా పురుష ఓటర్లు 787140 మంది, ట్రాన్స్ జెండర్స్ 101 మంది ఓటర్లు ఉన్నారు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గ (Peddapalli Lok Sabha constituency)పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఏడింటిని కైవసం చేసుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 12 లక్షల 25 వేల 768 ఓట్లు పోల్ కాగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ కు 6 లక్షల 82 వేల ఓట్లు రాగా బిఆర్ఎస్ కు 3 లక్షల 74 ఓట్లు లభించాయి. బిజేపికి కేవలం 79 వేల ఓట్లు మాత్రమే లభించాయి.

అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీల వారీగా వచ్చిన ఓట్లు చూస్తే బిఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కు మూడు లక్షల ఏడు వేల 670 ఓట్లు ఎక్కువగా వచ్చాయి. సిట్టింగ్ ఎంపీగా ఉన్న బిఆర్ఎస్ నేత వెంకటేష్ కు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో 4 లక్షల 41 వేల 321 ఓట్లు దక్కాయి. నాలుగున్నరేళ్ల తర్వాత జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కు 3 లక్షల ఏడు వేల ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఓట్ల శాతాన్ని చూసి ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ కే అనుకూల ఫలితం వస్తుందని భావిస్తున్నారు.

రెండ్లుసార్లు బీఆర్ఎస్ ఖాతాలోకే….!

పెద్దపల్లి పార్లమెంట్(Peddapalli Lok Sabha constituency) నియోజకవర్గం నుంచి 1989, 1991, 1996 లో వరసగా మూడుసార్లు కాంగ్రెస్ నుంచి జి వెంకటస్వామి ఎంపీగా గెలుపొందారు. 1998, 1999 లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన సుగుణకుమారి చేతిలో వెంకటస్వామి ఓటమిపాలయ్యారు. తిరిగి వెంకటస్వామి 2004లో కాంగ్రెస్ నుంచి గెలుపొందారు. 2009 వెంకటస్వామి రాజకీయ రిటైర్మెంట్ తీసుకూని కుమారుడు వివేక్ వెంకటస్వామి బరిలోకి దింపగా 2009లో వివేక్ కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచి పార్లమెంటులో తొలిసారి అడుగు పెట్టారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక 2014లో జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో వివేక్, టిఆర్ఎస్ నుంచి పోటీ చేసిన బాల్క సుమన్(Balka Suman) చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2019లో వివేక్ పోటీ చేయలేకపోయారు. ఆ సమయంలో టిఆర్ఎస్ నుంచి వెంకటేష్ నేత, కాంగ్రెస్ నుంచి ఆగం చంద్రశేఖర్, బిజెపి నుంచి ఎస్.కుమార్ పోటీ చేయగా 95 వేల ఓట్ల మెజార్టీతో వెంకటేష్ నేత గెలుపొందారు.

పోటీ ఇద్దరి మధ్యనే…..

ప్రస్తుతం మూడు ప్రధాన పార్టీలు తక్కువే కాదన్నట్లు వ్యవహరించడంతో తాజా రాజకీయాలు రక్తికట్టిస్తున్నాయి. ప్రధాన రాజకీయ పార్టీల నేతల మద్య మాటల యుద్ధం సాగుతుంది. విమర్శలు.. ఆరోపణలు.. సవాళ్ళు ప్రతిసవాళ్ళతో ప్రజల్ని ఆకర్షించేందుకు కాంగ్రెస్ బిజెపి బిఆర్ఎస్ పోటీ పడుతున్నాయి. పోటీలో 42 మంది అభ్యర్థులు ఉన్నప్పటికి ప్రధానంగా పోటీ మాత్రం కాంగ్రెస్, బిఆర్ఎస్ మద్యనే కొనసాగుతుంది.

పార్టీల తీరు ఇలా..

పెద్దపల్లి పార్లమెంట్ స్థానానికి ప్రస్తుతం ఎంపీ గా వెంకటేష్ నేత కొనసాగుతున్నారు. గత 2019 ఎన్నికల్లో బిఆర్ఎస్ నుంచి గెలిచిన వెంకటేష్ నేత గత రెండు మాసాల క్రితం బిఆర్ఎస్ టిక్కెట్ లభించదని భావించి కారు దిగి కాంగ్రెస్ లో చేరారు. కానీ చివరకు టిక్కెట్ లభించకపోవడంతో నామినేషన్ ల చివరి రోజు కాంగ్రెస్ కు సైతం గుడ్ బై చెప్పి బిజేపిలో చేరాడు. అయన కథ అక్కడితో ముసిగిపోగా అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఒక్కటి కూడా గెలుచుకోలేక పోయినా సిట్టింగ్ ఎంపీ స్థానాన్ని కాపాడుకునేందుకు బిఆర్ఎస్ అధినేత కేసిఆర్ ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీ కి చెక్ పెట్టి మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ ను బరిలోకి దింపారు.

ఇక కాంగ్రెస్ కు కంచుకోటైన పెద్దపల్లి లో పూర్వవైభవాన్ని చాటుకునేందుకు ఆ పార్టీ యత్నిస్తుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ పరిధిలోని పెద్దపల్లి, రామగుండం, ధర్మపురి, మంథని, మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి ఏడు అసెంబ్లీ స్థానాలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది.

అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన కాంగ్రెస్… పార్లమెంట్ స్థానాన్ని తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఆర్థికంగా సామాజికంగా బలమైన అభ్యర్థి కోసం అన్వేషించి మాజీఎంపీ స్వర్గీయ వెంకటస్వామి తనయుడు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీకృష్ణను బరిలోకి దింపింది. ఇప్పటికి వరకు 15 సార్లు ఎన్నికలు జరుగగా అందులో 9 సార్లు కాంగ్రెస్ పార్టీ గెలుపొందింది. అందులో వెంకటస్వామి నాలుగు సార్లు, ఆయన కుమారుడు వివేక్ ఒకసారి ఎన్నికయ్యారు. వంశీ తండ్రీ వివేక్ చెన్నూరు నుంచి, పెద్దనాన్న వినోద్ బెల్లంపల్లి నుంచి ఎమ్మెల్యేలుగా ఉన్నారు. మంథని నుంచి మంత్రి శ్రీధర్ బాబు పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ చార్జీగా వ్యవహరిస్తున్నారు.

ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సైతం ఈసారి పార్లమెంటు ఎన్నికల్లో తమ సత్తాను చాటుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఆ పార్టీ నుంచి నేతకాని సామాజిక వర్గానికి చెందిన గోమాస శ్రీనివాస్ ను పోటీలో నిలిపింది. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో సామాజిక పరంగా నేతకాని ఓట్లు ఎక్కువగా ఉండడంతో వ్యూహాత్మకంగా బిజేపి ఎన్నికల ముందు శ్రీనివాస్ ను కాంగ్రెస్ నుంచి బిజేపిలో చేర్చుకుని టిక్కెట్ ఇచ్చింది.

టిక్కెట్ ఇచ్చిన తర్వాత శ్రీనివాస్ ప్రచారం చేయకపోవడంతో అభ్యర్థిని మార్చుతారనే ప్రచారం జరగడంతో కాంగ్రెస్ నుంచి టిక్కెట్ అశించి భంగపడ్డ సిట్టింగ్ ఎంపి వెంకటేష్ నేత బిజేపిలో చేరేందుకు యత్నించారు. అప్రమత్తమైన శ్రీనివాస్ ప్రచారం చేపట్టడం.. వెంకటేష్ నేత చేరిక ఆలస్యం కావడంతో చివరకు బిజేపి శ్రీనివాస్ నే కొనసాగించింది. కేవలం నరేంద్ర మోడీ (Modi)చరిష్మాతో ఎన్నికల బరి లోకి దిగి సత్తా చాటాలనే లక్ష్యంతోనే బిజెపి పోటీ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఆ పార్టీ నాయకుల వ్యూహం ఎలా ఉన్నా పెద్దపల్లిలో బిజెపి పోటీ ఆసక్తికరంగా మారింది.

రిపోర్టింగ్ - HT TELUGU CORRESPONDENT K.V.REDDY, KARIMNAGAR.

Whats_app_banner

సంబంధిత కథనం