TS Speaker Election: తెలంగాణ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవ ఎన్నిక
TS Speaker Election: తెలంగాణ శాసన సభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి గడ్డం ప్రసాద్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది.
TS Speaker Election: తెలంగాణ శాసనసభాపతిగా గడ్డం ప్రసాద్ కుమార్ బాధ్యతలు చేపట్టారు. శాసనసభకు మూడో స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. స్పీకర్ ఎన్నికకు బిఆర్‌ఎస్, ఎంఐఎం సహకరించగా బీజేపీ పరోక్షంగా సాయం చేసినట్టు సిఎం రేవంత్ రెడ్డి సభలో ప్రకటించారు.
బుధవారం సాయంత్రం నాటికి స్పీకర్ పదవికి నామినేషన్ల గడువు ముగిసింది. స్పీకర్ పదవికి గడ్డంప్రసాద్ కుమార్‌ను ప్రతిపాదించిన వారిలో సిఎం అనుమల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులు దామోదర రాజనరసింహ, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, అనసూయ సీతక్క దనసరి, తుమ్మలనాగేశ్వరరావు, బిఆర్‌ఎస్ నాయకుడు కల్వకుంట్ల తారకరామారావు, మహమ్మద్ మజీద్ హుస్సేన్, పున్నవెల్లి సాంబశివరావు, మల్లారెడ్డి రంగారెడ్డి, టి. రామ్మోహన్ రెడ్డి, యన్నం శ్రీనివాస రెడ్డి, మాతంసింగ్ రాజ్ ఠాకూర్, మనోహర్ రెడ్డి, సామేల్, పట్లోళ్ల సంజీవ రెడ్డి, టి.ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్య, వెంకటేష్, బండారి లక్ష్మారెడ్డి, జుల్ఫీకర్ అలీలు ప్రతిపాదించిన గడ్డం ప్రసాద్ కుమార్ ఏకీగ్రవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు. స్పీకర్ ఎంపిక ఏకగ్రీవంగా జరిగినట్టు ప్రొటెం స్పీకర్ అసదుద్దీన్ ఒవైసీ ప్రకటించారు.
స్పీకర్ గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్‌ను సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, కేటీఆర్ వెంట రాగా స్పీకర్ స్థానంలో కూర్చున్నారు. గడ్డం ప్రసాద్ కుమార్‌కు సభ్యులు అభినందనలు తెలిపారు. తెలంగాణ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్ కుమార్ ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకరించిన సభ్యులకు సిఎం రేవంత్ కృతజ్ఞతలు తెలిపారు.
బీఆర్‌ఎస్, బిజెపీ, ఎంఐఎం, సిపిఐ నాయకులు, శాసనసభ్యులు కూడా సహకరించారని సిఎం రేవంత్ రెడ్డి తెలిపారు. స్పీకర్ ఎన్నికకు సహకరించిన అన్ని పార్టీలకు సిఎం కృతజ్ఞతలు తెలిపారు. సభ మంచి సాంప్రదాయానికి నాంది పలికిందని, సభ సమన్వయంతో అందరి సహకారంతో నిర్వహించాలని కోరారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా నుంచి గడ్డం ప్రసాద్ కుమార్ స్పీకర్ బాధ్యతలు చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు.
వికారా బాద్ నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ కుమార్ మూడో స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టడంపై సంతోషం వ్యక్తం చేశారు. అతి సామాన్య కుటుంబం నుంచి వచ్చారని, చిన్న వయసులో తండ్రిని కోల్పోయినా, ఎనిమిది మంది సోదరిమణులతో కలిసి కుటుంబాన్ని సమన్వయంగా చేసుకుంటూ తోడబుట్టిన వారిని ముందుకు తీసుకెళ్లారని చెప్పారు. ఉమ్మడి కుటుంబంలో సమస్యల్ని వారు అడగక ముందే తెలుసుకుని గడ్డం ప్రసాద్ సమన్వయం చేసుకుంటే ముందుకెళ్లే వారని, శాసనసభలో సభ్యులు లేవనెత్తే సమస్యల్ని కూడా స్పీకర్‌గా అలాగే నడిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
సభలో సభ్యుల హక్కులను కాపాడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎంపీటీసీగా రాజకీయ ప్రస్థానం ప్రారంభమై 2008 ఉప ఎన్నికల్లో తొలిసారి గెలిచి 2009లో రెండోసారి ఎన్నికై మంత్రిగా బాధ్యతలు చేపట్టారని గుర్తు చేశారు. హ్యాండ్‌లూమ్స్ వీవర్స్ సమస్యల పరిష్కారం కోసం కృషి చేయడంతో పాటు వికారాబాద్ పట్టణానికి 2200కోట్లను జైపాల్ రెడ్డి ద్వారా మంజూరు చేయించారన్నారు. వికారాబాద్‌లో మెడికల్ కాలేజీ కావాలని ప్రతిపాదించారని, అక్కడ మెడికల్ కాలేజీల మంజూరైందన్నారు.
అప్పా జంక్షన్ నుంచి వికారాబాద్ మన్నెగూడ వరకు రోడ్డు విస్తరణకు కృషి చేశారన్నారు. ఎన్నికల్లో గెలిచినా, ఓడినా ప్రజల మధ్యే ఉన్నారని చెప్పారు. గడ్డం ప్రసాద్ కుమార్ వంటి వ్యక్తులు సునిశిత దృష్టితో, సభను వారి నాయకత్వంలో ఆదర్శవంతంగా నడిపించాలని కోరారు. ఎంపీటీసీ నుంచి శాసనసభాపతిగా ఎదిగిన తీరు అభినందనీయమన్నారు. తమ జిల్లా నుంచి వచ్చిన గడ్డం ప్రసాద్ కుమార్ సభ అధ్యక్షుడిగా ఎన్నిక కావడంపై అభినందనలు తెలిపారు.
స్పీకర్ ఎన్నికకు ముందు గురువారం సభ ప్రారంభమైన వెంటనే బిఆర్‌ఎస్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి, టి.పద్మారావు, పల్లారాజేశ్వరరావు సభలో సభ్యులుగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ అసదుద్దీన్ ఒవైసీ వారితో ప్రమాణం చేయించారు. పైడి రాకేష్ రెడ్డి, రాజా సింగ్ గైర్హాజరయ్యారు.
స్పీకర్ ఎన్నికకు బిఆర్‌ఎస్ మద్దతు…
స్పీకర్ పదవికి గడ్డం ప్రసాద్ కుమార్ పేరును దుద్దిళ్ల శ్రీధర్ బాబు ప్రతిపాదించిన వెంటనే మరో ఆలోచన లేకుండా కేసీఆర్ సహకరించాలని ఆదేశించారని చెప్పారు. గడ్డం ప్రసాద్ కుమార్‌తో తనకు వ్యక్తిగత అనుబంధం ఉందని, 2009లో సిరిసిల్లకు రావాలని తాను కోరినపుడు మంత్రిగా గడ్డం ప్రసాద్ కుమార్ సంకోచించినా, తాను వెన్నంటి ఉండి అక్కడ కార్మికుల సమస్యలు తెలుసుకోడానికి కృషి చేశారని గుర్తు చేసుకున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో స్పీకర్‌లుగా బాధ్యతలు నిర్వహించిన ఇద్దరి మాదిరి, సభలో ప్రతి ఒక్కరి గౌరవాన్ని స్పీకర్ కాపాడాలని కోరారు. ప్రతి సభ్యుడు గొంతు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. సామాన్య జీవితం నుంచి ఉన్నత స్థానాలకు ఎదిగినందుకు అభినందనలు తెలిపారు. స్పీకర్‌గా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్‌కు సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని అభినందనలు తెలిపారు.