ED Raids on Vivek : వివేక్ సంస్థల్లో రూ.200 కోట్ల అక్రమ లావాదేవీలు, ఈడీ ప్రకటన
ED Raids on Vivek : వివేక్ కు చెందిన సంస్థల్లో రూ.200 కోట్ల అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని ఈడీ ప్రకటించింది. వివేక్ ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశాల్లో కంపెనీ ఏర్పాటు చేశారని తెలిపింది.
ED Raids on Vivek : కాంగ్రెస్ చెన్నూరు అభ్యర్థి, మాజీ ఎంపీ గడ్డం వివేక్ ఇల్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రకటన విడుదల చేశారు. వివేక్ కు చెందిన కంపెనీల్లో రూ.200 కోట్ల అక్రమ లావాదేవీలను జరిగినట్లు గుర్తించామని ఈడీ ప్రకటించింది. యశ్వంత్ రియాలిటీతో పాటు వివేక్ భార్య పేరిట భారీగా కొనుగోళ్లు చేసినట్లు, పెద్దయెత్తున అక్రమాలు జరిగాయని ఈడీ తెలిపింది. వివేక్ సంస్థల్లో రూ.8 కోట్ల బ్యాంకు లావాదేవీలపై పోలీసుల ఫిర్యాదుపై సోదాలు చేశామన్నారు. విశాఖ ఇండస్ట్రీస్, ఎంఎస్ సెక్యూరిటీ మధ్య రూ.100 కోట్ల లావాదేవీలు జరిగాయన్నారు. ఈ డబ్బు ఎంఎస్ విజిలెన్స్ సెక్యూరిటీ రాబడి కాదని తేలిందన్నారు.
ఫెమా నిబంధనలు ఉల్లంఘన
వివేక్ వ్యాపార సంస్థల్లో రూ.20 లక్షల ఆదాయమే గుర్తించామని ఈడీ తెలిపింది. ఆస్తులు, అప్పులు కలిపి రూ.64 కోట్లతో బ్యాలెన్స్ షీట్ ఉంటే లావాదేవీలు మాత్రం రూ.200 కోట్లకు పైగా గుర్తించామన్నారు. ఎంఎస్ సెక్యూరిటీ సంస్థ ఫెమా నిబంధనలు ఉల్లంఘించిందని ఈడీ ప్రకటనలో తేలింది. ఎంఎస్ సెక్యూరిటీ సంస్థకు మాతృ సంస్థ అయిన యశ్వంత్ రియల్టర్స్ లో విదేశీయుల షేర్లు ఎక్కువగా ఉన్నాయని ఈడీ తెలిపింది. వివేక్ ఫెమా నిబంధనలు ఉల్లంఘించి విదేశాల్లో కంపెనీ ఏర్పాటు చేశారని తెలిపింది. ఈ సోదాల్లో భారీగా ఎలక్ట్రానిక్ పరికరాలు, రూ.కోట్ల ఆస్తులు ఉన్నట్టుగా డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నామని ఈడీ ప్రకటించింది. ఈ దర్యాప్తులో భాగంగా ఎంఎస్ సెక్యూరిటీ సర్వీసెస్ నకిలీ సంస్థ అని ఈడీ అధికారులు తెలిపారు.
బీజేపీ, బీఆర్ఎస్ కుట్ర రాజకీయాలకు ఐటీ దాడులే నిదర్శనం
ఎన్నికల్లో ఓటమి భయంతో కేసీఆర్ కుట్ర రాజకీయాలకు తెరలేపుతున్నారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రత్యర్థులను నైతికంగా ఎదుర్కొనే దమ్ము లేక అధికారాన్ని వాడుకుని ఐటీ దాడులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఎన్నికల్లో గెలిచే సత్తా లేక కాంగ్రెస్ నాయకులపై ఐటీ, ఈడీ సోదాలు జరిపిస్తూ కేసీఆర్ కు సాయం చేస్తున్న మోదీ... ఎన్ని డ్రామాలాడినా బీఆర్ఎస్, బీజేపీ ఒకే తానుముక్కలన్న సంగతి తెలంగాణ ప్రజలందరికీ తెలుసన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ గల్లీలో కుస్తీ పడుతూ దిల్లీలో దోస్తీ నడుపుతున్నారని విమర్శించారు. ఈ రెండు పార్టీల తెరచాటు రాజకీయాలకు ప్రజలు త్వరలో బుద్ధి చెబుతారన్నారు. ఈడీ సోదాల పేరుతో కాంగ్రెస్ నాయకులను, ఆ పార్టీ మద్దతుదారులను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు అన్నింటినీ గమనిస్తున్నారన్నారు. దిల్లీ లిక్కర్ స్కాంలో కవితపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అవినీతికి పాల్పడుతున్న బీఆర్ఎస్ నాయకులపై ఐటీ, ఈడీ సోదాలు ఎందుకు చేయడంలేదని ప్రశ్నించారు. కేసీఆర్, మోదీ పాలనకు తెలంగాణ ప్రజలు రిటర్న్ గిఫ్ట్ ఇస్తారని షర్మిల అన్నారు.