Jukkal Politics: జుక్కల్‌లో నాలుగోసారి బిఆర్ఎస్ జెండా ఎగురుతుందా?-will the brs candidate win for the fourth time in the jukkal assembly constituency ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Jukkal Politics: జుక్కల్‌లో నాలుగోసారి బిఆర్ఎస్ జెండా ఎగురుతుందా?

Jukkal Politics: జుక్కల్‌లో నాలుగోసారి బిఆర్ఎస్ జెండా ఎగురుతుందా?

HT Telugu Desk HT Telugu
Nov 24, 2023 01:27 PM IST

Jukkal Politics: మ‌హారాష్ట్ర, క‌ర్ణాట‌క స‌రిహ‌ద్దుల్లో ఎస్సీ రిజ‌ర్వుడు నియోజక వర్గమైన జుక్కల్‌లో అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఎవరిని వరిస్తుందనే ఉత్కంఠ నెలకొంది.

జుక్కల్‌లో గెలుపు ఎవరిది?
జుక్కల్‌లో గెలుపు ఎవరిది?

Jukkal Politics: ఎస్సీ రిజ‌ర్వుడు నియోజక వర్గం జుక్కల్‌లో గ‌డిచిన మూడు ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ అభ్య‌ర్థి హ‌న్మంత్ షిండే విజ‌యం సాధించారు. వ‌రుస‌గా నాల్గోసారి గెలిచేందుకు ప్ర‌స్తుతం ముమ్మ‌రంగా ప్ర‌చారం నిర్వ‌హిస్తున్నారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఈసారి ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త భ‌యం ప‌ట్టుకుంది. మూడుసార్లు వ‌రుస‌గా గెల‌వ‌డంతో ఆయ‌న‌కు ప్ర‌జ‌ల‌కు దూరమ‌య్యాడ‌నే టాక్ వినిపిస్తోంది. త‌మ బాధ‌లు చెప్పుకుందామ‌న్నాఎమ్మెల్యే హ‌న్మంత్ షిండే అందుబాటులో ఉండ‌టం లేద‌న్న‌ది ప్ర‌ధాన ఆరోప‌ణ ప్ర‌జ‌ల నుంచి వినిపిస్తోంది.

దీన్ని ఆస‌రాగా చేసుకుని విప‌క్ష అభ్య‌ర్థులు గెలుపుపై ధీమాగా ఉన్నారు. రెండు ప్ర‌ధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ అభ్య‌ర్థులు ప్ర‌చారం తీవ్ర‌త‌రం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్ నాయకులు సౌదాగర్ గంగారం బ‌రిలో నిలిచేందుకు సిద్ధ‌మ‌య్యారు. కానీ ఈ సారి కాంగ్రెస్ పార్టీ ఆయనను కాకుండా కొత్తగా తోట లక్ష్మీ కాంత్ రావు ను పోటిలో దించింది.

అభ్య‌ర్థి నియోజ‌క‌వ‌ర్గానికి కొత్త‌గా కావ‌డంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఆందోళ‌న నెల‌కొంంది. కానీ ఆ పార్టీ ప్ర‌క‌టించిన ఆరు గ్యారెంటీల‌నే న‌మ్ముకుని పార్టీ శ్రేణులు ప్ర‌చారంలో జోరు పెంచాయి. బీజేపీ నుంచి కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు, జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణ తారా పోటీ చేస్తున్నారు.

2018 ఎన్నిక‌ల స‌మ‌యంలో బీజేపీలో చేరిన అరుణ‌తార‌... నాటి నుంచి జుక్క‌ల్ నియోజ‌క‌వ‌ర్గం కేంద్రీక‌రించి ప‌ని చేశారు. బీజేపీ పార్టీని బ‌లోపేతం చేయ‌డంలో కీల‌క పాత్ర పోషించారు. జుక్క‌ల్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి 20 యేండ్ల క్రితం ఆమె ఎమ్మెల్యేగా ప‌ని చేశారు. నాడు చేసిన అభివృద్ధిని గుర్తించి మ‌ళ్లీ ఈసారి ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌లు ఆశీర్వదీస్తార‌ని ధీమాగా ఉన్నారు.

జుక్క‌ల్ నుంచి మూడుసార్లు గెలుపొందిన హ‌న్మంత్ షిండేకు నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌తియేటా మెజార్టీ 34 వేల నుంచి 35 వేల వ‌ర‌కు వ‌చ్చింది. కానీ ఈసారి ప్ర‌భుత్వ వ్య‌తిరేక భ‌యంతో మెజార్టీ ఎంత వ‌ర‌కు సాధిస్తామ‌న్న‌ది ఆ నాయ‌కుల‌కు టెన్ష‌న్ ప‌ట్ట‌ుకుంది.

ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గంలో ఈ మూడు పార్టీల అభ్య‌ర్థులు పోటాపోటీగా ప్ర‌చారం చేస్తున్నారు. అయితే ప్ర‌జ‌ల నాడి ప‌ట్ట‌డం నియోజ‌క‌వ‌ర్గంలో క‌ష్టంగా మారింది. ఏ మండ‌లానికి అభ్య‌ర్థులు ప్ర‌చారానికి వెళ్లినా.. అన్నీ పార్టీల నేత‌ల‌తో `మీకే మా ఓటు` అంటూ స్వాగ‌తాలు ప‌లుకుతున్నారు. దీంతో అభ్య‌ర్థులు ఎవ‌రికివారే గెలుపుపై ధీమాగా ఉన్నారు.

జుక్క‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో ఈసారి త్రిముఖ పోటీ నెల‌కొంది. మూడు ప్రధాన పార్టీల నుంచి బ‌ల‌మైన అభ్య‌ర్థులున్నారు. ఈ ఎన్నిక‌ల్లో ఎవ‌రు గెలుపొందినా చాలా త‌క్కువ మెజార్టీతో గెలిచే అవ‌కాశ‌ముంది.

(రిపోర్టింగ్ మీసా భాస్కర్)