Karimnagar Congress : డీసీసీ పీఠం వెలిచాలకేనా…! ఎవరికి అవకాశం రాబోతుంది..?-will congress leader velichala rajender rao get the dcc president of karimnagar ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar Congress : డీసీసీ పీఠం వెలిచాలకేనా…! ఎవరికి అవకాశం రాబోతుంది..?

Karimnagar Congress : డీసీసీ పీఠం వెలిచాలకేనా…! ఎవరికి అవకాశం రాబోతుంది..?

HT Telugu Desk HT Telugu
Sep 14, 2024 07:33 AM IST

కరీంనగర్ డీసీసీ పీఠంపై కీలక నేతలు కన్నేశారు. ఎలాగైనా దక్కిచుకునేందుకు గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. డీసీసీ రేసులో పలువురు నేతలు ఉన్నప్పటికీ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్ణయమే కీలకం కానున్నది. డీసీసీ పగ్గాలు లేదా పట్టభద్రుల ఎమ్మెల్సీ టిక్కెట్ దక్కడం ఖాయమని వెలిచాల రాజేందర్ రావు ధీమాతో ఉన్నారు.

డిసిసి పీఠం వెలిచాలకేనా?..
డిసిసి పీఠం వెలిచాలకేనా?..

కరీంనగర్ లో కాంగ్రెస్ రాజకీయాలు ఆసక్తిని కలిగిస్తున్నాయి.‌ పార్టీ పదవులతో పాటు ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. ఫిబ్రవరి లో జరిగే కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీకి అరడజను మంది ఆసక్తి చూపుతున్నారు. 

తాజాగా కాంగ్రెస్ అధిష్టానం వేయనున్న జిల్లా కాంగ్రెస్ కమిటీ అద్యక్ష పదవి లేదా పిసిసి లో కీలక పదవులు దక్కించుకునేందుకు నేతలు ఆరాటపడుతున్నారు. పార్టీ పదవులు, ఎమ్మెల్సీ టిక్కెట్ విషయంలో అధిష్టానం మాత్రం ఆచితూచి అడుగులు వేస్తోంది.

ఉత్తర తెలంగాణలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి ప్రముఖులు ఆసక్తి చూపుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీగా కాంగ్రెస్ కు చెందిన జీవన్ రెడ్డి ఉండడం, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ టికెట్ ను అరడజన్ కు పైగా నాయకులు ఆశిస్తున్నారు. 

ప్రముఖంగా ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన వెలిచాల రాజేందర్ రావు, ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత నరేందర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. రాజేందర్ రావు పట్టభద్రుల కోసం ప్రత్యేకంగా మ్యానిఫెస్టో తయారుచేసి ప్రభుత్వ దృష్టికి పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళే పనిలో నిమగ్నమయ్యారు. 

అక్టోబర్ ఫస్ట్ నుంచి ఓటర్ల నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతున్న నేపథ్యంలో త్వరగా అభ్యర్థి ప్రకటించాలని కోరుతున్నారు.‌ టికెట్ రేసులో ఉన్నా...పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానంటున్నారు రాజేందర్ రావు. ఎమ్మెల్సీ టిక్కెట్ లేదా డిసిసి అధ్యక్ష పదవి ఏదో ఒకటి వస్తుందని రాజేందర్ రావు భావిస్తున్నారు.

మంత్రి పొన్నం నిర్ణయమే కీలకం!

కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవిపై గట్టి పోటీ నెలకొంది. సుదీర్ఘకాలం తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో పలువురు అద్యక్ష పదవి దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. డీసీసీ రేసులో పలువురు నేతలు ఉన్నప్పటికీ మంత్రి పొన్నం ప్రభాకర్ నిర్ణయమే కీలకం కానున్నది. 

ప్రస్తుతం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కొనసాగుతున్నారు. ఆయన మానకొండూర్ ఎమ్మెల్యే గా గెలుపొందడంతోపాటు ఇటీవల టిపిసిసి అధ్యక్షులుగా మహేష్ కుమార్ గౌడ్ ను నియమితులు కావడంతో కొత్త కమిటీలను, జిల్లా అధ్యక్షులను నియమించే పనిలో పార్టీ పెద్దలు ఉన్నారు. దీంతో డిసిసి అద్యక్ష పదవిపై ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమిపాలైన వెలిచాల రాజేందర్ రావు, సీనియర్ నేతలు ఆకారపు భాస్కర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరపల్లి మోహన్, కోడూరి సత్యనారాయణ గౌడ్, బొమ్మ శ్రీరాం చక్రవర్తి దృష్టి పెట్టి ఎవరికి వారే ఆ పదవి దక్కించుకునే పనిలో నిమగ్నమయ్యారు. తనకు సన్నిహితులుగా ఉన్నవారే డీసీసీ పీఠం కోసం పోటీపడుతున్న నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎవరికి మద్దతునిస్తారోనని పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

ధీమాలో రాజేందర్ రావు…

డీసీసీ పగ్గాలు లేదా పట్టభద్రుల ఎమ్మెల్సీ టిక్కెట్ దక్కడం ఖాయమని వెలిచాల రాజేందర్ రావు గట్టి ధీమాతో ఉన్నారు. కరీంనగర్ లోక్ సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో విస్తృతస్థాయి సంబంధాలు కలిగి ఉన్న రాజేందర్ రావు తనకు డీసీసీ బాధ్యతలు అప్పగిస్తే ప్రణాళికబద్ధంగాఖ స్థానిక సంస్థల, మున్సిపల్, పంచాయతీరాజ్ ఎన్నికలకు పార్టీ క్యాడర్ ను సన్నద్ధం చేసే బాధ్యత తీసుకోగలుగుతానని ఇప్పటికే ముఖ్య నేతల వద్ద ప్రస్తావించారని తెలుస్తోంది. 

పార్టీ అధికారంలో ఉన్నందున ప్రతీ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకోవల్సిన అవసరం ఉందని.. నాయకులు,ఋ కార్యకర్తల మధ్య సమన్వయం పెంచేందుకు తనకు అవకాశం ఇవ్వాలంటూ ఇప్పటికే మంత్రి పొన్నం ప్రభాకర్ తో పాటు సీఎం సన్నిహితుల వద్ద వెలిచాల రాజేందర్ రావు ప్రస్తావించి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం సాగుతోంది. 

కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా గతంలో పని చేసిన రాజేందర్ రావు చొప్పదండి అసెంబ్లీ స్థానం నుంచి ఒకసారి.. కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి ప్రజారాజ్యం పార్టీ పక్షాన ఒకసారి, ఇటీవల కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేశారు. రాజేందర్ రావు త్వరలో జరగనున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ టికెట్ ఆశిస్తున్నారు. ఒకవేళ ఎమ్మెల్సీ టికెట్ లభించని యెడల పార్టీలో కీలక పదవి దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. డీసీసీ బాధ్యతలు అప్పగిస్తే పార్టీని బలోపేతం చేసేందుకు తనవంతు కృషి చేస్తానని చెబుతుండగా... పలువురు ముఖ్య నేతలు కూడా ఆయన పట్ల సానుకూలంగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది.

ఎదురు చూస్తున్న నేతలు…!

డీసీసీ అధ్యక్ష పదవిపై కాంగ్రెస్ పార్టీ నేత ఆకారపు భాస్కర్ రెడ్డి ఆశలు పెట్టుకున్నారు. యువజన కాంగ్రెస్ నుంచి దశాబ్దాలుగా పార్టీకి సేవలందిస్తూ వచ్చిన ఆకారపు భాస్కర్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరి లోక్ సభ ఎన్నికల వేళ మంత్రి పొన్నం ప్రభాకర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. 

ఉత్తర తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా, కరీంనగర్ సిటీ కాంగ్రెస్ అధ్యక్షునిగా, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా, కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా, మున్సిపల్ కౌన్సిలర్ గా సుదీర్ఘ కాలం గా కాంగ్రెస్ రాజకీయాల్లో కీలకంగా పని చేస్తూ వచ్చారు. కుటుంబ సంబంధాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని వీడినా తిరిగి పార్టీలో చేరిన ఆకారపు భాస్కర్ రెడ్డి తనకు అవకాశం ఇస్తే మరింత క్రియాశీలకంగా పని చేస్తానంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకువచ్చారని తెలుస్తోంది. గతంలో పొన్నం ప్రభాకర్ ఎన్.ఎస్.యు.ఐ అధ్యక్షునిగా ఆకారపు భాస్కర్ రెడ్డి యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా టీడీపీ అధికారంలో ఉన్న కాలంలో అనేక ఉద్యమాలను కలిసి చేపట్టారు. వీరిద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో తన అవకాశాలను పరిశీలించాలని భాస్కర్ రెడ్డి కోరుకుంటున్నారు.

మాజీ ఎమ్మెల్యే బొమ్మ వెంకటేశ్వర్ తనయుడు బొమ్మ శ్రీరాం చక్రవర్తి తోపాటు మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, కోడూరి సత్యనారాయణ గౌడ్ సైతం జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి ఆశిస్తున్నారు. తెరచాటుగా పార్టీ ముఖ్యనేతలతో మంతనాలు జరుపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో జిల్లా అద్యక్ష పదవిపై పలువురు నేతలు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. 

ప్రస్తుతం డీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న వారంతా ఒకప్పుడు కాంగ్రెస్ లో ఉన్న కాలానుగుణంగా ఇతర పార్టీలోకి వెళ్లి వచ్చినవారే. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ అధిష్టానం ఆచితూచి అడుగులు వేస్తూ పార్టీకి పెద్దదిక్కుగా ఉండే వ్యక్తిని అధ్యక్ష పదవిలో కూర్చోబెట్టాలని భావిస్తుంది. దీంతో అందరూ చూపు వెలిచాల రాజేందర్ రావు వైపే ఉందనే అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. అనివార్య పరిస్థితిలో రాజేందర్ రావుకు డిసిసి పదవి దక్కకుంటే టిపీసీసీలో కీలక పదవి లభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.