Karimnagar : ఆ ముగ్గురు నేతలు కలిశారు..! కరీంనగర్ పాలిటిక్స్ లో ఆసక్తికర సన్నివేశం-an interesting scene at the vinayaka chavita celebrations in karimnagar city ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Karimnagar : ఆ ముగ్గురు నేతలు కలిశారు..! కరీంనగర్ పాలిటిక్స్ లో ఆసక్తికర సన్నివేశం

Karimnagar : ఆ ముగ్గురు నేతలు కలిశారు..! కరీంనగర్ పాలిటిక్స్ లో ఆసక్తికర సన్నివేశం

HT Telugu Desk HT Telugu
Sep 08, 2024 07:34 AM IST

కరీంనగర్ నగర రాజకీయాల్లో ఇంట్రెస్టింగ్ సీన్ కనిపించింది. శనివారం గణపతి మండపంలో నిర్వహించిన ప్రత్యేక పూజ కార్యక్రమంలో కేంద్రమంత్రి బండి సంజయ్, మంత్రి పొన్నం, ఎమ్మెల్యే గంగుల కలిశారు. ఈ సందర్భంగా ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు.

కరీంనగర్ లో ఆ ముగ్గురు నేతలు కలిసిన వేళ...!
కరీంనగర్ లో ఆ ముగ్గురు నేతలు కలిసిన వేళ...!

కరీంనగర్ లో గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో అరుదైన సంఘటన చోటు చేసుకుంది.‌ రాజకీయ ప్రత్యర్ధులను గణనాథుడు కలిపారు. నగరంలోని టవర్ సర్కిల్, ప్రకాశ్ గంజ్, శాస్త్రీ రోడ్ లో జరిగిన వేడుకల్లో కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్రమంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావు పాల్గొన్నారు.‌ రాజకీయాలను పక్కన పెట్టి అప్యాయంగా పలుకరించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శాస్త్రీరోడ్ లో వైశ్య కమ్యూనిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుడిని బండి సంజయ్ దర్శించుకునే సమయంలోనే అక్కడికి రాష్ట్రమంత్రి పొన్నం ప్రభాకర్ వచ్చి మర్యాదపూర్వకంగా ఇద్దరూ ఒకరికొకరు కరచాలనం చేసుకున్నారు. అనంతరం వరసిద్ది వినాయక మందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుండగా మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, నగర మేయర్ సునీల్ రావు అక్కడికి రావడంతో ఒకరినొకరు అభివాదం చేసుకున్నారు.

మరోవైపు గణేశ్ మండపాల వద్ద పొన్నం ప్రభాకర్, గంగుల కమలాకర్ లు బండి సంజయ్ కు ఎదురుపడటం, ఒకరికొకరు పలకరించుకోవడం చూసిన వారంతా అశ్చర్యపోయారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు అనడానికి ఇదే నిదర్శనం అని చర్చించుకున్నారు.

ఆ తర్వాత కేంద్రమంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. జమ్మూకాశ్మీర్ లో ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర హోదాను ఇవ్వాలని నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కానీ కాంగ్రెస్ ఉద్రవాదాన్ని ప్రోత్సహించేలా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఉగ్రవాదులతో లింకులున్న పార్టీలతో జత కట్టి మళ్లీ 370 ఆర్టికల్ ను తీసుకొచ్చి ఉగ్రవాద హోదాను పునరుద్దరించాలని కాంగ్రెస్ కూటమి భావిస్తోందని విమర్శించారు. దేశ ప్రజలు ఆలోచించాలని.... జమ్మూకాశ్మీర్ ప్రజలకు అప్పీల్ చేయాలని కోరారు.

జమ్మూకాశ్మీర్ ను అన్ని విధాలా అభివృద్ధి చేసి రాష్ట్ర హోదా ఇవ్వాలన్నదే బీజేపీ లక్ష్యమని తెలిపారు. అందులో భాగంగా ఉగ్రవాద కార్యకలాపాలను కూకటి వేళ్లతో పెకిలించి ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పుతున్నామని తెలిపారు. దేశ పౌరులంతా జమ్మూకాశ్మీర్ భారత్ లో అంతర్భాగమని కోరుకోవడంతోపాటు ప్రతి ఒక్కరూ అక్కడికి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అందుకే ‘‘ఏక్ దేశ్ మే దో ప్రధాన్, దో విధాన్, దో నిషాన్ నహీ చలేగా అంటూ 370 ఆర్టికల్ రద్దు చేసినామని స్పష్టం చేశారు.

వారిని ఆదుకుందాం-- బండి సంజయ్

గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కరీంనగర్ టవర్ సర్కిల్ వద్ద గణేశ్ మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఉత్సవాలు ముగిసే వరకు దీక్ష తీసుకుని భక్తియుత వాతావరణంలో నవరాత్రి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించుకోవాలని కోరారు.

రాష్ట్రంలో భారీ వర్షాలు కురిశాయని, మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశముందని బండి సంజయ్ తెలిపారు. ప్రజలకు, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వర్షాలు కురవాలని వానదేవుడిని కోరుకుంటున్నానని చెప్పారు. వర్షాలతో నష్టపోయిన ప్రజలను అన్ని విధాలా ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావాలని అందుకు కేంద్రం కూడా తనవంతు సాయం చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు. రాజకీయ విమర్శలను పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా ఉంటూ బాధితులను ఆదుకోవాలని కోరారు.

రిపోర్టింగ్ : కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.