TGSRTC Jobs: మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన.. ఆర్టీసీలో ఉద్యోగాలకు రెడీ అవ్వండి!-minister ponnam prabhakar revealed that 3 thousand jobs will be filled in tgs rtc ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tgsrtc Jobs: మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన.. ఆర్టీసీలో ఉద్యోగాలకు రెడీ అవ్వండి!

TGSRTC Jobs: మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన.. ఆర్టీసీలో ఉద్యోగాలకు రెడీ అవ్వండి!

Basani Shiva Kumar HT Telugu
Aug 24, 2024 06:27 PM IST

TGSRTC Jobs: మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ త్వరలోనే ప్రారంభం అవుతుందని వెల్లడించారు. ప్రగతి చక్రం అవార్డులు పొందుతున్న ఉద్యోగులకు శుభాకాంక్షలు చెప్పారు. మరిన్ని కొత్త బస్సులు కొనుగోలు చేయనున్నట్టు వెల్లడించారు.

తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు
తెలంగాణ ఆర్టీసీలో ఉద్యోగ నియామకాలు

రాబోయే ఐదేళ్లను దృష్టిలో పెట్టుకొని మరిన్ని కొత్త బస్సులు కొనుగోలు చేయడానికి.. రెండోసారి ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని.. మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. త్వరలోనే 3035 ఉద్యోగ నియామకాలు చేపట్టబోతున్నట్టు వివరించారు. తెలంగాణ ఆర్టీసిలో ప్రగతి చక్రం అవార్డులు పొందుతున్న ఉద్యోగులకు శుభాకాంక్షలు చెప్పిన పొన్నం.. గత పదేళ్లలో ఒక్క బస్సు కొనలేదని.. ఉద్యోగాల భర్తీ చేయలేదని వ్యాఖ్యానించారు.

ఆర్టీసీకి అదృష్ట లక్ష్మి..

'డిసెంబర్ 9న మహాలక్ష్మీ పథకం ద్వారా ఆర్టీసీకి అదృష్ట లక్ష్మి వచ్చింది. 259వ రోజు 81 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. రూ.2,750 కోట్ల విలువ గల ప్రయాణాన్ని తెలంగాణ మహిళలకు అందించాం. ఒక మంత్రిగా ఈ విషయంలో సంతృప్తి ఉంది. అంతర్గత పాదర్శకతను మరింత అభివృద్ధి చేసుకోవాలి. బాగా పనిచేసిన వారికి అవార్డులు ఇస్తూ సన్మానిస్తున్నాం. నేను కూడా అవార్డు పొందాలని మిలిగిలిన వారిలోనూ పోటీతత్వం పెరగాలి' అని పొన్నం ప్రభాకర్ సూచించారు.

ఆర్టీసీ అభివృద్ధికి అండగా..

'ఆర్టీసిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఎప్పటికప్పుడు నాతో సంప్రదిస్తూ సమీక్షిస్తున్నారు. ఆర్టీసీ అభివృద్ధికి సహకరిస్తున్నారు. ఆర్టీసీ మన అందరి సంస్థ..ప్రజల సంస్థ. ప్రజాస్వామ్యంలో మంచి, చెడు రెండు స్వీకరించాల్సి ఉంటుంది. పని ఒత్తిడి పెరిగి ఉండవచ్చు. ప్రయాణికులు వస్తున్నారు కాబట్టే మన పని ఒత్తిడి పెరిగింది. ప్రయాణికులపై జవాబుదారతనం లేకుండా వ్యవహరించవద్దు. అందరితో మంచిగా మెలగాలి' అని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు.

రాజకీయ జోక్యం ఉండదు..

'ఆర్టీసీలో రాజకీయ జోక్యం ఉండదు. మీకు ఏ సమస్య ఉన్నా మా దృష్టికి తీసుకురండి. ఆర్టీసీ పట్ల సానుకూలంగా ఉండేలా చేస్తాం. మీ పీఎఫ్, మీ బాండ్స్, మీ సీసీఎస్, అరియర్స్ ఏమున్నాయో.. అన్ని త్వరగా పూర్తి చేస్తాం. ఆర్టీసీ కష్టాల నుంచి బయటకు వస్తుంటే.. చిన్న చిన్న సమస్యలు ఉంటాయి. యాజమాన్యం నుంచి ఏమాత్రం నిర్లక్ష్యం లేదు. ఆరోగ్య రీత్యా అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఆర్టీసీలో ఉద్యోగి ఎవరైనా ప్రమాదవశాత్తు చనిపోతే కోటి రూపాయల ప్రమాద బీమా ఇచ్చేలా ఎంవోయూ కుదిరింది. కారుణ్య నియామకాలు అన్నీ విధాలుగా బాగుండాలి. అందరూ అవార్డు పొందేలా మరింత ముందుకు సాగాలి' అని పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.

Whats_app_banner