6 రూపాల్లో దర్శనమిచ్చే గణనాథుడు.. స్వామి వారి రూప విశిష్టత ఇదే-lord ganesha appears in 6 forms pray him for removal of obstacles ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Lord Ganesha Appears In 6 Forms Pray Him For Removal Of Obstacles

6 రూపాల్లో దర్శనమిచ్చే గణనాథుడు.. స్వామి వారి రూప విశిష్టత ఇదే

HT Telugu Desk HT Telugu
Jun 07, 2023 10:53 AM IST

ఓం గం గణపతియే నమ: గణనాథుడు సమస్త గణాలకు అధిపతి. అందుకే ఆయనను గణనాథుడని, విఘ్ననాయకుడని అంటారు. స్వామి వారి రూపాలు, వాటి విశిష్టత ఇక్కడ తెలుసుకోండి.

గణనాథుడు
గణనాథుడు (Pixabay)

ఓం గం గణపతియే నమ: గణనాథుడు సమస్త గణాలకు అధిపతి. అందుకే ఆయనను గణనాథుడని, విఘ్ననాయకుడని అంటారు. గణపతి అథర్వ శీర్ష్యంలో మాటకు గణనాథుడే దైవం అని వేదం చెబుతుంది. గణపతి ఓంకార స్వరూపుడని వేద ఋషులు కీర్తించారు. సర్వజగత్తుకు వినాయకుడే అగ్రపూజ్యుడు. గణపతి విఘ్నాలను తొలగించే అధిదేవత. విఘ్నాలకు అధిపతిగా, విఘ్న నాశకుడిగా ప్రసిద్ధుడు. సర్వ సిద్ధులను అనుగ్రహించే సిద్ధిదాత. అందుకే.. పార్వతీ నందనుడి తలచుకుని శుభకార్యాలు ప్రారంభిస్తే.. అది ఎలాంటి విఘ్నాలూ లేకుండా విజయం లభిస్తుంది. కోరిన కోర్కెలు నెరవేరుతాయి.

ట్రెండింగ్ వార్తలు

గణపతి పూజించే వారిని గాణపత్య సంప్రదాయకులని అంటాం. ఈ సంప్రదాయం పాటించేవారు.. గణపతినే పరబ్రహ్మ స్వరూపంగా భావించి పూజిస్తారు. గణపతి ఆరు రూపాల్లో భక్తులకు దర్శనమిస్తాడు. మహా గణపతి, పసుపు గణపతి, ఉచ్చిష్ట గణపతి, హేరంబ గణపతి, స్వర్ణ గణపతి, సంతాన గణపతి.

గణేశుడు ఆనంద స్వరూపుడైన పరమాత్మే. బ్రహ్మాది దేవతలందరూ గణపతికి ప్రతిరూపాలే. శ్రీ గణేశుడు వేదంలో చెప్పిన మహామహిమాన్వితుడు. అతడే పరబ్రహ్మ. ప్రణవ స్వరూపుడు. మహర్షులు చెప్పిన ఆది అక్షరం ఓంకారానికి వేదాల్లోనూ గొప్ప స్థానముంది. అర్థ చంద్రుడిని తల ధరించిన గణనాథుడి పాద పద్మాలకు దేవగణాలు సదా నమస్కరిస్తుంటాయి. అలాంటి గజాననుడికి నమస్కరిస్తానని భక్తులు స్వామికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు.

మహా గణపతి రూపం

శ్రీమహాగణపతి ముఖం అత్యంత శ్రేష్ఠమైన గజ ముఖం. స్వామి తలపై అర్థచంద్రుడు విరాజిల్లుతుంటాడు. గణపతి దేహకాంతి అరుణవర్ణంతో శోభిల్లుతుంటుంది. స్వామికి మూడు కన్నులుంటాయి. తన ఒడిలో కూర్చున్న భార్యను పద్మాలవంటి చేతులతో సదా ఆలింగనం చేసుకుని ఉంటాడు. మహాగణపతి తన పది చేతుల్లో.. దాడిమ, గద, ధనుస్సు, త్రిశూలం, చక్రం, పద్మం, పాశం, కమలం, ధాన్యగుచ్ఛం, స్వదంతం, రత్నకలశం పట్టుకుని దర్శనమిస్తాడు.

మహాగణపతి గణ్డయుగళం నుంచి వచ్చే తీపి ధారలను తాగాలని వచ్చే భ్రమర సమూహం నిరంతరం అక్కడే తిరుగుతుంటాయి. వాటిని ఆయన తన చెవులతో తరుముతుంటాడు. స్వామి తన అర చేతిలో ఉన్న మాణిక్య కుంభం నుంచి వెదజల్లే రత్నాలతో సాధకుల్ని వరాలను అనుగ్రహిస్తుంటాడు. స్వామి తలపై మాణిక్యాలతో కూడిన కిరీటం విరాజిల్లుతుంటుంది. గణపతి సర్వాంగాలూ రత్నాభరాణాలతో భాసిల్లుతుంటాయి.

ఐదు తలలతో హేరంబ గణపతి

హేరంబ గణపతి ఐదు ఏనుగు తలలతో దర్శనమిస్తాడు. అందులో నాలుగు, నలు దిశల వైపు, ఒకటి ఊర్ధ్వ ముఖంగానూ ఉంటుంది. స్వామి ఊర్ధ్వ హస్తిముఖ ముక్తావర్ణకుడు. మిగతా నాలుగు ముఖాలు.. కాంచన, నీల, శ్వేత , కుంకుమ వర్ణాల్లో ఉంటాయి. ప్రతి గజ ముఖమూ త్రినేత్రములు ఉంటుంది. హేరంబ గణపతి సింహ వాహనుడు. స్వామి తలపై చంద్రుడు విరాజిల్లుతుంటాడు. హేరంబ గణపతి దేహకాంతి సూర్యకాంతికి మించి భాసిల్లుతున్నది. స్వామి మహా బలవంతుడు, అభయముద్రలో దర్శనమిస్తాడు. తన పది చేతులలో మోదకం, దంతం, టంకం, శిరం, అక్షమాల, ముద్గరం, అంకుశం, త్రిశూలం ధరించి భక్తులకు దర్శనమిస్తాడు హేరంబ గణపతి.

పసుపు గణపతి

తంత్రసారంలోని ద్వితీయ పరిచ్ఛేదంలో హరిద్రా గణపతిని ఎన్నో విధాలా కీర్తించింది. హరిద్రాగణపతి శరీరం పసుపు రంగులో ఉంటుంది. స్వామి చతుర్భుజుడు. పసుపురంగు వస్త్రం ధరించి దర్శనమిస్తాడు. హరిద్రా గణపతి నాలుగు చేతుల్లో పాశం, అంకుశం, మోదకం, దంతం విరాజిల్లుతూ ఉంటాయి. ఇక ఉచ్ఛిష్ట గణపతి. ఈ గణపతి స్వరూపాన్ని అత్యంత మార్మిక రహస్యంగా మహర్షులు భావించారు.

ఉచ్ఛిష్ట గణపతి

తంత్రసారంలోని ద్వితీయ పరిచ్ఛేదంలో గాణపత్య సంప్రదాయంలోని ఉచ్ఛిష్ట గణపతి ధ్యానం, మంత్రం, పూజ, ప్రయోగ విధులు కనిపిస్తాయి. ఉచ్ఛిష్ట గణపతి చతుర్భుజుడు, రక్తవర్ణంలో కనిపిస్తాడు. రక్తవర్ణంలో ఉండే ఉచ్ఛిష్ట గణపతి మూర్తి సర్వాలంకార సుశోభితం. స్వామి ధరించిన వస్త్రం రక్తవర్ణంలో ఉంటుంది. ఉచ్ఛిష్ట గణపతి పద్మాసనలో కూర్చుని భక్తులకు దర్శనమిస్తాడు. ఈ స్వామికి నాలుగు చేతులుంటాయి. విశాలమైన శరీరంతో రెండు దంతాలుతో స్వామి ముఖం నవ్వుతూ భక్తులను అనుగ్రహిస్తున్నట్టుగా ఉంటుంది. స్వామి వారి కుడివైపు పై చేతిలో వరముద్ర, కింది చేతిలో ఒక దంతం దర్శనమిస్తుంది. ఎడమవైపు పై చేతిలో పాశం, కింది చేతిలో అంకుశం దర్శనమిస్తుంది. ఆయన శిరస్సుపై జటామండలం ఉంటుంది. లలాటంపై అర్థచంద్రుడు సుశోభితుడై కానవస్తాడు. ఆ విధంగా మహాయుధాలతో స్వామి సర్వాలంకార శోభితుడై విరాజిల్లుతుంటాడు.

ఉచ్ఛిష్ట ముఖంతో, అశుచిగా ఉన్న స్థితిలో, ఈ గణపతికి పూజాదికాలు నిర్వహిస్తారు. ఏ తంత్ర పద్ధతుల్లోనూ పూజలు చేయరు. కేవలం మానసిక జపంతోనే ఆరాధిస్తారు. ఉచ్ఛిష్ట గణపతిని పూజించే భక్తులు... ఎవ్వరూ లేని చోట కూర్చుని రత్నచందనతో కలిసిన తాంబూలం నములుతూ స్వామి పూజ చేస్తారు. మరో పద్ధతిలో మోదకం నములుతూ మంత్ర జపం చేస్తారు. భృగు మహర్షి చెప్పిన ప్రకారం.. పండ్లు తింటూ ఉచ్ఛిష్ట గణపతి ఆరాధన చేస్తారు.

ఉచ్ఛిష్ట గణపతి పూజా మహాత్యం అత్యంత మహత్వ పూర్ణమైంది. రాజద్వారంలో, అరణ్యంలో, సభా, గోత్ర-సమాజంలో, వివాదంలో, వ్యవహారంలో, యుద్ధంలో, శత్రుసంకటంలో, నౌకాయానంలో, అడవిలో, దౌత్య కార్యాల్లో ఆపత్సమయాల్లో గ్రామదహన సమయంలో, దొంగల భయంలో, సింహం, పులి లాంటి క్రూర జంతువుల భయం ఉన్నప్పుడు ఉచ్ఛిష్ట గణపతి మంత్రం జపించడంతో.. అన్ని విఘ్నాలూ తొలగిపోతాయి. ఈ మంత్రంతో పదివేల హోమాలు చేస్తే.. రాజు వశుడౌతాడు. ఈ మంత్రం కోటి జపం చేసే సాధకుడికి అణిమాది అష్ట సిద్ధులు ప్రాప్తిస్తాయని భక్తుల విశ్వాసం.

గణపతిని లింగరూపంలోనూ, సాలిగ్రామ, యంత్ర, కలశ, లేదా విగ్రహ రూపంలోను పూజించే విధానముంది. గణపతి సాలగ్రామాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. తంజావూరు జిల్లాలోని తిరునల్లూరులో గణపతి సాలగ్రామానికి పూజ జరుగుతోంది. దక్షిణ కన్నడ జిల్లాలోని ఉప్పూరులో గణేశ లింగం ఒకటి ఉంది. ఈ లింగంపై గణేశ యంత్రం చెక్కి ఉంది. నిత్యదేవతార్చనలోనూ, పంచాయత తనంలో పూజించే గణపతి ప్రతీకకు శోణభద్ర గణపతి అని పేరు. ఎరుపు వన్నె కలిగి ఎనిమిది కోణాల అంగుష్ఠ ప్రమాణం గల ఈ శిలాప్రతీక శోణభద్రా నదిలో లభిస్తుందని ప్రతీతి.

పంచాయతనం అంటే అయిదు దేవతల్ని ఏకంగా పూజించుట అని అర్థం. ఆదిశంకరులు వివిధ దేవతా పథములను అనుసరించే వారి మధ్యగల వైషమ్యాలను తుదముట్టించి, అన్ని పథముల వారు అనుసరించదగ్గ ఈ పూజా పద్ధతిని అమలు పరచినారు. విష్ణు, శివ, శక్తి, గణపతి, ఆదిత్యుడు, వీరే ఈ అయిదు దేవతలు. పంచాయతన పూజలో విష్ణువు ప్రధాన దేవత అయినప్పుడు మధ్యలో విష్ణు సాలిగ్రామాన్ని ఈశాన్యంలో శివుడు, ఆగ్నేయంలో ఆదిత్యుడు, వాయవ్యంలో అంబిక, నైరుతి భాగంలో గణపతి సంకేతాన్ని ఉంచి పూజిస్తారు. ఈ రీతిగా ప్రధానదేవత ఏదియో ఆ దేవత సంకేత కేంద్రానికి వచ్చినప్పుడు కేంద్రంలో వున్నదేవతా సంకేతం, ఆ దేవత స్థానాన్ని చేరుకుంటుందని విశ్వాసం.

బుద్ధిబలం గొప్పదని చాటిన గణనాథుడు

గజాననుడిని ప్రణవనాద స్వరూపుడిగా, శబ్ద బ్రహ్మ ఆకృతిగా ముద్గల పురాణం, లోకరక్షకుడిగా గణేశ పురాణం, సమస్తలోకానికి ఆధారశక్తిగా గణేశ గీత చెబుతున్నాయి. దేవతల నుంచి మానవుల వరకు ఎదుర్కొనే విఘ్నాలను, ప్రతికూల శక్తులను నిలువరించి, వారు చేపట్టే కార్యాలు విజయ తీరాలకు చేరేందుకు ఆయన కృప ఉపకరిస్తుందని వేదవాక్కు. అందుకు ఎన్నో పురాణగాథలు ఉదాహరణలు.

శారీరక బలం కన్నా బుద్ధిబలం గొప్పదని చాటిన వ్యక్త్వివికాస నిపుణుడు వినాయకుడు. తన లోని బలం, బలహీనతను ఎరిగి ప్రవర్తించాలన్నది ఆయన చర్య చాటి చెబుతోంది. గణాధిపత్యం కోసం అన్నదమ్ములు వినాయకుడు, కుమారస్వామి పోటీపడి నప్పుడు ‘ముల్లోకాల్లోని పుణ్య నదులలో స్నానం చేసి ముందుగా వచ్చిన వారికి ఆ పదవి దక్కుతుంది’ అని తండ్రి మహాశివుడు నిబంధన విధించాడు. దానికి మరుగుజ్జు, స్థూలకాయుడైన గణేశుడు మొదట కలత చెందాడు. శక్తిమంతుడు, లఘు దేహంతో వేగంగా ప్రయాణించగల తమ్ముడిని అధిగమించ లేనని భావించాడు. అంతలోనే ఆత్మస్థైర్యంతో తనకు తాను నచ్చచెప్పుకున్నాడు. బుద్ధిబలాన్ని ప్రయోగించాడు. కన్నవారే కనిపించే దైవాలనీ, ప్రకృతి పురుషులైన తల్లిదండ్రులకు ప్రదక్షిణతో సర్వ పుణ్యనదీ స్నాన సమానమని గ్రహించి ఆచరించాడు. తమ్ముడు షణ్ముఖుడు వెళ్లిన ప్రతి నదిలో అప్పటికే అన్న స్నానమాడుతూ కనిపించాడు. సూక్ష్మబుద్ధి, వినయంతో విజయాలు సొంతం చేసుకున్నాడు.

గణాధిపతిగా నియమితుడై సర్వసమర్థుడిగా మన్ననలు అందుకున్నారు. అలా… గెలిచి తీరాలన్న సంకల్పం ఉంటే సాధించలేనిది లేదని, స్వీయ లోపాలను అధిగమించడం పెద్ద సమస్య కాబోదని వినాయకుడు లోకానికి చాటి చెప్పాడు. విఘ్నాలు తొలగేందుకు ఆయనను అర్చించడంతో పాటు ఆయన లోకానికి అందించిన వ్యక్తిత్వ వికాస కోణం లోని సందేశాన్ని అవగాహన చేసుకోవలసి ఉంది.

స్వర్ణ గణపతి పూజ

స్వర్ణగణపతి పూజ చాలా పురాతనమైన పూజావిధి. ఆరు రకాలైన విశిష్ట గణపతి రూపాల్లో స్వర్ణ గణపతిరూపం ఎంతో మహిమాన్వితమైంది. స్వర్ణం అంటే బంగారం. బంగారం రూపంలోని గణపతిని ఆరాధించడం వల్ల సంపద కలుగుతుంది. బంగారంతో గానీ, బంగారు వర్ణంలో గానీ గణపతి విగ్రహాన్ని ప్రతిష్టించుకుని భక్తులు పూజించుకుంటారు. ఈ బంగారు గణపతిని పూజించడం వల్ల అదృష్టం కలిసివస్తుందని భక్తుల నమ్మకం. ఉత్తరాదిలో వినాయక చవితిని తొమ్మిది రోజుల పాటు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా రోజుకో గణపతి రూపాన్ని భక్తులు పూజిస్తారు. ఆ దివ్య సంవిధానంలో 8వ రోజున స్వర్ణ గణపతిని భక్తులు ఆరాధిస్తారు. అన్ని విధాలైన కోర్కెలు తీరుతాయి. ప్రధానంగా వృత్తి, విద్యా, రంగాల్లో అభివృద్ధి కలుగుతుంది.

సంతాన గణపతి ఆరాధన

సంతానం కోసం ఫాల్గుణ మాసంలో వచ్చే చవితి రోజు పుత్ర గణపతి వ్రతం చేయాలి. వ్రతం చేసే సమయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండాలి. ఒకవేళ ఆరోగ్యం సహకరించకుండా ఉండేవారు కటిక ఉపవాసం చేయాల్సిన అవసరం లేదు. అలాంటి వారు పచ్చి నువ్వులు, బెల్లం కొద్దిగా తిని ఉపవాసం ఉండవచ్చు. గణపతికి ఉపవాసం ఉండి సాయంత్రం అష్టదళాలైన ముగ్గు వేసి అక్కడ గులాబీ రంగు పట్ట పరిచి దానిపై కలశాన్ని ఏర్పాటు చేసి గణపతి ప్రతిమను పెట్టిన తరువాత బాలసూర్యం దేవం.. మహాగణాధిపతిం అనే మంత్రంతో పుత్ర గణపతిని పూజిస్తే సంతానం లేని వారి సమస్యలు తీరిపోతాయని జ్యోతిష్యులు చెబుతున్నారు.

సంతానం కలగడం కోసం భక్తులు సంతాన గణపతి హోమాన్ని ఆచరిస్తారు. వివాహం ఆలస్యం అయినా, వివాహం తర్వాత దంపతుల మధ్య కలతలు ఉన్నా తొలగిపోతాయి. ఈ వ్రతాన్ని పాల్గుణ చవితి రోజున ఆచరిస్తే వెనువెంటనే ఫలితాలను పొందవచ్చునని భక్తుల విశ్వాసం. దీనితోపాటుగా సంతాన గణపతి వ్రతాన్ని ఆచరించడం వల్ల మనసు, బుద్ధి, శరీరం శుద్ధి అవుతాయి. మనలోని చెడ్డ ఆలోచనల ప్రభావం తొలగిపోతుంది. మేధస్సు చైతన్యమవుతుంది. కోరిన కోర్కెలన్నీ నెరవేరుతాయని భక్తుల నమ్మకం.

-అమృతవర్షిణి,హైదరాబాద్

WhatsApp channel