TG MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్దమైన ఆల్పోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి-head of alphores educational institutions narender reddy is ready to contest as mlc ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tg Mlc Elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్దమైన ఆల్పోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి

TG MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్దమైన ఆల్పోర్స్ విద్యా సంస్థల అధినేత నరేందర్ రెడ్డి

HT Telugu Desk HT Telugu
Sep 12, 2024 06:14 PM IST

TG MLC Elections : విద్యారంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న అల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత.. వావిలాల నరేందర్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు. త్వరలో జరగనున్న కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో పోటీ చేస్తానని ప్రకటించారు.

వావిలాల నరేందర్ రెడ్డి
వావిలాల నరేందర్ రెడ్డి

విద్యా కుసుమం రాజకీయాల్లోకి అడుగు పెడుతుందని వావిలాల నరేందర్ రెడ్డి ప్రకటించారు.‌ పుట్టి పెరిగిన జగిత్యాలలో తొలి రాజకీయ ప్రకటన చేశారు. ట్యూటర్‌గా మొదలైన ప్రస్థానం.. 34 ఏళ్లుగా సక్సెస్ ఫుల్‌గా సాగిందని.. ఆల్పోర్స్ విద్యా సంస్థల అధినేతగా కొనసాగుతున్నానని చెప్పారు.

ఉత్తర తెలంగాణకు గర్వ కారణంగా ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు ఉన్నాయని నరేందర్ రెడ్డి వివరించారు. కేజీ నుండి పీజీ వరకు పూర్తి స్థాయిలో అవగాహన ఉందని.. విద్యార్థులు వారి పేరెంట్స్, శ్రేయోభిలాషుల సూచన మేరకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన వచ్చిందన్నారు.‌ శాసన మండలిలో తన వాయిస్ వినిపిస్తానని, ఏ పార్టీకి సంబంధం లేకుండా పట్టభద్రుల ఓటర్ల నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు.

ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆశీస్సులు తీసుకున్నానని నరేందర్ రెడ్డి వెల్లడించారు. 3 తరాల జనరేషన్‌తో సత్సంబంధాలు కలిగి ఉన్నానని, అందరికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతూ.. రాజకీయ వేత్తగా ఎదగాలని అనుకుంటున్నట్టు వివరించారు. రాజకీయాల్లోకి వచ్చినా.. విద్యా వ్యవస్థను వదిలేది లేదన్నారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థలు యధావిధిగా కొనసాగిస్తూ.. రాజకీయంగా రాణిస్తూ రెండు రంగాల్లో డ్యూయల్ రోల్ పోషిస్తానని స్పష్టం చేశారు.

2018 రాజకీయ అరంగేట్రం..

2018లో ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ సూచన మేరకు నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తొలిసారిగా రాజకీయ రంగప్రవేశం చేసిన నరేందర్ రెడ్డి.. గాంధీభవన్ లో చేరిన తర్వాత కరీంనగర్ లోనూ భారీ ప్రదర్శన చేపట్టారు. ఆ ఎన్నికల్లో కరీంనగర్ అసెంబ్లీ టికెట్టు ఖాయమని హామీ లభించడంతో.. నరేందర్ రెడ్డి అందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అనూహ్యంగా పొన్నం ప్రభాకర్ పోటీలో నిలువాల్సి రావడంతో నరేందర్ రెడ్డి తప్పుకున్నారు. అయినా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ వచ్చారు. రాజకీయ పార్టీలన్నింటితోనూ నరేందర్ రెడ్డికి సత్సంబంధాలు ఉన్నా.. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ బరిలో నిలువాలని యోచిస్తున్నారు.

డాక్టర్ల సహకారం..

నరేందర్ రెడ్డి సతీమణి డాక్టర్ వనజారెడ్డి కరీంనగర్‌లో పేరొందిన వైద్యురాలు. దీంతో వైద్య వర్గాల నుంచి తమకు సహకారం లభించే అవకాశం ఉందని భావిస్తున్నారు. దశాబ్దాలుగా కరీంనగర్ లో వైద్యరంగంలో సేవలందిస్తున్న డాక్టర్ వనజారెడ్డి.. తనకున్న పరిచయాలు, సన్నిహితులు, సిబ్బంది సహకారం కూడా రాబట్టుకోవచ్చని ఆశిస్తున్నారు.

పూర్వ విద్యార్థులే బలం..

1991 నుంచి ఇప్పటి వరకు 33 సంవత్సరాల పాటు లక్షన్నరకు పైగా విద్యార్థులు అల్పోర్స్ విద్యాసంస్థల్లో చదువుకున్నారు. వారు ఉన్నత స్థాయిల్లో ఉన్నారు. 90 శాతానికి పైగా గ్రాడ్యుయేట్లు ఉండటం సహజమైనందున పూర్వ విద్యార్థులందరూ కూడా తనకు మద్దతునిస్తారనే విశ్వాసాన్ని నరేందర్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో నాలుగు వేల నుంచి ఐదు వేల వరకు ఉన్న టీచర్లు, సిబ్బంది అండగా నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా ప్రాంతాల వారీగా ఉపాధ్యాయులు, తన సన్నిహితులతో సమావేశాలు జరుపుతున్నారు. నరేందర్ రెడ్డి తన అభ్యర్థిత్వం పట్ల సానుకూలత వ్యక్తమైన తర్వాతనే పోటీకి సిద్ధపడ్డారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిత్వం దక్కితే.. ఆ పార్టీ పరంగా ఉన్న ప్రజాప్రతినిధులు, పార్టీ నేతల సహకారంతో మరింత మద్దతు లభించే అవకాశం ఉంది. కూడా అంచనా వేస్తున్నారు. అదే సమయంలో రెడ్డి సామాజికవర్గానికి మొదటి నుంచి తనవంతుగా సహాయసహకారాలు అందిస్తుండ

వీఆన్ఆర్ ఫౌండేషన్ ద్వారా సామాజిక సేవ..

తన పేరిట విఎన్ఆర్ ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి.. పలు సామాజిక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు నరేందర్ రెడ్డి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తనకు వీలైనంత మేరకు ఆర్ధిక సహాయం అందిస్తున్నారు. రానున్న కాలంలో తన ఫౌండేషన్ ద్వారా అత్యధిక ప్రాంతాల్లో పేద ప్రజలకు సేవలందించే దిశగా నరేందర్ రెడ్డి కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారు.

(రిపోర్టింగ్- కె వి రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రతినిధి, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)