SUDA Chairman: సుడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నామినేటెడ్ పదవులతో నేతల్లో ఉత్సాహం-komatireddy narendra reddy who took charge as suda chairman excited among the leaders with nominated posts ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Suda Chairman: సుడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నామినేటెడ్ పదవులతో నేతల్లో ఉత్సాహం

SUDA Chairman: సుడా చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన కొమటిరెడ్డి నరేందర్ రెడ్డి, నామినేటెడ్ పదవులతో నేతల్లో ఉత్సాహం

HT Telugu Desk HT Telugu
Jul 09, 2024 02:33 PM IST

SUDA Chairman: ఊరిస్తూ వస్తున్న నామినేటెడ్ పదవుల నియామకాలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

సుడా ఛైర్మన్‌గా బాధ్యతల స్వీకారం
సుడా ఛైర్మన్‌గా బాధ్యతల స్వీకారం

SUDA Chairman: దశాబ్దం తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీనియారిటీ, సిన్సియారిటీతో పని చేసిన వారిని గుర్తించి మూడున్నర మాసాల క్రితం 37 కార్పొరేషన్ చైర్ పర్సన్ పదవులను కట్టబెట్టింది. అయితే లోక్ సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో బాధ్యతలు స్వీకరించడానికి వీలు లేకుండా పోయింది.

ఎన్నికల కోడ్ ఎత్తివేసినా కూడా పదవుల జాడ లేకపోవడం.. పలు రకాల ఊహాగానాలు వెలువడటంతో ఇంతకు పదవులు వచ్చినట్టా.. రానట్టా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే వీటన్నింటినీ పటాపంచలు చేస్తూ సోమవారం 35 కార్పొరేషన్ చైర్ పర్సన్ల జాబితాలను ధృవీకరిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ జాబితాలో శాతవాహన అర్బన్ డెవలప్ మెంట్ అథారిటీ (సుడా) చైర్మన్ గా కరీంనగర్ నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఉండగా పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు వెనువెంటనే నరేందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అలాగే మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నేరేళ్ళ శారద పదవిని ధృవీకరిస్తూ అధికారికంగా గవర్నర్ నుంచి ఆమోదముద్ర రావల్సి ఉండటంతో ఫైల్ గవర్నర్ కు పంపించారు. ఒకటి, రెండు రోజుల్లో ఈ నియామకం కూడా వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

పట్టు నిలుపుకున్న నరేందర్ రెడ్డి

నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి తీవ్ర ఇబ్బందులు పడుతున్న కోమటరెడ్డి నరేందర్ రెడ్డి తన పట్టు నిలుపుకున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ తో విబేధాల నేపథ్యం లో నరేందర్ రెడ్డికి పదవి దక్కకుండా చేయడం ఖాయమంటూ జోరుగా ప్రచారం జరిగింది.

మంత్రి శ్రీధర్ బాబుకు సన్నిహిత అనుచరుడైన సరేందర్ రెడ్డి నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా పని చేస్తూ తన సత్తాను చాటుకున్నారు. పార్టీని నగరంలో బలోపేతం చేశారు. డివిజన్ల కమిటీ లు.. పార్టీ కార్యక్రమాల ద్వారా పీసీసీ అధ్యక్షునిగా ఉన్న రేవంత్ రెడ్డి సహా ముఖ్య నేతలకు సన్నిహితంగా మారారు. అసెంబ్లీ టికెట్టు రేసులో చివరి వరకూ పోటీపడ్డారు. ఈ క్రమంలోనే సుడా చైర్మన్ పదవిని దక్కించుకున్నా మంత్రి పొన్నం అభ్యంతరాలతో చైర్మన్ పదవి వస్తుందా రాదా అన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది.

ఉత్కంఠ మధ్య చైర్మెన్ పదవి..

సుడా చైర్మన్ పదవి ఉత్కంఠ మధ్య నరేందర్ రెడ్డి కి దక్కింది. పార్లమెంట్ ఎన్నికల ముందు సుడా చైర్మన్ గా నరేందర్ రెడ్డి పేరు ప్రకటించినప్పటికి అధికారికంగా ఉత్తర్వులు వెలువడలేదు. నరేందర్ రెడ్డి కి ఆ పదవి దక్కకుండా కొందరు నాయకులు విశ్వప్రయత్నం చేశారు.

లోక్ సభ ఎన్నికల సందర్భంగా నరేందర్ రెడ్డిని నగర పార్టీ అధ్యక్షునిగా కాకుండా ఒక డివిజన్ స్థాయి నాయకునిగా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందంటూ ఆయన అనుచరులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినా కూడా నరేందర్ రెడ్డి బయట పడకుండా తనకు అప్పగించిన ఆరు డివిజన్లలో ఇంటింటా ప్రచారం చేసుకుంటూ పోయారు. వివాదాలకు దూరంగా ఉంటూ పార్టీ ముఖ్య నేతలను కలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.

ఈ క్రమంలోనే మంత్రి శ్రీధర్ బాబు అండదండలు.. పార్టీ ముఖ్య నేతల ఆశీస్సులు ఉండడంతో జీవో వెలువడిన వెంటనే నరేందర్ రెడ్డి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి సుడా చైర్మన్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు.

పొన్నం కలుపుపోతారా...?

మొండితనానికి మారుపేరైన మంత్రి పొన్నం ప్రభాకర్ సుడా చైర్మన్, మహిళా కమిషన్ చైర్ పర్సన్ విషయంలో ఏ రకంగా వ్యవహరిస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. జిల్లాల విభజన తర్వాత కరీంనగర్ కేవలం నాలుగైదు నియోజకవర్గాలకే పరిమితం కాగా... కరీంనగర్ నుంచి నరేందర్ రెడ్డికి, చొప్పదండి నుంచి నేరేళ్ళ శారదకు కీలక పగ్గాలు దక్కాయి.

మంత్రి పొన్నం ప్రభాకర్ సిఫార్సుల ద్వారా ఎవరికీ పదవులు దక్కకపోవడం నేపథ్యంలో ఆయన అనుచరగణం అటు హుస్నాబాద్ .. ఇటు కరీంనగర్ లో తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తన అసంతృప్తిని పక్కనబెట్టి తనకు సంబంధం లేకుండా పదవులు తెచ్చుకున్న ఈ ఇద్దరితో కలిసి పోవడం సాధ్యమేనా అన్నదానిపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది.

(రిపోర్టింగ్ కేవీరెడ్డి, హెచ్‌టి తెలుగు0

WhatsApp channel