BJP Telangana: అలా వచ్చి ఇలా వెళ్లి..! తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోంది..?
Telangana Politics: తెలంగాణ బీజేపీలో చేరిన పలువురు నేతలు బయటికి వచ్చేస్తున్నారు. ఉద్యమ నేతలను తమ వైపు తిప్పుకోవటంలో సక్సెస్ అయిన కాషాయదళానికి...వరుస షాక్ లు ఇస్తోంది అధికార టీఆర్ఎస్. అసలు తెలంగాణ బీజేపీలో ఏం జరుగుతోందనే చర్చ సర్వత్రా నడుస్తోంది.
key leaders quit bjp party in telangana: దుబ్బాకలో విక్టరీ కొట్టింది... హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో తిరుగులేని విజయాన్ని అందుకుంది..! అదే జోష్ తో హుజురాబాద్ లోనూ గెలిచి... అధికార టీఆర్ఎస్ కు సవాల్ విసిరింది తెలంగాణ బీజేపీ. అంతేనా తెలంగాణ తామే ప్రత్యామ్నాయమంటూ దూకుడు పెంచింది. కీలక నేతలను ఆకర్షించింది. టీఆర్ఎస్ నుంచి పలువురు నేతలను తమవైపు తిప్పుకోవటంలో సక్సెస్ అయింది. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకువచ్చి... ఉప ఎన్నికను తీసుకువచ్చేలా ప్లాన్ చేసింది. మునుగోడునూ కూడా కొట్టి... వచ్చే సాధారణ ఎన్నికల్లో విజయయాత్ర మోగించాలని భావించింది. ఉపఎన్నికతో కమలదళం ఆట మొదలుపెట్టగా... టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ షురూ చేసింది. పార్టీని వీడిన కీలక నేతలను గులాబీ గూటికి చేర్చే పనిలో పడింది.
ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే... తెలంగాణ రాజకీయాలు వేగంగా మారిపోతున్నాయి. బీజేపీలో చేరిన పలువురు నేతలు తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరటంతో మొదలైన ఈ చేరికల అంశం ఆసక్తిగా మారుతోంది. అయితే ఈ విషయంలో టీఆర్ఎస్ స్పీడ్ పెంచింది. పార్టీని వీడిన ఉద్యమకారులను తిరిగి పార్టీలోకి వచ్చేలా కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ క్రమంలో శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. తిరిగి గూలాబీ గూటికి చేరారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ బీజీపీకి ఈ పరిణామం గట్టి షాక్ ఇచ్చిందనే చెప్పొచ్చు. ఇక గత కొద్దిరోజుల కిందట టీఆర్ఎస్ పార్టీని వీడి... బీజేపీలో చేరారు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్. ఆయన కూడా బీజేపీలో కొనసాగలేకపోయారు. తిరిగి గులాబీ గూటికి చేరారు. వీరే కాకుండా... మరికొంత మంది నేతలు టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఈ పరిస్థితి ఎందుకు...?
కీలక నేతలు బీజేపీని వీడటం కమలదళంలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ పరిస్థితి కారణం.. పార్టీలో నెలకొన్న పరిస్థితులే కారణమని తెలుస్తోంది. చేరికలు వరకు ఒకలా ఉంటే... చేరిన తర్వాత మరోలా ఉందనే భావనలో నేతలు ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ముగ్గురు, నలుగురు నేతలు ఎవరికివారిగా కేంద్రంగా పని చేస్తూ... చేరిన నేతలను పట్టించుకోవటంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సరిగ్గా ఈ పరిణామాలే అధికార టీఆర్ఎస్ కు కలిసివచ్చాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే పార్టీని వీడిన నేతలతో చర్చలు జరుపుతూ రప్పించే ప్రయత్నం జరుగుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మునుగోడు ఉప ఎన్నికలోపే మరికొంత మంది నేతలు కూడా బీజేపీని వీడే అవకాశం ఉందనే చర్చ జోరందుకుంది.
ఇక ఈ చేరికలపై బీజేపీ అధినాయకత్వం కూడా అప్రమత్తమైనట్లు సమాచారం. దిద్దుబాటు చర్యలు చేపట్టేలా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ చేరికలు ఇంతటితో ఆగుతాయా..? లేక కంటిన్యూ అవుతాయా..? అనేది టాక్ ఆఫ్ ది తెలంగాణ మారింది.