Munugodu Bypoll : పక్కా వ్యూహంతో పావులు కదుపుతున్న బీజేపీ!
bjp stratagey munugodu: తెలంగాణ రాజకీయాల్లో మునుగోడు బైపోల్ ఉపఎన్నిక కీలకంగా మారింది. వచ్చే ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తున్న ఈ పోరులో ప్రధాన పార్టీలు ఎవరికి వారు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం పక్కా స్ట్రాటజీతో ముందుకెళ్లే పనిలో పడింది.
bjp new startagey in munugodu bypoll: రాష్ట్ర రాజకీయ పరిస్థితులను మార్చే ఉపఎన్నిక కావడంతో అందరి చూపు మునుగోడు వైపు మళ్లింది. అధికార టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు తెగ తిరిగేస్తుంటే… బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ధీటుగా పావులు కదిపేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులను తనవైపు తిప్పేసుకుంటున్నారు. మరోవైపు బీజేపీ రాష్ట్రనాయకత్వం కూడా మునుగోడుపై ఫోకస్ పెంచేసింది. తాజాగా సరికొత్త వ్యూహాన్ని అమలు చేసేలా పావులు కదుపుతోంది.
కమిటీలతో పర్యవేక్షణ….
మూడు దశల్లో పర్యవేక్షిస్తోంది బీజేపీ నాయకత్వం. ప్రతీ 60 మంది ఓటర్లకు ఒక బాధ్యుడుని నియమించారు. బీజేపీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి సునీల్ బన్సల్‌తో పాటు ఇద్దరు జాతీయ నాయకులు మునుగోడులోనే ఉంటూ వ్యవహరాలను పర్యవేక్షిస్తున్నారు. ఒకవైపు ఇంటింటి ప్రచారం మరోవైపు కీలక నేతల రోడ్ షోలు, జాతీయ నేతలతో భారీ సభకు మునుగోడు ఎన్నికల ప్రణాళిక వేగంగా సాగుతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా 298 బూత్‌లు ఉండగా ఒక్కో బూత్‌కు ఒక ముఖ్య నేతతో పాటు 25మందితో కమిటీలను వేశారు.
మరోవైపు మహిళా మోర్చాకు సంబంధించి 20 బృందాలు ఇంటింటి ప్రచారం మొదలుపెట్టాయి. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ ఎంట్రీ ఇచ్చారు. అధికార టీఆర్ఎస్ పై మాటల దాడిని పెంచారు. ఇక ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ ఒక్కొక్కరికి ఒక్కో మండల బాధ్యత అప్పగించారు. ఇక మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కూడా… గురువారం నుంచి ప్రచారంలో పాల్గొనబోతున్నారు. ఆయనకు పార్టీ నాయకత్వం పలు బాధ్యతలను కట్టబెట్టినట్లు తెలుస్తోంది. వీరు ఆ మండలంలోని ప్రతీ అంశాన్ని పర్యవేక్షిస్తారు. వీరందరిపైన 14 మంది స్టీరింగ్‌కమిటీ పర్యవేక్షణ ఉంటుంది. ఈ కమిటీని మాజీ ఎంపీ వివేక్ ఆధ్వర్యంలో నడుస్తోంది.
గుర్తుపై విస్తృత ప్రచారం....
ఇక కోమటిరెడ్డి అనగానే సాధారణంగా కాంగ్రెస్ అన్న భావన ప్రజల్లో ఉంటుంది. అయితే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారిన నేపథ్యంలో... బీజేపీ గుర్తును ప్రజల్లోకి విస్తృత్తంగా తీసుకెళ్లాలని నిర్ణయించారు. అభ్యర్థితో పాటు కమలం గుర్తును కూడా జనాల్లోకి తీసుకెళ్తున్నారు.
మునుగోడు బైపోల్ విషయంలో బీజేపీ కాస్త భిన్నంగా అడుగులు వేసిందనే చెప్పొచ్చు. దుబ్బాక, హుజురాబాద్ తరహాలో ఉప ఎన్నిక ఇంచార్జ్ అని కాకుండా స్టీరింగ్ కమిటీ అని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఒకర్ని ఛైర్మన్ గా నియమించటంతో పాటు... కీలక నేతలను కమిటీలో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంది. బీజేపీ గత రెండు ఉపఎన్నికల్లో మాజీ ఎంపీ జితేందర్ రెడ్డికి బాధ్యతలను ఇచ్చింది. దుబ్బాకతో పాటు హుజూరాబాద్ ఉప ఎన్నికలను కూడా జితేందర్ రెడ్డి దగ్గరుండి చూసుకున్నారు. ఆ రెండు చోట్లా విజయం సాధించింది.
మొత్తంగా వ్యూహాలు ప్రతివ్యూహాలు రచించటంలో బీజేపీ వేగం పెంచుతోందనే చెప్పొచ్చు. ప్రత్యర్థి పార్టీల బలబలాను అంచనా వేస్తూ ముందుకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు. అన్నింటిపై ఓ అంచనాతో ఉన్న కమలనాథులు.... కీలక నేతలందర్నీ బరిలోకి దింపేలా కార్యాచరణను రూపొందించింది.