Munugodu Bypoll: కాంగ్రెస్ కు షాక్… TRS లోకి పల్లె రవి కుమార్ దంపతులు
మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ నేత పల్లె రవి కుమార్ దంపతులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
palle ravi kumar joins in trs: మునుగోడు ఉప ఎన్నికవేళ కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ నేత పల్లె రవి కుమార్ దంపతులు గుడ్ బై చెప్పారు. పల్లె రవి కుమార్, ఆయన భార్య, కల్యాణి మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు.
పల్లె రవి భార్య కల్యాణి చండూరు కాంగ్రెస్ ఎంపీపీగా ఉన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ తరఫున పల్లె రవి టికెట్ ఆశించారు. అయితే కాంగ్రెస్ అధిష్టానం మాత్రం పాల్వాయి స్రవంతిని అభ్యర్థిగా ఖరారు చేసింది.
సంతోషంగా ఉంది - కేటీఆర్...
పార్టీ కండువా కప్పి పల్లె రవి దంపతులను మంత్రి కేటీఆర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన... ఉద్యమ కాలం నుంచి కలిసి పని చేసిన పల్లె రవికుమార్ మళ్లీ టీఆర్ఎస్ పార్టీ కుటుంబంలోకి రావడం సంతోషంగా ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో రాజకీయంగా మంచి అవకాశాలు కల్పిస్తామని హామీ కూడా ఇచ్చారు.
గెలుపు కోసం కృషి చేస్తాం - పల్లె రవి
అన్ కండిషనల్ గా టీఆర్ఎస్ పార్టీలో చేరినట్లు పల్లె రవికుమార్ స్పష్టం చేశారు. నవంబర్ 3న జరగనున్న మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి, కర్నె ప్రభాకర్, బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థిగా తనకు అవకాశం ఇవ్వాలని పల్లె రవి కుమార్ కోరినప్పటికీ.. అధినాయకత్వం స్రవంతిని ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఆయన అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ నేతలు ఆయనతో చర్చలు జరిపినట్లు సమాచారరం. సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ ఉద్యమకారుడు అయిన పల్లె రవి కుమార్.. తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు.
మరోవైపు టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పార్టీకి రాజీనామా చేయటంతో గులాబీ శిబిరం ఉలికిపడింది. దీంతో అధినాయకత్వం అప్రమత్తమైంది. మునుగోడులో గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే ఇతర పార్టీలలోని ముఖ్య నాయకులకు గాలం వేస్తున్నాయి.