October 14 Telugu News Updates : మునుగోడులో ముగిసిన నామినేషన్లు!
- Today Telugu News Updates: అక్టోబర్ 14 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తల కోసం ఈ పేజీని ఫాలో అవ్వండి. లైవ్ అప్ డేట్స్ కోసం ఎప్పటికప్పుడూ పేజీని రిఫ్రెష్ చేస్తూ ఉండండి
Fri, 14 Oct 202204:25 PM IST
సుప్రీం సందేహాలు…!
వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తును ఏపీ బయట చేపట్టాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది. హత్య కేసులో సాక్షులకు కల్పిస్తున్న భద్రతపై న్యాయస్థానం సందేహం వ్యక్తం చేసింది. కోర్టు చెప్పిన విధంగా వన్ ప్లస్ వన్ భద్రత కల్పిస్తున్నామని ఏపీ ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే సుప్రీంకోర్టు మాత్రం ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది.
Fri, 14 Oct 202203:54 PM IST
కదం తొక్కిన కాంగ్రెస్ కార్యకర్తలు….
మునుగోడు కాంగ్రెస్ అభ్యర్తి పాల్వాయి స్రవంతి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. బంగారిగడ్డ నుంచి చండూర్ లోని తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టివిక్రమార్క, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, జగ్గారెడ్డి, షబీర్ అలీతో పాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. మరోవైపు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నాయి.
డబ్బులతో ఓటర్లను కొనుగోలు చేయాలని రెండు పార్టీలు చూస్తున్నాయని విమర్శించారు రేవంత్ రెడ్డి. మునుగోడు ప్రజలు అమ్ముడుపోవడానికి సిద్ధంగా లేరని... అమ్ముడు పోవడానికి కార్యకర్తలేమీ గుత్తేదారులు కాదని వ్యాఖ్యానించారు.. వేలాది మంది కార్యకర్తలు తమకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నారని చెప్పారు. మునుగోడు పౌరుషాల గడ్డ అని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఓడించేందుకు కొడంగల్‌ను దత్తత తీసకుంటున్నానని కేటీఆర్ చెప్పారని... కానీ, ఇప్పటివరకు అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.
"మునుగోడు ప్రజలను కొడంగల్ తీసుకెళ్లి చూపిస్తాను. నేను వేయించిన రోడ్లపై గుంతలు పడితే తట్టెడు మట్టివేసే దిక్కులేదు. రేపో మాపో వాళ్ల తండ్రి మునుగోడుకు వస్తారు. కుర్చీ వేసుకొని ఇక్కడే కూర్చుంటా.. మునుగోడుకు సముద్రం తెస్తానని చెబుతారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఫామ్‌హౌస్‌కే పరిమితం అవుతారు" అని దుయ్యబట్టారు.
Fri, 14 Oct 202203:53 PM IST
బీజేపీలోకి బూర….?
Telangana Politics : మునుగోడు బైపోల్ వార్ ముందు టీఆర్ఎస్‌కు భారీ షాక్ తగలటం ఖాయంగా కనిపిస్తోంది. మునుగోడు టికెట్ ఆశించి భంగపడ్డ భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన బీజేపీలో చేరుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. అన్నీ కుదిరితే ఇవాళో, రేపో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరేతారని తెలుస్తోంది.
Fri, 14 Oct 202201:53 PM IST
పెండింగ్ లోనే బిల్లులు…!
గత నెలలో రాష్ట్ర శాసనసభ, మండలి సమావేశాలు జరిగాయి. ఇందులో 8 బిల్లులు ఆమోదం పొందగా.. వీటిని రాజ్ భవన్ కు పంపారు. అయితే ఇందులోని ఒక బిల్లుపై మాత్రం గవర్నర్ సంతకం చేయగా చట్టంగా మారింది. మరో ఏడు బిల్లులు రాజ్‌భవన్‌లో పెండింగులో ఉన్నాయి. నెలరోజులు గడిచినా రాష్ట్ర గవర్నర్ తమిళిసై ఇంకా ఆమోద ముద్ర వేయలేదని తెలుస్తోంది. దీంతో వాటి అమలు ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. దీనికి కూడా గతంలో చోటు చేసుకున్న పరిణామాలే కారణమా అన్న చర్చ కూడా నడుస్తోంది.
Fri, 14 Oct 202212:42 PM IST
నాల్గో రోజు లెక్కింపు….
విజయవాడ దుర్గ అమ్మవారి దసరా శరన్నవరాత్రులు మహోత్సవo అనంతరం,
ఈరోజు హుండీ(నాల్గోవ రోజు) లెక్కించారు మొత్తం నగదు: -రూ.66,58,198లు కాగా కానుకల రూపములో
- బంగారం: 39 గ్రాములు,
- వెండి: 500 గ్రాములు వచ్చాయి.
గత 3 రోజుల నుండి జరిగిన హుండీ లెక్కింపు తో కలిపి మొత్తం నగదు: రూ. 9,11,33,985గా పేర్కొన్నారు. 2393 అమెరికా డాలర్లతో పాటు ఇతర విదేశీ కరెన్సీను భక్తులు హుండీ ద్వారా సమర్పించుకున్నారు.
Fri, 14 Oct 202212:40 PM IST
ముగిసిన నామినేషన్ల పర్వం…
మునుగోడు నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. ఈరోజు 25 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మొత్తంగా చూస్తే వంద మంది నామినేషన్లు వేసినట్లు తెలుస్తోంది. రేపు నామినేషన్ల పరిశీలన ఉంటుంది. 17వ తేదీ వరకు అభ్యర్థుల నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. నవంబర్ 3న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. 6న కౌంటింగ్, ఫలితాలు వెలువడే అవకాశం ఉంది.
Fri, 14 Oct 202212:28 PM IST
ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం….
ts intermediate syllabus 2022 -2023: ఇంటర్మీడియట్‌లో ఈ విద్యాసంవత్సరం నుంచి మళ్లీ పూర్తి స్థాయి సిలబస్ అమలు కానుంది. కరోనా కారణంగా.. గత రెండేళ్లుగా తరగతులు సరిగా నిర్వహించలేకపోవడంతో 30 శాతం సిలబస్‌ను తొలగించారు. దానికి అనుగుణంగానే ఎంసెట్‌లోనూ 70శాతం సిలబస్ నుంచే పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.
వంద శాతం సిలబస్....
ఈ ఏడాది 100 శాతం సిలబస్‌తో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది ఇంటర్ బోర్డు. ఈ మేరకు ఇంటర్మీడియట్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. వంద శాతం సిలబస్‌కు సంబంధించిన నమూనా ప్రశ్నాపత్రాలు ఇంటర్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. కొవిడ్ వల్ల గత రెండేండ్ల నుంచి 70 శాతం సిలబస్‌తో ఇంటర్ పరీక్షలు నిర్వహించారు.
Fri, 14 Oct 202211:25 AM IST
నామినేషన్ దాఖలు
మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు పలువురు ముఖ్య నేతలు పాల్గొన్నారు.
Fri, 14 Oct 202211:25 AM IST
7 వేల అప్లికేషన్స్ తిరస్కరణ…
మునుగోడు ఎన్నికల జాబితాపై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఎన్నికల జాబితా నివేదికను హైకోర్టుకు సమర్పించింది రాష్ట్ర ఎన్నికల సంఘం. 25 వేల ఓట్లర్లు నమోదు అయ్యారని, అందులో 12 వేలు మాత్రమే నిర్ధారించామని పేర్కొంది. మరో 7 వేల ఓట్లు నమోదును తిరస్కరించామని ఎన్నికల సంఘం పేర్కొంది. పెండింగ్‌లో ఉన్న ఓటర్లు ప్రక్రియను నిలిపేయాలని పిటిషనర్ కోరగా... ఏకీభవించిన ధర్మాసనం పెండింగ్‌లో ఉన్న ఓటరు జాబితా నిలిపేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 21కు వాయిదా వేసింది.
Fri, 14 Oct 202210:18 AM IST
షెడ్యూల్ విడుదల….
హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు వివరాలను వెల్లడించింది.
Fri, 14 Oct 202209:59 AM IST
కాంగ్రెస్ అభ్యర్థి నామినేషన్….
మునుగోడులో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ ర్యాలీలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు జానారెడ్డి, దామోదర్ రెడ్డి, భట్టి విక్రమార్క, మధుయాష్కీతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.
Fri, 14 Oct 202209:59 AM IST
కోణార్క్ టూర్….
irctc tourism konark tour from hyd: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా ప్రతీ ఏటా జరిగే కోణార్క్ డ్యాన్స్ అండ్ సాండ్ ఆర్ట్ ఫెస్టివల్ చూసేందుకు వెళ్లేవారికోసం టూర్ ప్యాకేజీని ప్రకటించింది. 'Konark Dance and Sand Art Festival' పేరుతో ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ఈ టూర్ ప్యాకేజీలో భువనేశ్వర్, పూరి, కోణార్క్, చిలికా లాంటి ప్రాంతాలు కవర్ అవుతాయి.
3 రోజులు 2 రాత్రులు....
డిసెంబర్ 1, 2, 3, 4, 5 తేదీల్లో ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. ఇది 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ. హైదరాబాద్ నుంచి ఫ్లైట్‌లో తీసుకెళ్లి పర్యాటక ప్రాంతాలను చూపిస్తారు
Fri, 14 Oct 202209:05 AM IST
హైకోర్టులో విచారణ…
మునుగోడులో కొత్త ఓట్ల పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం ఓటర్ల జాబితా ప్రకటించకుండా ఆదేశాలు ఇవ్వడానికి నిరాకరించింది. ఓటర్ల జాబితా సవరణ పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కోర్టుకు సమర్పించిన డేటాని హైకోర్టు ధర్మాసనం పరిశీలించింది. 2018 అక్టోబర్ 12వ తేదీన మునుగోడు ఓటర్లు 2,14,847 మంది ఉన్నట్లు కోర్టుకు సమర్పించిన నివేదికలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. ఈనెల 11వ తేదీ నాటికి మునుగోడు ఓటర్లు 2,38,759 మంది ఉన్నారని పేర్కొన్నారు. 25 వేల 13 మంది ఓటర్లు కొత్త ఓటర్లుగా దరఖాస్తు చేసుకున్నారని, ఇప్పటివరకు 12,249 మంది కొత్త ఓటర్లు అనుమతించామని కోర్టుకు తెలియజేశారు. 7,247 మందిని తిరస్కరించామని సీఈఓ చెప్పారు. ఇక మిగతా ఓటర్ల జాబితా పెండింగ్లో ఉందని, నేటితో ఓటరు జాబితా సవరణ పూర్తి చేస్తామని వివరించారు.
Fri, 14 Oct 202209:03 AM IST
ఫోన్ పే ప్రకటన…
మునుగోడు బైపోల్ నేపథ్యంలో ‘Contract Pe’పై కొన్ని ప్రసార మాధ్యమాలలో వస్తున్న వార్తలతో తమకు ఎలాంటి సంబంధం లేదని PhonePe స్పష్టం చేసింది. ఏ కంపెనీకి ఏ పార్టీతో కానీ, అభ్యర్థితో కానీ ఎలాంటి రాజకీయ సంబంధాలు లేవని పేర్కొంది.
Fri, 14 Oct 202207:01 AM IST
ప్రొఫెసర్ సాయిబాబాకు ఊరట
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో నాగ్‌పుర్ జైలులో జీవితఖైదు అనుభవిస్తున్న దిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ డాక్టర్ జి.ఎన్.సాయిబాబాకు భారీ ఊరట లభించింది. ఈ కేసులో ఆయనను బాంబే హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. ఆయనను తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని అధికారులను ఆదేశించింది.సాయిబాబాతో పాటు మరో ఐదుగురిని కూడా ఈ కేసులో న్యాయస్థానం నిర్దోషులుగా తేల్చింది. మరేదైనా కేసులో వీరు నిందితులుగా ఉంటే మినహా.. వీరందరినీ తక్షణమే జైలు నుంచి విడుదల చేయాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
Fri, 14 Oct 202205:57 AM IST
ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు
ప్రకాశం బ్యారేజ్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నాగార్జున సాగర్ నుంచి 3 లక్షల క్యూసెక్కుల వరద నీటిని అధికారులు దిగువకు విడుదల చేశారు. అటు పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు 3.30 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరుతోంది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ప్రకాశం బ్యారేజ్ ఎగువ, దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. బ్యారేజి గేట్లను మొత్తాన్ని ఎత్తి నీటిని విడుదల చేసేందుకు ఇరిగేషన్ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
Fri, 14 Oct 202205:24 AM IST
నేడు నామినేషన్ వేయనున్న పాల్వాయి స్రవంతి
మునుగోడు అసెంబ్లీ నియోజక వర్గ ఉప ఎన్నికల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చండూర్ తహశీల్దార్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి నామినేషన్ వేయనున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా కార్యకర్తలు, ప్రజలు, అభిమానులు తరలిరావాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. బంగారు గడ్డ గ్రామం నుంచి చండూర్ ఎమ్మార్వో కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించనున్నారు.
Fri, 14 Oct 202204:11 AM IST
రోడ్డు ప్రమాదంలో ముగ్గురి మృతి
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వల్లూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వల్లూరు సమీపంలో లారీని కారు ఢీ కొట్టడంతో ముగ్గురు మృతి చెందారు. మృతులు ఒంగోలుకు చెందిన పరమేశ్, పవన్, శ్రీనివాస్‌గా గుర్తించారు. ప్యారిస్ పర్యటనకు వెళ్లి రాత్రి చెన్నైలో దిగిన ముగ్గురు స్నేహితులు , చెన్నె నుంచి ఒంగోలు వస్తుండగా ప్రమాదం జరిగింది. ఘటనలో ముగ్గురు మృతి చెందారు.
Fri, 14 Oct 202203:29 AM IST
అమరావతి రైతుల పాదయాత్ర
నేడు 33వ రోజు అమరావతి రైతుల పాదయాత్ర కొనసాగనుంది. నిడదవోలు నియోజకవర్గంలో రైతుల పాదయాత్ర నిర్వహిస్తారు. మునిపల్లె నుంచి ముప్పవరం వరకు పాదయాత్ర కొనసాగుతుంది. సుమారు 14 కిలోమీటర్ల మేర రైతుల పాదయాత్ర కొనసాగనుంది.
Fri, 14 Oct 202203:29 AM IST
తిరుమలలో రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతోంది. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.65 కోట్లు లభించింది. 72,216 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. 32,338 మంది భక్తులు - తలనీలాలు సమర్పించుకున్నారు.
Fri, 14 Oct 202203:29 AM IST
ఉప్పల్‌లో జంట హత్యలు
హైదరాబాద్ ఉప్పల్‍లో జంట హత్యలు జరిగాయి. తండ్రి, కుమారుడిని దుండగులు దారుణంగా హత్య చేశారు. తండ్రిపై దాడి చేస్తుండగా అడ్డుకున్న కొడుకును హతమార్చారు. తండ్రితో పాటు కొడుకును కూడా చంపారు దుండగులు. మృతులను నర్సింహశర్మ, శ్రీనివాస్‍గా గుర్తించారు.
Fri, 14 Oct 202203:29 AM IST
నేడు ఏపీలోకి భారత్ జోడో యాత్ర
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర నేడు ఏపీలో అడుగుపెట్టనుంది. ఇవాళ ఏపీలో పాక్షికంగా భారత్ జోడో యాత్ర కొనసాగనుంది. కర్నాటక నుంచి ఏపీలో ప్రవేశించి 12 కిలోమీటర్ల మేర రాహుల్ గాంధీ యాత్ర కొనసాగుతుంది. ఆ తర్వాత మళ్లీ కర్నాటకలోకి రాహుల్ గాంధీ వెళ్తుంది. ఈ నెల 18 నుంచి అధికారికంగా ఏపీలో రాహుల్ పాదయాత్ర కొనసాగనుంది.