Munugodu Bypoll : మునుగోడులో కాంగ్రెస్ నామినేషన్… పాల్వాయి స్రవంతి కంటతడి
Munugodu Bypoll 2022: కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ముఖ్య నేతలు… టీఆర్ఎస్, బీజేపీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మునుగోడు గడ్డ కాంగ్రెస్ కంచుకోట అని… ఈ ఎన్నికలో స్రవంతిని గెలిపించాలని కోరారు.
Congress Candidate Palvai Sravanti Filed Nomination: మునుగోడు కాంగ్రెస్ అభ్యర్తి పాల్వాయి స్రవంతి శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. బంగారిగడ్డ నుంచి చండూర్ లోని తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, భట్టివిక్రమార్క, రాంరెడ్డి దామోదర్ రెడ్డి, జగ్గారెడ్డి, షబీర్ అలీతో పాటు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
రేవంత్ ఫైర్…
Reavanth reddy fires on trs and bjp: మరోవైపు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ శ్రేణులు భారీగా పాల్గొన్నాయి. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి… టీఆర్ఎస్, బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డబ్బులతో ఓటర్లను కొనుగోలు చేయాలని రెండు పార్టీలు చూస్తున్నాయని విమర్శించారు. మునుగోడు ప్రజలు అమ్ముడుపోవడానికి సిద్ధంగా లేరని... అమ్ముడు పోవడానికి కార్యకర్తలేమీ గుత్తేదారులు కాదని వ్యాఖ్యానించారు.. వేలాది మంది కార్యకర్తలు తమకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తున్నారని చెప్పారు. మునుగోడు పౌరుషాల గడ్డ అని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో నన్ను ఓడించేందుకు కొడంగల్‌ను దత్తత తీసకుంటున్నానని కేటీఆర్ చెప్పారని... కానీ, ఇప్పటివరకు అక్కడ ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు.
"మునుగోడు ప్రజలను కొడంగల్ తీసుకెళ్లి చూపిస్తాను. నేను వేయించిన రోడ్లపై గుంతలు పడితే తట్టెడు మట్టివేసే దిక్కులేదు. రేపో మాపో వాళ్ల తండ్రి మునుగోడుకు వస్తారు. కుర్చీ వేసుకొని ఇక్కడే కూర్చుంటా.. మునుగోడుకు సముద్రం తెస్తానని చెబుతారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ఫామ్‌హౌస్‌కే పరిమితం అవుతారు" అని దుయ్యబట్టారు.
ఉప ఎన్నిక నియోజకవర్గ అభివృద్ధికి రాలేదన్నారు రేవంత్ రెడ్డి. ఓ వ్యక్తి అమ్ముడు పోతే వచ్చిందని దుయ్యబట్టారు. రాజగోపాల్ రెడ్డి కన్న తల్లిలాంటి పార్టీకి ద్రోహం చేసి శత్రువు పంచన చేరాడని అన్నారు. స్రవంతిని గెలిపిస్తే సమ్మక్క, సారక్కలా సీతక్కతో కలిసి అసెంబ్లీలో కొట్లాడుతారని తెలిపారు.
స్రవంతి కంటతడి....
అభ్యర్థి పాల్వాయి స్రవంతి తన తండ్రి(పాల్వాయి గోవర్థన్ రెడ్డి)ని గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకున్నారు. తండ్రిని గుర్తు తెచ్చుకుంటూ.. ఈరోజు నాన్నలేని లోటు తనకి తెలుస్తుందని వ్యాఖ్యానించారు. 'ఇక్కడ ఉన్న మీరందరూ నా తోబుట్టువులై, నా తండ్రిస్థానం తీసుకుని, నాతోపాటు నడవాలని నా చేతులు చాచి, నా కొంగు చాచి ప్రాదేయపడుతున్నాను. మీ ఒక్క ఓటు, మీ ఒక్కటే ఒక్క ఓటు ఈసారి ఈ ఎన్నికల్లో నాకే వేయాలని కోరుతున్నా అంటూ గద్గదస్వరంతో మాట్లాడారు.
ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి మాట్లాడుతూ స్రవంతిని గెలిపించాలని కోరారు. రాజకీయంగా భవిష్యత్తును ఇచ్చిన కాంగ్రెస్ ను రాజగోపాల్ రెడ్డి మోసం చేశారని విమర్శించారు. ఇక సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి... మాట్లాడగా కార్యకర్తల నుంచి మంచి స్పందన వచ్చింది. ఆయన ప్రసంగం కూడా కార్యకర్తల్లో జోష్ ను నింపింది.
ఈ నెల 7న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ ఈ రోజుతో ముగిసింది. శనివారం అధికారులు నామినేషన్లు పరిశీలించనున్నారు. ఈ నెల 17వ తేదీ వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. నంబర్ 3న మునుగోడు ఉప ఎన్నిక నిర్వహిస్తారు.