Telugu News  /  Telangana  /  Trs Speedup Operation Akarsh In Telangana Over Munugodu Bypoll
టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్షన్
టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్షన్

TRS Operation Akarsh: టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్… దిమ్మతిరిగేలా కౌంటర్ షురూ..!

21 October 2022, 15:12 ISTHT Telugu Desk
21 October 2022, 15:12 IST

joinings in trs party: మునుగోడు ఉప ఎన్నిక వేళ తెలంగాణ రాజకీయాలు అత్యంత ఆసక్తిని రేపుతున్నాయి. బీజేపీ నేతలే టార్గెట్ గా టీఆర్ఎస్… ఆపరేషన్ ఆకర్షన్ షురూ చేసింది. ఇందులో భాగంగా కీలక నేతలు... గులాబీ గూటికి ఒక్కొక్కరిగా చేరిపోతున్నారు.

trs speed up operation akarsh: మునుగోడు బైపోల్.... ప్రధాన పార్టీలకు అతిపెద్ద టాస్క్...! గెలిస్తే ఫైనల్ వార్ కు గట్టి ఆత్మవిశ్వాసమే కాదు... పుల్ జోష్ తో అడుగుపెట్టవచ్చు. ఓడితే మాత్రం...చాలా లెక్కలను సరిచేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు నెగిటివ్ మూడ్ తో సాధారణ ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుందనే వాదన కూడా ఉంది. రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని ప్రభావితం చేసే ఎన్నికగా మునుగోడు వార్ మారటంతో... టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిపోయింది. ఈ నేపథ్యంలో అధికార టీఆర్ఎస్... వేగంగా పావులు కదిపేస్తోంది. ఆపరేషన్ ఆకర్ష్ స్పీడ్ పెంచటంతో... పాత నేతలను తమ వైపు తిప్పుకుంటోంది. మొత్తంగా భారీ ఆపరేషన్ కే తెరదించారనే చర్చ నడుస్తోంది. అసలు టీఆర్ఎస్ ఏం చేయబోతుందనేది రాజకీయవర్గాల్లో అత్యంత ఆసక్తికరంగా మారింది.

ట్రెండింగ్ వార్తలు

వారిపైనే ఫోకస్...

టీఆర్ఎస్ మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్... బీజేపీలోకి వెళ్లటంతో అలర్ట్ అయిన గులాబీ అధినాయకత్వం... వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టింది. పాత మిత్రులపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా సామాజికవర్గాల వారీగా చర్చలు మొదలుపెట్టేసింది. వెనువెంటనే కాంగ్రెస్ పార్టీకి చెందిన పల్లె రవి కుమార్ గౌడ్ దంపతులను పార్టీలోకి రప్పించింది. అంతటితో ఆగని టీఆర్ఎస్... అదే సామాజికవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బూడిద బిక్షమయ్య గౌడ్ ను పార్టీలోకి తీసుకువచ్చి బీజేపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఆయనతో పాటు మునుగోడులో కీలకంగా ఉన్న పలువురు నేతలు కూడా టీఆర్ఎస్ లో చేరారు. అంతకుముందు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు దంపతులు కూడా తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరిన సంగతి తెలిసిందే.

మరికొందరితోనూ చర్చలు...!

మునుగోడు ఫలితంతో ప్రతిపక్ష పార్టీలకు గట్టి జవాబు ఇవ్వాలని భావిస్తున్న టీఆర్ఎస్.... చేరికలపై దృష్టిసారించింది. కొద్దిరోజుల కిందటే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్ కూడా రాజీనామా ఇచ్చారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇదే బాటలో శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్ తో పాటు మరికొందరు నేతలు కూడా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రగతి భవన్ వేదికగా చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. అన్నీ కుదిరితే గతంలో కేసీఆర్ తో కలిసి పని చేసిన నేతలందర్నీ పార్టీలోకి రప్పించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

మొత్తంగా బీజేపీ దూకుడుతో టీఆర్ఎస్ పూర్తి స్థాయిలో అప్రమత్తమైనట్లు సీన్ క్లియర్ కట్ గా కనిపిస్తోంది. స్వయంగా మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగి పరిస్థితులను చక్కదిద్దుతున్నట్లు సమాచారం. మరోవైపు టీఆర్ఎస్ లోకి ఇంకెంతమంది నేతలు వెళ్తారనే ఆసక్తి కూడా అందరిలోనూ నెలకొంది.