Vikarabad Railway Station Accident : వికారాబాద్ రైల్వేస్టేషన్ లో ప్రమాదం జరిగింది. రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడు అదుపుతప్పి ట్రైన్, ప్లాట్ ఫామ్ మధ్యలో పడిపోయాడు. ప్రయాణికుడిని గమనించిన రైల్వే సిబ్బంది ట్రైన్ ను నిలిపివేశారు. దాదాపు రెండు గంటలు పాటు ప్రయాణికుడు ప్లాట్ ఫామ్ మధ్య ఇరుక్కుని నరకయాతన అనుభవించాడు. రైల్వే పోలీసులు ప్లాట్‌ఫామ్ పగులగొట్టి ఇరుక్కున్న ప్రయాణికుడిని రక్షించారు. ప్రయాణికుడి పరిస్థితి విషమంగా ఉండటంతో అతడిని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వ్యక్తి రాయచూర్‌కు చెందిన సతీష్ గా రైల్వే పోలీసులు గుర్తించారు. ప్రయాణికుడు ప్లాట్ ఫామ్ మధ్యలో ఇరుక్కున్న ఘటన అక్కడి కెమెరాల్లో రికార్డైంది. ఈ ఘటనతో రైలు గంటల పాటు నిలిచిపోయింది. కదులుతున్న రైలు ఎక్కడం, దిగడం ప్రమాదకరమని ఈ ఘటనతో మరోసారి రుజువైంది.
రైల్వే ప్రయాణికులు తరచూ రిజర్వేషన్ చేయించుకున్న స్టేషన్ లో కాకుండా తదుపరి స్టేషన్ లో రైలు ఎక్కుతుంటారు. ఒకవేళ ఈ సీట్ల టీటీఈ ఇతర ప్రయాణికులకు కేటాయిస్తే వారిటో వాగ్వాదానికి దిగిన ఘటనలు చూస్తుంటాం. ఇలాంటి ఘటనలకు చెక్ పెట్టేందుకు రైల్వే అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. రిజర్వేషన్ చేయించుకున్న స్టేషన్ లోనే ప్రయాణికులు ఎక్కాల్సి ఉంటుంది. గతంలో టీటీఈ వద్ద ప్రింటెడ్ రిజర్వేషన్ లిస్టును ఉండేది. ఒకవేళ ప్రయాణికులు ఆలస్యంగా ఎక్కినా ఒకటి, రెండు స్టేషన్ల వరకు టీటీఈలు వేచి చూసేవారు. కానీ ఇప్పుడు అందుకు అవకాశం లేదని రైల్వే అధికారులు చెబుతున్నారు. టీటీఈలకు ట్యాబ్స్ మాదిరిగా ఉండే హ్యాండ్ హెల్డ్ టెర్మినల్స్ ఇచ్చారు. వీటిలో రైలులో రిజర్వేషన్ ప్రయాణికుల వివరాలను పరిశీలిస్తున్నారు. ఆ పరికరాల్లో ఎప్పటికప్పుడు వివరాలు అప్‌లోడ్ అవ్వడంతో... తర్వాతి రైల్వే స్టేషన్ వచ్చే లోపు ఆర్‌ఏసీ, వెయిటింగ్ లిస్ట్‌లో ఉన్న ప్రయాణికులకు ఆ బెర్త్‌లు కేటాయించేందుకు అవకాశం ఉంటుంది. దీంతో తర్వాత స్టేషన్‌లో ఎక్కి నా బెర్త్ అని వాదించడానికి అవకాశం లేదు.
మెక్సికో ఎయిర్ పోర్టులో ఓ వ్యక్తిని హల్ చల్ చేశాడు. తాను ప్రయాణించాల్సిన ఓ విమానం నాలుగు గంటల పాటు ఆలస్యంగా రావడంతో ఆగ్రహంలో ఫ్లైట్ ఎమర్జెన్సీ డోర్ తెరిచాడు. ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు వచ్చి విమానం రెక్కపై ఎక్కి చక్కర్లు కొట్టాడు. గత గురువారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మెక్సికో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో విమానం టేకాఫ్ కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఓ ప్రయాణికుడు ఎమర్జెన్సీ డోర్ తెరిచిబయటకు వచ్చాడు. ఉదయం 08.50 గంటలకు బయలుదేరి 10.46 గంటలకు గమ్యాన్ని చేరుకోవాల్సిన విమానం 4 గంటలు గడిచినా బయలుదేరకపోవడంతో ప్రయాణికుడు అసహనానికి గురైయ్యాడు. గ్వాటెమాలాకు వెళ్లాల్సిన విమానంలో ఒక ప్రయాణికుడు హల్ చల్ చేశారు. విమానంలో సాంకేతిక సమస్య కారణంగా ఆలస్యమైందని తెలిపింది. ఈ ఘటన కారణంగా ప్రయాణికులను మరో విమానానికి మార్చాల్సి వచ్చిందని నిర్వాహకులు తెలిపారు. ఈ ఘటనలో ప్రయాణికుడికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించినట్టు మెక్సికో ఎయిర్ పోర్టు సిబ్బంది తెలిపారు.