US Student Visa Slots: మే రెండో వారంలో అందుబాటులోకి యూఎస్ స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూ స్లాట్లు
US Student Visa Slots: అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఎదురు చూస్తున్న భారతీయ విద్యార్ధులకు కాన్సులేట్ తీపి కబురు చెప్పింది. మే రెండో వారంలో స్టూడెంట్ వీసా స్లాట్లు ప్రారంభం కానున్నాయి.
US Student Visa Slots: అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఎదురు చూస్తోన్న విద్యార్ధులకు తీపి కబురు అందింది. త్వరలో స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూ స్లాట్లను విడుదల చేసేందుకు అమెరికా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దశల వారీగా స్లాట్లను విడుదల చేయనున్నారు.
మే రెండో వారం నుంచి ఆగష్టు రెండో వారం వరకు స్టూడెంట్ వీసా ఇంటర్వ్యూ స్లాట్లు అందుబాటులోకి వస్తాయి. అమెరికాలో ఫాల్ సీజన్‌లో చదువులకు సంబంధించిన సెమిస్టర్ ఆగష్టు -సెప్టెంబర్‌లలో మొదలవుతుంది. ఈ ప్రవేశాల కోసం తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున విద్యార్ధులు అమెరికా వెళ్తారు.
వీసా ఇంటర్వ్యూ తేదీల కోసం విద్యార్ధులు చాలా రోజులుగా ఎదురు చూస్తున్నారు. భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయంతో పాటు హైదరాబాద్, చెన్నై, కోల్‌కత్తా, ముంబై కాన్సులేట్ కార్యాలయాల్లో ఇంటర్వ్యూ స్లాట్లు అందుబాటులోకి వస్తాయి.
భారతీయ విద్యార్థులకు సేవలు అందించేందుకు కాన్సులేట్ కార్యాలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. భారత్- అమెరికా ప్రజల మధ్య ఉన్న సంబంధాల దృష్ట్యా భారత విద్యార్ధులకు అమెరికా అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కాన్సులేట్ వర్గాలు తెలిపాయి.
గత ఏడాది 11లక్షల వీసాలు జారీ..
2023లో రికార్డుస్థాయిలో 11 లక్షల నాన్ ఇమ్మిగ్రెంట్ వీసాలను భారతీయులకు అమెరికా జారీ చేశారు. దాదాపు 3.75 లక్షల మందికి పిటిషన్ ఆధారిత తాత్కాలిక ఉపాధి కోసం ఇచ్చే హెచ్1బీ వీసాలను కూడా జారీ చేశారు. భారత్ నుంచి వీసాల కోసం డిమాండ్ భారీగా ఉండటంతో అందుకు అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా హైదరాబాద్‌లో 300 మిలియన్ డాలర్ల వ్యయంతో నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
భారత్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తైన తర్వాత అమెరికాలో ఐటీ ఆధారిత కోర్సులు చేసేందుకు విద్యార్ధులు ఆసక్తి చూపుతున్నారు. స్టెమ్ కోర్సులతో పాటు వినూత్న కోర్సులపై భారతీయ విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, మైక్రో ఇంజినీరింగ్‌తో పాటు కంప్యూటర్ కోర్సులైన ఏఐ, రోబోటిక్స్ కోర్సులకు ప్రాధాన్యం ఇస్తున్నారు.
కొందరు విద్యార్ధులు సైకాలజీ సబ్జెక్టుపై వైపు కూడా ఆసక్తి చూపుతున్నారు. అమెరికా- భారతీయ విశ్వవిద్యాలయాలు నిర్వహిస్తున్న డ్యూయల్ డిగ్రీలకు కూడా ప్రాధాన్యం ఇస్తున్నారు.
గరిష్ట స్థాయికి చేరిన భారత విద్యార్ధులు…
2022-23 లెక్కల ప్రకారం అమెరికాలో ఆప్ష నల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)లో 69,062 మంది విద్యార్థులతో భారతదేశం అగ్రస్థానంలో ఉంది. కోవిడ్ తర్వాత వరుసగా మూడో ఏడాది కూడా ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే భారతీయ విద్యార్థులు పెద్దసంఖ్యలో అమెరి కాలో ఉన్నత చదువుల కోసం వెళ్లారని కాన్సులేట్ వర్గాలు ప్రకటించాయి. తాజాగా అమెరికాలో చదువుకుం టున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 2,68,923కు చేరింది. ఇప్పటి వరకు ఇదే గరిష్ట సంఖ్యగా పేర్కొన్నారు.
అమెరికాలో చదువుకుంటున్న ప్రతి పది లక్షల మంది విదేశీ విద్యార్థుల్లో రెండున్నరలక్షల మంది అంటే దాదాపు 25% మంది భారతీయులే ఉన్నారు. 2023లో గ్రాడ్యుయేట్ కోర్సుల కోసం వెళ్లే విద్యార్థుల సంఖ్య 63% పెరిగింది. అండర్ గ్రాడ్యుయేట్స్ 16% పెరిగారని అమెరికా వర్గాలు తెలిపాయి.
కాన్సులేట్ వెబ్ సైట్ సమస్య పరిష్కారం…
అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవహారాల్లో వెబ్సైట్‌లో తలెత్తుతున్న ఇబ్బందులను చక్క దిద్దినట్లు అధికారులు తెలిపారు. "వీసా స్లాట్ బుకింగ్ వెబ్సైట్ 2023 జులైలో ఆధు నికీకరించినట్టు వెల్లడించారు. సాంకేతిక లోపాలను తగ్గించేందుకు నూతన వ్యవస్థను తీసుకువచ్చారు. కొన్ని సందర్భాల్లో ఇబ్బం దులు ఎదురవుతున్నాయనే ఫిర్యాదులు వచ్చాయని ఎప్పటికప్పుడు వాటిని పరిష్కరిస్తున్నట్లు వెల్లడించారు. వీసా విషయంలో సమస్యలు ఎదురవుతుంటే సహాయం కోసం support-india@ustravelsdocs.com కు మెయిల్ చేయొచ్చని తెలిపారు.
సంబంధిత కథనం