US Consulate Jobs: యూఎస్‌ కాన్సులేట్‌లో తాపీ మేస్త్రీ ఉద్యోగం…జీతం తెలిస్తే షాక్-notification for the job of mason in us consulate of hyderabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Us Consulate Jobs: యూఎస్‌ కాన్సులేట్‌లో తాపీ మేస్త్రీ ఉద్యోగం…జీతం తెలిస్తే షాక్

US Consulate Jobs: యూఎస్‌ కాన్సులేట్‌లో తాపీ మేస్త్రీ ఉద్యోగం…జీతం తెలిస్తే షాక్

Sarath chandra.B HT Telugu

US Consulate Jobs: హైదరాబాద్‌ యూఎస్‌ ఎంబసీలో తాపీమేస్త్రీ ఉద్యోగానికి నోటిఫికేషన్ విడుదలైంది. ఉద్యోగ ప్రకటనలో ప్రకటించిన జీతం అందర్నీ అవాక్కయ్యేలా చేసింది. ఇంతకీ జీతం ఎంతంటే..

భారీ వేతనంతో యూఎస్‌ కాన్సులేట్‌లో తాపీ మేస్త్రీ ఉద్యోగానికి నోటిఫికేషన్

US Consulate Jobs: హైదరబాద్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో తాపీమేస్త్రీ ఉద్యోగం భర్తీ కోసం ప్రకటన వెలువడింది. తాపీమేస్త్రీ ఉద్యోగానికి ప్రకటనే ఆశ్చర్యం కలిగిస్తే అందులో పేర్కొన్న జీతం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

హైదరాబాద్‌ కాన్సుల్ జనరల్‌ కార్యాలయంలో తాపీమేస్త్రీ ఉద్యోగాన్ని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ ప్రకటనలో అందరిని ఆకర్షించిన మరో అంశం ఉంది. వార్షిక వేతనం రూ.4,47,348గా పేర్కొన్నారు. నెల జీతం లెక్కలో చూస్తే రూ.37,279గా తాపీమేస్త్రీ వేతనాన్ని నిర్ణయించారు. వేతనంతో పాటు అదనపు ప్రయోజనాలు కూడా వర్తిస్తాయి.

ఈ ఉద్యోగాన్ని ఫుల్‌టైమ్‌ జాబ్‌గా పేర్కొన్నారు. ఎవరైనా ఈ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అమెరికా కాన్సుల్‌ వర్గాలు ప్రకటించాయి. అమెరికా కాన్సుల్‌లో శాశ్వత ఉద్యోగంగా పేర్కొన్నారు. ప్రొబేషనరీ పీరియడ్‌ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్ధి వారానికి 40గంటల పాటు పనిచేయాల్సి ఉంటుంది. ధృవపత్రాల ధృవీకరణ, బ్యాక్‌ గ్రౌండ్ వెరిఫికేషన్‌ తర్వాత కనీసం 4 నుంచి 8వారాల్లో ఉద్యోగంలో చేరాల్సి ఉంటుంది.

అనుభవమే అర్హత…

విధుల్లో భాగంగా కొత్త గోడలు నిర్మించడం, కాంక్రీట్‌ సహా తాపీ పనులు చేయాల్సి ఉంటుంది. కనీసం రెండేళ్ల వృత్తి అనుభవం ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. కాంక్రీట్‌ మిక్చర్‌లలో రకాలు, రకరకాల ఇటుకలతో నిర్మాణం, ఫ్లోరింగ్ పనులు, మార్బుల్ ఫ్లోరింగ్‌, హాలో బ్రిక్స్, రాతి కట్టడాల నిర్మాణంలో అనుభవం ఉండాలి. దీంతో పాటు రకరకాల పనులకు మెటీరియల్ అంచనాలు రూపొందించగలగాలి.

గడువు తేదీ…

తాపీమేస్త్రీ ఉద్యోగానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఫిబ్రవరి 25లోగా సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థి కనీసం 8వ తరగతి పూర్తి చేసి ఉండాలి. ఇంగ్లీష్‌ అర్థం చేసుకోవాలి. లెవల్ 1 ఇంగ్లీష్ నైపుణ్యాన్ని పరీక్షిస్తారు. తెలుగు, హిందీ భాషల్లో లెవల్‌ 3 వరకు నైపుణ్యాన్ని పరిశీలిస్తారు. ఉద్యోగానికి ఎంపికైన అభ‌్యర్థులు మెడికల్ పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. సెక్యూరిటీ ధృవీకరణల్లో అర్హత సాధించాల్సి ఉంటుంది.

హెల్పర్ ఉద్యోగం...

అమెరికా కాన్సులేట్‌ హెల్పర్‌ ఉద్యోగానికి కూడా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఫిబ్రవరి 11లోగా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఏటా రూ.3,84,265రుపాయల వేతనం చెల్లిస్తారు. అభ్యర్థులు తప్పనిసరిగా భారతీయ డ్రైవింగ్ లైసెన్సు కలిగి ఉండాలి. దీంతో పాటు సెమి స్కిల్ పనులు తెలిసి ఉండాలి. ప్లంబింగ్‌, ఎలక్ట్రికల్, కార్పెంటరీ, అతర పనుల్లో అనుభవం ఉండాలి. నిర్మాణ సంబంధిత పనులు, రిపేర్లు, మెటిరియల్ అంచనాల తయారీలో అనుభవం ఉండాలి. కనీసం పదో తరగతి ఉత్తీర్ణత పొంది ఉండాలి.

అమెరికా రాయబార కార్యాలయాల్లో పనిచేసే ఇతర దేశీయులకు వర్తించే ప్రయోజనాలను కల్పిస్తారు. ఇందులో భాగంగా హెల్త్ సదుపాయాలతో పాటు ఇతర ప్రయోజనాలు వర్తిస్తాయి. ఉద్యోగ నియామక సమయంలో ఇతర ప్రయోజనాలను వివరిస్తారు. అభ్యర్థి దరఖాస్తులో పేర్కొన్న వివరాలకు అనుగుణంగా విద్యార్హత పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

తాపీమేస్త్రీ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ ఇదే…

యూఎస్‌ కాన్సుల్‌లో హెల్పర్‌ ఉద్యోగానికి సంబంధించిన నోటిఫికేషన్ లింక్ ఇదే…