Visa Free Travel : 'వీసా' లేకుండానే వెళ్లొచ్చు - భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పిన ఇరాన్-iranian embassy lists 4 conditions for visa free travel facility for indians read the full story ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  Business  /  Iranian Embassy Lists 4 Conditions For Visa-free Travel Facility For Indians Read The Full Story

Visa Free Travel : 'వీసా' లేకుండానే వెళ్లొచ్చు - భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పిన ఇరాన్

Maheshwaram Mahendra Chary HT Telugu
Feb 07, 2024 10:46 AM IST

Visa Free Travel to Iran: వీసా నిబంధనల్లో మార్పులు చేసింది ఇరాన్ ప్రభుత్వం. ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 15 రోజుల పాటు వీసా లేకుండానే భారతీయులు ఇరాన్ లో పర్యటించేందుకు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు నాలుగు షరతులను ప్రకటించింది.

ఇరాన్ కు వీసా ఉచితం (AFP FILE)
ఇరాన్ కు వీసా ఉచితం (AFP FILE)

Visa Free Travel to Iran : భారతీయులకు గుడ్ న్యూస్ చెప్పింది ఇరాన్ దేశ ప్రభుత్వం. వీసా రహిత ప్రయాణానికి అనుమతి ఇస్తూనే… పలు షరతులను విధించింది. ఈ వివరాలను ఆ దేశ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది, కేవలం విమాన ప్రయాణికులకు మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుందని స్పష్టం చేసింది. గరిష్టంగా 15 రోజులు మాత్రమే ఉండేందుకు అనుమతి ఇస్తున్నట్లు పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

భారతదేశం, రష్యా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, ఇండోనేషియా, జపాన్, సింగపూర్, మలేషియా, బ్రెజిల్ మరియు మెక్సికోలతో సహా 33 దేశాలకు వీసా- ఫ్రీ నిర్ణయాన్ని ఇరాన్ డిసెంబర్‌లో ఆమోదించింది. ఇరాన్ సాంస్కృతిక వారసత్వం, పర్యాటకం మరియు హస్తకళల మంత్రి ఎజ్జతోల్లా జర్ఘామి మాట్లాడుతూ…. ఈ నిర్ణయం ద్వారా…. ఇరాన్ లో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. ప్రపంచ దేశాల నుండి ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ముఖ్యంగా ప్రపంచ దేశాల్లో నెలకొని ఉన్న ఇరానో ఫోబియా (Iranophobia) ను అంతం చేయాలని, ఆ ఇరానోఫోబియాను ప్రచారం చేస్తున్నవారి ఆట కట్టించడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు.

నాలుగు షరతులు….

వీసా లేకుండానే ప్రయాణాలకు అనుమతి ఇచ్చిన ఇరాన్ ప్రభుత్వం… నాలుగు షరతులను విధించింది. ఈ మేరకు ఇరాన్ రాయబార కార్యాలయం ఒక ప్రకటనలో వివరాలను పేర్కొంది. సాధారణ పాస్‌పోర్ట్‌లు కలిగిన భారతీయులు ప్రతి ఆరు నెలలకు ఒకసారి వీసా లేకుండా ఇరాన్‌లోకి ప్రవేశించేందుకు అనుమతి ఇస్తామని తెలిపింది. గరిష్టంగా 15 రోజులు మాత్రమే బస చేయాల్సి ఉంటుందని వెల్లడించింది. కేవలం విమానప్రయాణాల ద్వారా వచ్చే ప్రయాణికులకు ఈ మాత్రమే ఈ నిర్ణయం వర్తిస్తుందని వివరించింది. పర్యాటకం కోసం ఇరాన్ కు వచ్చే భారతీయులకు కూడా ఇది వర్తిస్తుందని చెప్పింది. అయితే ఎక్కువ రోజుల పాటు ఉండాలనుకునే భారతీయ పౌరులు…. భారత్ లో ఉన్న ఇరాన్ రాయబార కార్యాలయం నుండి అవసరమైన వీసాలను పొందాలని పేర్కొంది.

వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం… 2022లో ఇరాన్ విదేశీ పర్యాటకుల రాక అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 315% పెరిగింది. 2021లో 990,000 నుండి 2022లో దాదాపు 4.1 మిలియన్ల మంది పర్యాటకులు ఇరాన్‌ను సందర్శించారు. ఇదే విషయంపై మంత్రి ఎజ్జతోల్లా జర్ఘామి మాట్లాడుతూ… 2023లో భారతదేశం నుండి ఇరాన్ వచ్చే ప్రయాణికుల సంఖ్యలో "గణనీయమైన వృద్ధి" ఉందన్నారు. 2023 మొదటి ఆరు నెలల్లో 31,000 మంది భారతీయులు ఇరాన్‌ను సందర్శించారు, 2022లో ఇదే కాలంతో పోలిస్తే 25% వృద్ధి నమోదైంది.చాలా మంది విదేశీ యాత్రికులు పర్యాటకం, వాణిజ్యం, వైద్యం మరియు తీర్థయాత్రల కోసం ఇరాన్‌ను సందర్శిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ దేశాలకే..

భారత్ సహా రష్యా (గ్రూప్ విజిట్స్), యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, ఖతార్, కువైట్, లెబనాన్, ఉజ్బెకిస్తాన్, కిర్గిజ్స్తాన్, తజికిస్తాన్, ట్యునీషియా, మౌరిటానియా, టాంజానియా, జింబాబ్వే, మారిషస్, సీషెల్స్, ఇండోనేషియా, బ్రూనై, జపాన్, సింగపూర్, కాంబోడియా మలేషియా, వియత్నాం, బ్రెజిల్, పెరూ, క్యూబా, మెక్సికో, వెనిజులా, బోస్నియా మరియు హెర్జెగోవినా, సెర్బియా, క్రొయేషియా మరియు బెలారస్ దేశాలకు వీసా ఫ్రీ ఎంట్రీ అవకాశాన్ని ఇరాన్ కల్పించింది. గతంలో టర్కీ, రిపబ్లిక్ ఆఫ్ అజర్‌బైజాన్, ఒమన్, చైనా, ఆర్మేనియా, లెబనాన్, సిరియా లకు ఇరాన్ ఆ అవకాశం కల్పించింది.

WhatsApp channel

సంబంధిత కథనం

టాపిక్