Grammy Awards 2024: భారత్‍కు గ్రామీ అవార్డుల పంట: ఇండియాకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందన్న శంకర్ మహదేవన్-grammy awards 2024 i felt proud to represent india says shankar mahadevan and ustad zakir hossain bags three awards ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Grammy Awards 2024: భారత్‍కు గ్రామీ అవార్డుల పంట: ఇండియాకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందన్న శంకర్ మహదేవన్

Grammy Awards 2024: భారత్‍కు గ్రామీ అవార్డుల పంట: ఇండియాకు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉందన్న శంకర్ మహదేవన్

Chatakonda Krishna Prakash HT Telugu
Feb 05, 2024 08:13 PM IST

Grammy Awards 2024 - Shankar Mahadevan: గ్రామీ అవార్డుల్లో భారత్‍కు పురస్కారాల పంట పండింది. భారత ప్రముఖ గాయకుడు శంకర్ మహదేవన్‍ గ్రామీ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత సంతోషంతో మాట్లాడారు.

Grammy Awards 2024: గ్రామీ అవార్డు అందుకున్న శంకర్ మహదేవన్, గణేశ్ రాజగోపాలన్, జాకీర్ హుసేన్, సెల్వగణేశన్
Grammy Awards 2024: గ్రామీ అవార్డు అందుకున్న శంకర్ మహదేవన్, గణేశ్ రాజగోపాలన్, జాకీర్ హుసేన్, సెల్వగణేశన్ (PTI)

Grammy Awards 2024: ప్రతిష్టాత్మక అంతర్జాతీయ మ్యూజిక్ అవార్డులు ‘గ్రామీ’లో ఈ ఏడాది భారత్‍కు పంట పండింది. భారత ప్రముఖ తబలా వాయిద్యకారుడు ఉస్తాద్ జాకీర్ హుసేన్‍కు మొత్తంగా మూడు గ్రామీ అవార్డులు దక్కాయి. పాస్తో అల్బమ్‍‍కు గాను ఆయనకు బెస్ట్ మ్యూజిక్ గ్లోబల్ పర్ఫార్మెన్స్ అవార్డు దక్కింది. భారత పాపులర్ గాయకుడు శంకర్ మహదేవన్ తొలిసారి గ్రామీ పురస్కారం అందుకున్నారు. శంకర్ మహదేవన్, ఉస్తాద్ జాకీర్ హుసేన్ ఉన్న భారత్‍కు చెందిన ‘శక్తి’ మ్యూజికల్ బ్యాండ్‍కు బెస్ట్ గ్లోబల్ ఆల్బమ్ అవార్డు వచ్చింది. ఈ బ్యాండ్ రూపొందించిన ‘దిస్ మూవ్‍మెంట్’ అనే స్టూడియో ఆల్బమ్‍కు గ్రామీ పురస్కారం దక్కింది. అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో తన తొలి గ్రామీ అవార్డు అందుకున్నాక శంకర్ మహదేవన్ హెచ్‍టీతో మాట్లాడారు. భారత్‍కు ప్రాతినిధ్యం వహిస్తుండడం తనకు గర్వంగా అనిపిస్తోందని అన్నారు.

ఫీలింగ్ చెప్పలేకున్నా..

గ్రామీ అవార్డు దక్కడం చాలా సంతోషంగా అనిపించిందని, ఈ ఫీలింగ్‍ను వ్యక్తం చేయలేకున్నానని శంకర్ మహదేవన్ అన్నారు. “మా పేరు ప్రకటించినప్పుడు.. ఓ క్షణం పాటు నేను గుర్తించలేకపోయా. మేం చాలా సంతోషించాం. ఆ ఫీలింగ్‍ను చెప్పడం చాలా కష్టం” అని మహదేవన్ చెప్పారు.

66వ గ్రామీ అవార్డుల వేదిక వద్ద కోలాహలం గురించి కూడా శంకర్ మహదేవన్ చెప్పారు. “ఇదో అద్భుతమైన వేదిక. ప్రపంచం అత్యధికంగా మాట్లాడుకునే మ్యూజికల్ ఎక్స్‌పీరియన్స్ ఇది. అలాంటి వేదికపైకి ఎక్కడం, ఈ గొప్ప గౌరవాన్ని పొందడం మాటల్లో వివరించలేకున్నా” అని శంకర్ మహదేవన్ చెప్పారు.

గర్వంగా ఉంది

గ్రామీ అవార్డుల్లో భారత్‍కు ప్రాతినిధ్యం వహిస్తూ పురస్కారం అందుకోవడం చాలా గర్వంగా ఉందని శంకర్ మహదేవన్ చెప్పారు. “గ్రామీల్లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించడం ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా చేసింది. ప్రపంచస్థాయి కళాకారులతో కళకళలాడుతున్న ఈ ఈవెంట్‍లో ఉండడం, భారత్‍కు ప్రాతిధ్యం వహించడం, ప్రశంసలు అందుకోవడం చాలా సంతోషాన్ని ఇస్తోంది. భారత్‍కు ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది” అని శంకర్ మహదేవన్ చెప్పారు.

తన భార్య సంగీతకు ఈ గ్రామీ అవార్డును అంకితమిస్తున్నట్టు శంకర్ మహదేవన్ చెప్పారు. అయితే, గాయం వల్ల ఆమె ఈ వేడుకకు రాలేకపోయారని తెలిపారు. “‘ట్రావెల్ చేయాల్సిన రోజు ముందు రాత్రి ఆమె కాలికి గాయమైంది. దీంతో ఆమె ఇక్కడికి రాలేకపోయారు” అని ఆయన తెలిపారు.

శక్తి బ్యాండ్‍లో శంకర్ మహదేవన్ (గాయకుడు), ఉస్తాద్ జాకీర్ హుసేన్ (తబలా ప్లేయర్)తో పాటు జాన్‍మెక్‍లాఫిన్ (గిటారిస్ట్), వి సెల్వగణేశన్ (పుకాషనిస్ట్), గణేశ్ రాజగోపాలన్ (వయోలినిస్ట్) ఉన్నారు. ఈ శక్తి బ్యాండ్.. ‘ది మూవ్‍మెంట్’ ఆల్బమ్‍కు గాను 66వ గ్రామీ అవార్డుల్లో బెస్ట్ గ్లోబల్ ఆల్బమ్ అవార్డు గెలిచి చరిత్ర సృష్టించింది. 46 ఏళ్లలో ఈ పురస్కారం దక్కించుకున్న తొలి స్టూడియో ఆల్బమ్‍గా నిలిచింది. ఇక, జాకీర్ హుసేన్ మొత్తంగా మూడు గ్రామీ అవార్డులను గెలుచుకున్నారు.

ఏఆర్ రహమాన్ సెల్ఫీ

ఈ 66వ గ్రామీ అవార్డుల వేడుకకు భారత దిగ్గజ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రహమాన్ కూడా హాజరయ్యారు. గ్రామీ అవార్డులను గెలుచుకున్న శంకర్ మహదేవన్, జాకీర్ హుసేన్‍, సెల్వగణేశ్‍తో ఆయన సెల్ఫీ దిగారు. “ఇండియాకు గ్రామీల వర్షం కురుస్తోంది. గ్రామీ విజేతలు ఉస్తాద్ జాకీర్ హుసేన్ (3 గ్రామీలు), శంకర్ మహదేవన్ (తొలి గ్రామీ), సెల్వగణేశన్ (తొలి గ్రామీ)కు శుభాకాంక్షలు” అంటూ ఈ సెల్ఫీని ఇన్‍స్టాగ్రామ్‍లో పోస్ట్ చేశారు ఏఆర్ రహమాన్.

Whats_app_banner