TS TET Syllabus 2024 Updates: తెలంగాణ టెట్ నోటిఫికేషన్(TS TET 2024) వచ్చేసిన సంగతి తెలిసిందే. మార్చి 27వ తేదీ నుంచి దరఖాస్తుల ప్రక్రియ షురూ కానుంది. తాజాగా షెడ్యూల్ ను కూడా ప్రకటించింది విద్యాశాఖ. ఏప్రిల్ 10వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు. మే 20 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. జూన్ 3వ తేదీతో ఎగ్జామ్స్ ముగియనున్నాయి. https://schooledu.telangana.gov.in వెబ్ సైట్ లోకి వెళ్లి దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేయవచ్చని విద్యాశాఖ సూచించింది.
టెట్ పరీక్షలో అర్హత సాధిస్తేనే డీఎస్సీ (TS DSC) రాసేందుకు వీలు ఉంటుంది. అంతేకాదు ప్రైవేటు పాఠశాలల్లోనూ బోధించాలంటే టెట్ అర్హత తప్పనిసరి. ఈ నేపథ్యంలో టెట్ 2024 పరీక్ష విధానమేంటి..? సిలబస్ లో ఎలాంటి అంశాలు ఉంటాయి...? అర్హత మార్కుల కటాఫ్ వివరాలు చూస్తే ఈ కింది విధంగా ఉన్నాయి….
‘టెట్( TS TET News 2024) పరీక్షలో భాగంగా రెండు పేపర్లు ఉంటాయి. అందులో పేపర్-1 సెకండరీ గ్రేడ్ టీచర్లుగా నియామకానికి, పేపర్-2 స్కూల్ అసిస్టెంట్ పోస్టుల కోసం అర్హత సాధించేందుకు నిర్వహిస్తారు. ఒక్కో పేపర్ 150 మార్కులకు ఉంటుంది. పేపర్-1కు 1-8 తరగతులు, పేపర్-2కు 6-10 తరగతుల ప్రామాణికంగా ప్రశ్నలు ఉంటాయి. అన్ని పేపర్లు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ప్రతి పేపర్‌కు 2:30 గంటల సమయం అందుబాటులో ఉంటుంది. ఒక్కసారి అర్హత సాధిస్తే జీవిత కాలంపాటు సంబంధిత సర్టిఫికెట్ తో డీఎస్సీ రాయవచ్చు. ఇక టెట్ లో మంచి స్కోర్ సాధిస్తే.. డీఎస్సీలో(Telangana DSC ) మార్కులు యాడ్ అవుతాయి. రెండింట్లో వచ్చిన మార్కుల ఆధారంగా తుది జాబితాను రూపొందించి ఫలితాలను విడుదల చేస్తారు.