Jagtial District : ట్రాన్స్‌జెండర్‌ను ప్రేమించిన యువకుడు - ఘనంగా వివాహం
జగిత్యాల జిల్లా గొల్లపెల్లి మండలానికి చెందిన శ్రీనివాస్ అనే యువకుడు ట్రాన్స్ జెండర్‌ను ప్రేమంచి పెళ్లి చేసుకున్నాడు. పెద్దలను ఒప్పంచటంతో వేద మంత్రాల సాక్షిగా ఇద్దరు ఒక్కటయ్యారు. వీరి పెళ్లికి బంధుమిత్రులతోపాటు ట్రాన్స్ జెండర్స్ పెద్ద సంఖ్యలో హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు.
ప్రేమ గుడ్డిది.. ఎంతటికైనా తెగిస్తుంది. అచ్చం అలానే ఉంది జగిత్యాల జిల్లాలో ఓ యువకుడి ప్రేమకథ. ట్రాన్స్ జెండర్ ను ప్రేమించి పెద్దలను ఒప్పించి పెళ్ళి చేసుకున్నాడు. మూడు ముళ్ళ బంధంతో ఏడు అడుగులు నడిచి ఆలుమగలుగా మారి అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు.
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లక్ష్మీపూర్ కు చెందిన మాట్ని శ్రీనివాస్ ప్రేమలో పడ్డాడు. మల్యాల మండలం మ్యాడంపల్లికి చెందిన ట్రాన్స్ జెండర్ కరుణాంజలి ని ప్రేమించాడు. పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. తాను అలాంటి, ఇలాంటి ఆడదాన్ని కాను అంటూ కరుణాంజలి అతని ప్రేమను నిరాకరించింది. శ్రీనివాస్ పట్టువదలలేదు... పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటా లేకుంటే బ్రహ్మచారిగానే మిగిలిపోతానని స్పష్టం చేశాడు. చివరకు ఆయన ప్రేమకు కరుణాంజలి కరిగిపోయింది. పెద్దలను ఒప్పించి లక్ష్మీపూర్ శివాలయం వేదికగా ప్రేమ పెళ్లి చేసుకున్నారు. మూడుముళ్ళ బంధంతో ఏడు అడుగులు నడిచి ఆలుమగలుగా మారి నూతన జీవితంలోకి అడుగుపెట్టారు.
ఒప్పించి పెళ్ళి చేసుకున్నాం….
సాంప్రదాయ పద్ధతిలో మంగళ స్నానం నుంచి అప్పగింతల వరకు అన్నీ నిర్వహించారు. ట్రాన్స్ జెండర్ ప్రేమ పెళ్లికి బంధుమిత్రులతోపాటు ట్రాన్స్ జెండర్స్ పెద్ద సంఖ్యలో హాజరై నవ దంపతులను ఆశీర్వదించారు. ట్రాన్స్ జెండర్ ప్రేమ పెళ్లి చేసుకున్న శ్రీనివాస్ ను అభినందించారు.
రెండేళ్లుగా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నామని నవ దంపతులు తెలిపారు. మ్యారేజ్ కలెక్షన్ కు వెళ్లినప్పుడు చూసిన శ్రీనివాస్ ఇష్టపడ్డాడని కరుణాంజలి తెలిపారు. ట్రాన్స్ జెండర్ అయినప్పటికి ఆమె అంటే తనకు ఇష్టం కావడంతో పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నానని శ్రీనివాస్ తెలిపారు. జీవితాంతం కలిసి ఉంటామని స్పష్టం చేశారు. ఎవరేమనుకున్నా పర్వాలేదు...తమకు ఇష్టమైన పని కష్టమైన అనుభవిస్తామని తెలిపారు
హిజ్రాల హంగామా…!
ట్రాన్స్ జెండర్ లవ్ మ్యారేజ్ అనంతరం నీ బుల్లెట్ బండెక్కి వచ్చెత్తపా...అంటూ పాటేసుకున్నారు. ఈ పెళ్ళికి పెద్ద సంఖ్యలో ఇజ్రాలు, ట్రాన్స్ జెండర్ హాజరై హంగామా చేశారు. డిజె సౌండ్ లతో బారాత్ నిర్వహించి డ్యాన్స్ చేశారు. రాములమ్మ పాటపై డ్యాన్స్ ఇరగదీశారు. ట్రాన్స్ జెండర్ పెళ్ళిలో సందడి చేశారు. సమాజంలో ట్రాన్స్ జెండర్ ను గౌరవించే విధంగా ఒక యువకుడు ముందుకు వచ్చి ప్రేమ పెళ్లి చేసుకోవడం అభినందనీయమని తెలిపారు.